iBam భాగవతం ఆణిముత్యాలు

నవమ స్కంధం

9-106 భువిఁ దూఱన్... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
భువిఁ దూఱన్ భువిఁ దూఱు; నబ్దిఁ జొర నబ్దిం జొచ్చు; నుద్వేగి యై
దివిఁ బ్రాకన్ దివిఁ బ్రాకు; దిక్కులకుఁ బో దిగ్వీథులం బోవుఁ; జి
క్కి వెసన్ గ్రుంగినఁ గ్రుంగు; నిల్వ నిలుచున్; గ్రేడింపఁ గ్రేడించు; నొ
క్కవడిన్ దాపసు వెంటనంటి హరిచక్రం బన్యదుర్వక్ర మై.

iBAT సందర్భం

శ్రీహరికి పరమభక్తుడు అంబరీషుడు. విష్ణుప్రీతికై ఏకాదశినాడు ఉపవసించి ద్వాదశి గడియలు దాటకముందు నిష్ఠతో అతిథులకు అన్నంపెట్టి తాను తింటాడు. ఇది అతని వ్రతం. దుర్వాసమహర్షి అతనికి పరీక్ష పెట్టాడు. చిన్ని తప్పునకు, నిజానికి తప్పు కాదు. తాను తప్పనుకొని మహాకోపంతో అంబరీషునిపై కృత్యను ప్రయోగించాడు. శ్రీహరి కరుణించి వెఱ్ఱితపసికి బుద్ధ్ చెప్పమని చక్రానికి చెప్పి పంపించాడు. అది దుర్వాసుని వెంటపడింది.

iBAT తాత్పర్యము

దుర్వాసుడు ప్రాణాలను దక్కించుకోవటానికి భూమిలోనికి దూరాడు. అతని వెంటనే చక్రమూ దూరింది. సముద్రం లోనికి చొరబారాడు. అది కూడా సముద్రంలోనికి దూరింది. గుండె లదరిపోతుండగా గగనంలోనికి గెంతులు వేశాడు. చక్రం కూడా ఆకాశంలో చిత్రచిత్రంగా తిరుగుతూ వెంటబడింది. దిక్కులకు పరువులెత్తాడు. ఏ దిక్కునకు పోతే ఆదిక్కునందే అతనిని తరిమి తరిమి కొడుతున్నది. దొరికిపోయాడనుకొన్నంతలో కొంచెం ముడుచుకొని తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. అది కూడా అలాగే కుంచించుకొని పట్టుకోబోయినది. పరువెత్తలేక నిలబడిపోయాడు. చక్రం కూడా నిలిచిపోయింది. ఒడుపుగా తప్పించుకో బోయాడు. చక్రంకూడా ఒడుపుగా పట్టుకోబోయింది. ఈవిధంగా సుదర్శనచక్రం ఒక్కపెట్టున భక్తునికి బాధ కలిగించిన తాపసుని వెంటబడింది. దాని సత్తాను అడ్డుకొనే శక్తి మరెవ్వరికీ లేదు
9-117 చలమున బుద్ధిమంతు... (చంపకమాల)
iBAA పద్య గానం
iBAP పద్యము
చలమున బుద్ధిమంతు లగు సాధులు నా హృదయంబు లీల దొం
గిలి కొనిపోవుచుండుదు రకిల్బిష భక్తిలతాచయంబులం
న్నిలువఁగఁ బట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభి కైవడిన్;
వలలకుఁ జిక్కి భక్తజన వత్సలతన్ జనుచుందుఁ దాపసా!

iBAT సందర్భం

దుర్వాసుడు అంబరీషునికి అపకారం చేయబోయి శ్రీసుదర్శనచక్రం కలిగించే ఆపదను కొనితెచ్చుకొన్నాడు. బ్రహ్మాదు లను రక్షించవలసినదిగా ప్రార్థిస్తూ కాళ్ళావేళ్ళాపడ్డాడు. వారు శ్రీమహావిష్ణువు తప్ప ఇతరులెవరూ రక్షించేవారు లేరని స్పష్టంగా చెప్పారు. గత్యంతరంలేక గజేంద్రవరదుని కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

ఓయీ! తపోధనా! బుద్ధిపుష్కలంగా ఉన్న సాధుజనులు పట్టుదలతో నా హృదయాన్ని దొంగిలించుకొని పోతారు. ఏ మాలిన్యమూ లేని భక్తి అనే లత వారి దగ్గరనే ఉండిపోయే విధంగా మంచినేర్పుతో మదించిన మహా గజాన్ని లాగా కట్టిపడవేస్తారు. నేను ఏమి చేయగలను? ఆ భక్తజనులమీది వాత్సల్యంతో వారు పన్నిన వలలలో చిక్కి వారు త్రిప్పినట్లు తిరుగుతూ ఉంటాను.
9-118 నాకు మేలుఁ గోరు... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
నాకు మేలు గోరు నాభక్తుఁ డగువాఁడు
భక్తజనుల కేన పరమ గతియు;
భక్తుఁ డెందు జనినఁ బఱతెంతు వెను వెంట
గోవు వెంటఁ దగులు కోడె భంగి

iBAT సందర్భం

శ్రీహర్ దుర్వాసునితో శ్రీమహావిష్ణుభక్తులకూ, తనకూ ఉన్న సంబంధాన్ని గూర్చి యిలా వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

మహర్షీ! భక్తితత్త్వాన్ని వివరిస్తున్నాను విను. నాయందు నిర్మలమైన భక్తి ఉన్నవాడు నాకు మేలు కోరుతాడు. అంటే భక్తులను కంటికి రెప్పలాగా కాపాడాను అనే తృప్తి నాకు కలిగించటమే నాకు మేలు. అలాగే భక్తుల విషయంలో నేనే పరమగతి అయినవాడను. నేను వారిని పరిరక్షించగలిగినట్లు ఈ సృష్టిలో మరొకవ్యక్తిగాని శక్తిగాని రక్షింఛలేదు. కాబట్టి నా భక్తుడు ఎక్కడకు పోతే అక్కడకు నేను వెంటబడి పరుగులెత్తుతూ పోతూ ఉంటాను. పాడి ఆవువెంట వదల కుండా పోతూ ఉండే దూడను చూచి ఉంటావు కదా! నేను భక్తుని వెంటపోవటం అలా ఉంటుంది.
9-120 తనువు మనువు... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
తనువు మనువు విడిచి, తనయులఁ చుట్టాల
నాలి విడిచి, సంపదాలి విడిచి,
నన్నె కాని యన్య మెన్నఁడు నెఱుఁగని
వారి విడువ నెట్టివారి నైన

iBAT సందర్భం

భక్తులు చాలా మహిమ కలవారయ్యా! వారికి లోకసంబంధమైన బంధాలు ఏమీ ఉండవు. ఒక్క నాయందు మాత్రమే సంబంధం ఉంటుంది వారికి. అట్టివారి విషయంలో నేను ఎలా ఉంటానో గమనించు – అంటున్నాడు శ్రీహరి దుర్వాసునితో... ...

iBAT తాత్పర్యము

వారికి దేహంతో ముడిఉండదు. కన్నకొడుకులను, కట్టుకొన్న భార్యనీ, చుట్టాలనూ, సంపదలను అన్నింటినీ విడిచి వేస్తారు. నన్ను తప్ప మరి దేనినీ వారు కోరరు. అటువంటివారు ఎట్టివారైనాసరే నేను విడిచిపెట్టను.
9-122 సాధుల హృదయము... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సాధుల హృదయము నాయది;
సాధుల హృదయంబు నేను; జగముల నెల్లన్
సాధుల నేనే యెఱుఁగుదు
సాధు లెఱుంగుదురు నాదు చరితము విప్రా!

iBAT సందర్భం

అంబరీషోపాఖ్యానంతో దుర్వాసునకు శ్రీమహావిష్ణువు భక్తుని లక్షణాన్నీ భగవంతుని లక్షణాన్నీ ఇలా వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

గొప్ప విద్యాతత్త్వం ఎరిగిన మహర్షీ! పరమపవిత్రమైన జీవితం గడపేవారిని సాధువులంటారు. ఒక్క రహస్యం చెప్పనా! అట్టివారి హృదయం నాదేనయ్యా! కాదు కాదు సాధువుల హృదయమే నేను ఈ ప్రపంచంలో ఉన్న సాధువుల నందరినీ నేను మాత్రమే తెలుసుకోగలను. నా చరిత్రమును సాధువులు మాత్రమే తెలుసుకోగలరు. మరికొంత విప్పిచెప్పనా? నేనే భక్తుడు, భక్తుడే నేను. నా భక్తులకు ద్రోహం చేయటమంటే నాకు ద్రోహం చేయటమే అని గుర్తించాలి
9-131 చీఁకటిఁ వాపుచున్... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
చీఁకటిఁ వాపుచున్ వెలుఁగు సేయుచు సజ్జనకోటి నెల్ల స
శ్రీకులఁ జేయు నీరుచులు చెల్వుగ ధర్మసమేత లై నినున్
వాకున నిట్టి దట్టి దని వర్ణనసేయ విధాత నేరఁ డ
స్తోకము నీదు రూపు గలదుం దుది లేదు పరాత్పరాద్య మై.

iBAT సందర్భం

విష్ణుదేవుని మాటలు వీనులారా విన్నాడు దుర్వాసుడు. మరొక గతి లేక భక్తశిఖామణి అయిన అంబరీషుని పాదాల మీద పడ్డాడు. అంబరీషుడు అది చూచి తట్టుకోలేకపోయాడు. హరిచక్రాన్ని అత్యద్భుతంగా స్తుతించాడు. అందులోని ఒక అమూల్యరత్నం ఈ పద్యం.

iBAT తాత్పర్యము

ఓ సుదర్శనచక్రరాజమా! నీవు అజ్ఞానమనే చీకటిని పటాపంచలు చేస్తావు. జ్ఞానమనే వెలుగు సజ్జనుల హృద యాలలో నిండుగా నిలుపుతావు. అట్టి నీవయిన కాంతులు ధర్మంతో నిండినట్టివి. అవి ఉత్తమపురుషుల సముదాయా లను సంపదల వెల్లువలు కలవానినిగా చేస్తాయి. అట్టి నిన్ను మాటలతో కొనియాడటం బ్రహ్మదేవునకు కూడా సాధ్యం కాదు. నీరూపం చాలా గొప్పది. దానికి అంటమంటూ లేదు. అది పరములకు అన్నింటికి పరమమైనది. నీవలెనే సనాతనమైనది.
9-134 ఏ నమస్కరింతు... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఏ నమస్కరింతు నింద్రశాత్రవ ధూమ
కేతువునకు ధర్మసేతువునకు
విమల రూపమునకు విశ్వగోపమునకుఁ
జక్రమునకు గుప్త శక్రమునకు

iBAT సందర్భం

అంబరీషుడు సుదర్శన చక్రస్వామిని స్తుతిస్తూనే ఉన్నాడు. అసలు విషయానికి వచ్చి ఆపదలో పీకలవరకు మునిగి ఉన్న మహర్షిని కాపాడు అని ప్రార్థించి చివరకు ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

స్వామీ! చక్రరాజమా! నీవు ఇంద్రుని పగవారికి బ్రదుకులేకుండా చేసే తోకచుక్కవు. ధర్మమునకు జారుపాటు లేకుండా కాపాడే అడ్డుకట్టవు. నీది విమలమైన రూపం. విశ్వాన్నంతటినీ కంటికి రెప్పలా కాపాడే గొప్పశక్తి నీది. వాళ్ళూ వీళ్ళూ అనటం ఎందుకు? సాక్షాత్తు మూడు లోకాలను ఏలే దేవేంద్రుణ్ణి కూడా రక్షించగల శక్తిసంపద కలవాడవు. అటు వంటి సుదర్శనస్వామీ! నీకు నేను నిరంతరమూ నమస్కారం చేస్తాను
9-141 ఒకమా టెవ్వని... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఒక మా టెవ్వని పేరు కర్ణములలో నొయ్యార మై సోకిఁనన్
సకలాఘంబులు పల్లటిల్లి తొలఁగున్ సంభ్రాంతితో నట్టి స
త్సుకరున్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశు దా
రకలంకస్థితిఁ గొల్చు భక్తులకు లే దడ్డంబు రాజాగ్రణీ!

iBAT సందర్భం

అంబరీషుని అనుగ్రహంవలన సుదర్శనచక్రస్వామి అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోకుండా బయటపడ్డ దుర్వాసమహర్షి అతని భక్తిసంపదను నోరారా కొనియాడుతూ ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

ఒక = ఒక్క; మాటు = సారి; ఎవ్వని = ఎవనియొక్క; పేరు = నామము; కర్ణముల = చెవుల; లోనన్ = అందు; ఒయ్యారము = విలాసముగా; ఐ = అయ్యి; సోకినన్ = స్పర్శించినను; సకల = సమస్తమైన; అఘంబులున్ = పాపములు; పల్లటిల్లి = పటాపంచలై, చలించి; తొలగున్ = పోవును; సంభ్రాంతి = భయభ్రాంతుల; తోన్ = తోటి; అట్టి = అటువంటి; సత్సుకరున్ = నారాయణుని {సత్సుకరుడు - సత్ (మంచి) సుకరుడు (మేలు) కరుడు (కలిగించువాడు), విష్ణువు}; మంగళతీర్థపాదున్ = నారాయణుని {మంగళతీర్థపాదుడు - శుభకరమైన తీర్థము పాదములవద్ద కలవాడు, విష్ణువు}; హరిన్ = నారాయణుని; విష్ణున్ = నారాయణుని; దేవదేవేశునిన్ = నారాయణును; అకలంక = నిష్కళంకమైన; స్థితిన్ = విధముగా; కొల్చు = సేవించెడి; భక్తులు = భక్తుల; కున్ = కు; లేదు = లేదు; అడ్డంబు = సాధ్యముగానిది; రాజ = రాజులలో; అగ్రణీ = గొప్పవాడ.
9-231 హరు మెప్పించి... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
హరు మెప్పించి మహా తపో నియతుఁ డై యాకాశగంగానదిన్
ధరకుం దెచ్చి నితాంత కీర్తిలతికా స్తంభంబుగా నవ్య సు
స్థిరలీలం బితృకృత్య మంతయు నొనర్చెన్ వారితానేక దు
స్తర వంశవ్యధుఁ డా భగీరథుఁడు నిత్యశ్రీకరుం డల్పుఁడే?

iBAT సందర్భం

మహాభాగవతంలో పరమాద్భుతమైన భాగవతుల కథలు ఎన్నో ఉన్నాయి. అందులో భగీరథచక్రవర్తి ఆకాశగంగను అవనికి తెచ్చిన కథ మరింత అద్భుతమైనది. శుకమహర్షి పరీక్షిత్తునకు ఆ గాథను చెప్పి చివరకు ఇలా అన్నాడు

iBAT తాత్పర్యము

మహాభాగవతంలో పరమాద్భుతమైన భాగవతుల కథలు ఎన్నో ఉన్నాయి. అందులో భగీరథచక్రవర్తి ఆకాశగంగను అవనికి తెచ్చిన కథ మరింత అద్భుతమైనది. శుకమహర్షి పరీక్షిత్తునకు ఆ గాథను చెప్పి చివరకు ఇలా అన్నాడు
9-254 ఇలమీఁదన్ బ్రదుకేల... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఇలమీఁదం బ్రదు కేల? వేల్పుల వరం బేలా? ధనం బేల? చం
చల గంధర్వపురీ విడంబనము లై శ్వర్యంబు లేలా? జగం
బులఁ బుట్టించు తలంపునం బ్రకృతితోఁ బొత్తై తుదిం బాసి ని
ర్మల మై వాఙ్మనసామితం బగు పరబ్రహ్మంబు నేఁ జెందెదన్

iBAT సందర్భం

భాగవతులలో ఒక ప్రత్యేకత కలవాడు ఖట్వాంగ మహారాజు. సూర్యవంశంలో ఒక జాతిరత్నం. ఒకమారతడు దేవతల కోసం రాక్షసులతో యుద్ధం చేసి వారిని చంపాడు. దేవతలను తన ఆయువు ఎంత అని అడిగాడు. ఎక్కువ లేదు. ఏదైనా వరం వేగంగా కోరుకో అన్నారు. అతడేమీ కోరకుండా ఇంటికి వెళ్ళి వైరాగ్యం పొంది యిలా అనుకొన్నాడు.

iBAT తాత్పర్యము

ఎందుకండీ ఈ భూమి మీద బ్రదుకు? దేవతల వరాలెందుకు? ధనాలెందుకు? ఆకాశంలో మేఘాల కదలికతో ఏర్పడి క్షణంలో మాయమయ్యే గంధర్వనగరాలవంటి ఐశ్వర్యాలెందుకు? ఇవన్నీ క్షణభంగురాలు. కనుక వీనితో నాకు పనిలేదు. ఆ పరమాత్మ ఈ జగత్తులనన్నీ పుట్టించే భావనతో ప్రకృతి అయిన మాయతో సంబధం పెట్టుకొంటారు. తన యిష్టం మేరకు మళ్ళీ పొత్తును వదలివేస్తాడు. అతనిలో ఏదోషమూ ఉండదు. అతనిని వాక్కులతో గానీ మనస్సుతో గానీ పట్టుకోలేము. అతనిలో ఐక్యం అయితే అతనివలె శాశ్వతస్థితిని పొందుతాను. అని భావించి రెండు క్షణాలలో కైవల్యమనే మహాఫలం పొందాడు.
9-258 అమరేంద్రాశకుఁ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
అమరేంద్రాశకుఁ బూర్ణచంద్రుఁ డుదితుం డై నట్లు నారాయణాం
శమునం బుట్టె మదాంధ రావణ శిరస్సంఘాత సంఛేదన
క్రమణోద్దాముఁడు రాముఁ డా గరితకున్ గౌసల్యకుం సన్నుతా
సమ నైర్మల్య కతుల్య కంచిత జనుస్సంసార సాఫల్యకున్.

iBAT సందర్భం

ఖట్వాంగుని వంశంలోనివాడే దశరథుడు. ఆ సూర్యవంశాన్ని స్థూలంగా పరిచయం చేస్తున్నది భాగవతం. దశరథునికి శ్రీరామచంద్రుడు పుత్త్రుడుగా అవతరించిన ఆనందకర సన్నివేశాన్ని పోతనగారు మనకు అమృతంలాగా అందిస్తున్నారు.

iBAT తాత్పర్యము

తూర్పుదిక్కు అనే కాంతకు పూర్ణచంద్రుడు ఉదయించిన విధంగా కౌసల్యామహాదేవికి శ్రీరామచంద్రుడు అవతరించాడు. ఆమె అందరకూ కొనియాడదగిన సాటిలేని నిర్మలత్వం రూపు తాల్చినదా అన్నట్టిది. ఆమెకు ఆమెయే సాటి. ఎన్నో పుట్టుకలతో అనంతంగా సాగుతూపోయే సంసారంలో సఫల్యం పొందినట్టిది. ఆ పుట్టిన మహాత్ముడో! నారాయణుని కళ అయినవాడు. పొగరుతో కన్నులు మూసికొనిపోయిన రావణాసురుని తలలవరుసను తరిగి వేయటంలో గొప్పపాటవం కలిగిన శ్రీరామచంద్రుడు
9-262 భూతలనాథుఁడు రాముఁడు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
భూతలనాథుఁడు రాముఁడు
ప్రీతుం డై పెండ్లియాడెఁ బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్

iBAT సందర్భం

రమణీయమైన రామాయణగాథను రసవత్తరంగా అభివర్ణిస్తున్నాడు భాగవతప్రవక్త భారతవంశకర్త అయిన పరీక్షిత్తునకు. జగత్తులన్నింటికీ కల్యాణాలను కలిగించే సీతారాములు దాంపత్యాన్ని సూచనాప్రాయంగా చెబుతున్నాడు.

iBAT తాత్పర్యము

యోగులందరూ ఎవనిని భావించి ఆనందసముద్రంలో మునిగితేలుతూ ఉంటారో అటువంటి శ్రీరామ చంద్రుడు సీతాదేవిని పెండ్లియాడాడు. ఏదో లాంఛనంకోసం కాదు ప్రీతితో. నిజానికి భార్యాభర్తలు కాబోయేవారికి అనురాగం నిండుగా ఉండాలి. అలా ఉండటానికి లోకసామాన్యంగా కొన్ని కారణాలు ఉంటాయి. వానిని తెలియజేస్తు న్నారు పోతనమహాకవి. ఆ సీతమ్మ తల్లి చాలా గొప్ప గుణాలనే మణులరాశి. ధర్మం తప్పని భోగపదార్థాలన్నీ ఆమెకు అందుబాటులో ఉన్నాయి. మోము వెలుగులు చందమామను వెక్కిరిస్తున్నాయి. అటువంటి జానకిని శ్రీరామచంద్రుడు ప్రీతితో పెండ్లియాడాడు.
9-267 పుణ్యుఁడు రామచంద్రుఁ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
పుణ్యుఁడు రామచంద్రుఁ డట వోయి ముదంబునఁ గాంచె దండకా
రణ్యముఁ దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హ లా
వణ్యము గౌతమీ విమల వాః కణ పర్యటనప్రభూత సా
ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.

iBAT సందర్భం

శ్రీరామచంద్రులవారికి సీతాదేవితో కల్యాణం అయిన తరువాత పరిస్థితుల ప్రాబల్యంవలన పట్టాభిషేకం భంగమైపోయింది. దశరథుడు తన మూడవ భార్యకు ఇచ్చిన వరాలను బట్టి రాముడు అరణ్యాలకు పోవలసివచ్చింది.

iBAT తాత్పర్యము

పుణ్యమూర్తి శ్రీరామచంద్రుడు అలా అడవులలోనికి ప్రవేశించాడు. అందులో ఒక ప్రత్యేకప్రదేశం దండ కారణ్యం. అది చాలా గొప్ప తపస్సు చేసిన మునీశ్వరులకు నివాసస్థలం. అక్కడ చక్కగా పెంపొందిన నెమళ్ళు పురులు విప్పుకొని నృత్యం చేస్తున్నాయి. గోదావరి నదిలోని స్వచ్ఛమైన నీటితుంపురుల కదలికలతో ఏర్పడిన గొప్పచల్లదనం నిలువెల్లా నింపుకొన్నట్టిది ఆవనం. పెద్దపెద్ద చెట్లూ, నేలమీది పొదలూ ఆనందపారవశ్యంతో ఊగులాడిపోతున్నాయి. ఈ అన్నింటితో కలసి ఆ అరణ్యం అరణ్యాలన్నింటికీ అగ్రగణ్యం అయి ప్రకాశిస్తున్నది.
9-272 లీలన్ రామవిభుం... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
లీలన్ రామవిభుం డొక
కోలన్ గూలంగ నేసె గురు నయశాలిన్
శీలిన్ సేవితశూలిన్
మాలిన్ వాలిం దశాస్యమానోన్మూల్మిన్.

iBAT సందర్భం

శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో తండ్రిమాటమీద అరణ్యవాసం చేస్తున్నాడు. మాయలమారి రాక్షసుడు రావణుడు మోసంచేసి సీతాదేవిని అపహరించుకొని వెళ్ళాడు. పుట్టెడుదుఃఖంతో పుట్టలూ, గుట్టలూ దాటుకొంటూ తిరుగుతున్నారు రామలక్ష్మణులు. వారికి హనుమంతుడు సుగ్రీవునితో చెలిమి కలిగించాడు. తరువాత,

iBAT తాత్పర్యము

శ్రీరామచంద్రుడు సుగ్రీవుని అన్న వాలిని, అతదు చేసిన ధర్మద్రోహానికి శిక్షగా, ఒక్కబాణంతో లీలగా కూలనేశాడు. ఆ వాలి తక్కువవాడేమీ కాదు. గొప్పనీతిశాలి. శూలం చేతబట్టిన శివమహాదేవుణ్ణి సేవించే గొప్పశీలం కలవాడు. అతనిమెడలో ఒక మహిమగల పూలమాల ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేది. దేవతలకు కూడా దిగులు పుట్టించే బలపరాక్రమాలు గల పదితలల రావణుని మానాన్ని పెల్లగించిపారవేసిన మహాబలుడు ఆవాలి.
9-273 ఇలమీఁద సీత వెదకఁగ... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఇలమీఁద సీత వెదకఁగ
నలఘుఁడు రాఘవుఁడు వనిచె హనుమంతు నతి
చ్ఛలవంతున్, మతిమంతున్
బలవంతున్, శౌర్యవంతుఁ, బ్రాభవవంతున్

iBAT సందర్భం

సుగ్రీవునితో చెలిమి చేసుకొని అతనికి ఘోరమైన అపకారం చేసిన వాలిని చంపివైచి శ్రీరామచంద్రుడు తన ప్రాణమే అయిన జానకి జాడలు తెలుసుకొని రావటానికి సరియైన వ్యక్తి ఎవరా అని పరికిస్తున్నాడు. అతని ఎట్టఎదుటనే చేతులు కట్టుకొని భక్తి పారవశ్యంతో నిలిచి ఉన్నాడు హనుమ.

iBAT తాత్పర్యము

ఆయనపేరు హనుమంతుడు. వజ్రపుదెబ్బకు ఉబ్బి అందంగా అలరారుతున్న చెక్కిలి కలవాడు. గొప్ప మాట కారితనం నిండుగా ఉన్నవాడు. ఎవ్వరూ ఊహింపజాలని బుద్ధిబలం కలవాడు. ఇంక దేహబలం సంగతి సరేసరి. ఆ విషయంలో అతనికి అతడే సాటి యనదగినవాడు. పరాక్రమం అందామా, పగవానిమీద ఒక్కపెట్టున దూకి చీల్చి చెండాడగల శౌర్యం అతనిసొమ్ము. అన్నింటిన్, అందరిన్ తన అదుపులో ఉంచుకోగల నిర్వహణ సామర్థ్యం కూడ అనంతంగా అమరినవాడు. అట్టి హనుమంతుణ్ణి మహాత్ముడైన శ్రీరాముడు సీతను వెదకటానికి పంపించాడు
9-302 బలువింటన్ గుణటంకృతంబు... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
బలువింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా
బ్రళయోగ్రానల సన్నిభం బగు మహాబాణంబు సంధించి రా
జలలాముం డగు రాముఁ డేసె ఖర భాషాశ్రావణున్ దేవతా
బల విద్రావణు వైరిదారజన గర్భస్రావణున్ రావణున్

iBAT సందర్భం

హనుమన్న జానకమ్మ జాడలు గుర్తించి రావణుని గుట్టుమట్టులన్నీ తెలిసికొని లంకను తోకచిచ్చుతో తగుల బెట్టి శ్రీరామచంద్రుని దగ్గరకు తిరిగివచ్చాడు. రామలక్ష్మణులు కపిసేనతో సముద్రాన్ని దాటుకొని లంకకు చేరు కొన్నాడు. రామరావణ మహాసంగ్రామం లోకభయంకరంగా జరిగింది. చిట్టచివరకు శ్రీరామచంద్రుడు -

iBAT తాత్పర్యము

తనవిల్లు చాలా గొప్పది. దాని అల్లెత్రాటినుండి రాముడు చేస్తున్న అతిఘోరమైన టంకారాలు బ్రహ్మాండ మంతటికీ హడలు పుట్టిస్తున్నాయి. అటువంటి వింటికి ఒక మహాబాణం సంధించాడు. అది ప్రణలకాలంలోని ఉగ్రమైన అగ్నియా అన్నట్లు మంటలు క్రక్కుతున్నది. రాజులందరిలో తలపూవువంటి దాశరథి ఆ బాణాన్ని రావణునిమీదికి మహావేగంతో వదలాడు. ఆ రావణుడు కారుకూతలతో దేవతలను కూడా అతలాకుతలం చేసేవాడు. గుంపులుగుంపు లుగా తనమీదికి దూకుతూవచ్చే దేవతలను తరిమితరిమికొట్టే సాహసం కలవాడు. అతని ధాటికి పగవారిభార్యలు గర్భస్రావాలతో పరుగులు తీస్తూ ఉండేవారు. అటువంటి రావణునిమీద ఇటువంటి గొప్పబాణాన్ని ప్రయోగించాడు.
9-318 కవగూడి యిరుదెసఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కవగూడి యిరుదెసఁ గపిరాజు రాక్షస; రాజు నొక్కటఁ జామరములు వీవ
హనుమంతుఁ డతి ధవళాతపత్రముఁ వట్ట; బాదుకల్ భరతుండు భక్తిఁ దేర
శత్రుఘ్ను డమ్ములుఁ చాపంబుఁ గొనిరాఁగ; సౌమిత్రి భృత్యుఁ డై చనువుసూప
జలపాత్ర చేఁబట్టి జనకజ గూడిరాఁ; గాంచనఖడ్గ మంగదుఁడు మోవఁ

(ఆటవెలది)

బసిఁడి కేడె మర్థి భల్లూకపతి మోచి
కొలువఁ బుష్పకంబు వెలయ నెక్కి
గ్రహము లెల్లఁ గొలువఁ గడునొప్పు సంపూర్ణ
చంద్రుపగిది రామచంద్రుఁ డొప్పె.

iBAT సందర్భం

శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి పుత్రమిత్రపరివారసమేతంగా పరిమార్చాడు. అగ్నిపరీక్షతో పవిత్ర అయిన జానకిని సగౌరవంగా సమీపానికి చేర్చుకొన్నాడు. దారిలో భక్తశిఖామణి అయిన భరతుణ్ణి ఆనందపరచి అయోధ్యకు మహావైభవంతో పరివారంతో బయలుదేరాడు శ్రీరామచంద్రుడు.

iBAT తాత్పర్యము

ఒకవంక వానరులు, మరొకవంక రాక్షసులు, ఇంకొకవంక తపస్సంపన్నులైన మహర్షులు. అదిగో అల్లదిగో దివ్యమైన పుష్పకవిమానం. దానిలో మహోన్నతపీఠంమీద సీతారాములను కూర్చోపెట్టారు. వానరరాజు సుగ్రీవుడూ, దానవరాజు విభీషణుడూ కొంచెం వెనుకవైపుగా జంటగా నిలుచుండి వింజామరలు వీస్తున్నారు. పరమభక్తాగ్రేసర చక్రవర్తి పవమానసుతుడు తెల్లనికాంతులతో విరాజిల్లే వెలిగొడుగును స్వామికి పట్టి నిలుచున్నాడు. నిలువెల్లా భక్తియే అనదగిన భరతుడు స్వామి పాదుకలను పాదాలదగ్గరకు చేరుస్తున్నాడు. చిన్నితమ్ముడు శత్రుఘ్నుడు వింటినీ, అమ్ము లనూ భద్రంగా పట్టుకున్నాడు. సుమిత్ర పెద్దబిడ్డ లక్ష్మణుడు ఎప్పుడు ఏ సేవ స్వామికి అవసరమౌతుందో అని ఏ మాత్రమూ ఏమఱుపాటులేకుండా కాచుకొని ఉన్నాడు. లోకమాత సీతమ్మ పూర్ణకుంభజలం పదిలంగా పట్టుకొని స్వామికి చేరువలో కూర్చున్నది. అంగదుడు బంగారు ఖడ్గాన్ని మోస్తున్నాడు. మండలాకారంతో ఉన్న పసిడిగద్దెను జాంబవంతుడు పట్టుకున్నాడు. ఇలా వీరందరూ ఒక్కొక్కసేవ చేస్తూ ఉండగా పుష్పకం ఎక్కిన శ్రీరామచంద్రుడు గ్రహా లన్నీ చుట్టూ నిలిచి కొలుస్తున్న నిండుజాబిల్లిలాగా ప్రకాశించాడు.
9-320 వీథులు నున్నఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వీథులు నున్నఁ గావించి తోయంబులు; సల్లి రంభా స్తంభ చయము నిలిపి
పట్టుచీరలు సుట్టి బహుతోరణంబులుఁ; గలువడంబులు మేలుకట్లుఁ గట్టి
వేదిక లలికించి వివిధ రత్నంబుల; మ్రుగ్గులు పలుచందములుగఁ బెట్టి
కలయ గోడల రామకథ లెల్ల వ్రాయించి; ప్రాసాదముల దేవభవనములను

(ఆటవెలది)

గోపురంబుల బంగారు కుండ లెత్తి
యెల్ల వాకిండ్ల గానుక లేర్పరించి
జనులు కై సేసి తూర్యఘోషములతోడ
నెదురు నడతెంచి రా రాఘవేంద్రు కడకు.

iBAT సందర్భం

లోకకల్యాణంకోసం రాక్షససంహారం చేసి శ్రీరామచంద్రుడు సీతామహాసాధ్వితో తిరిగివస్తున్నాడని తెలిసికొన్న అయోధ్యాపురవాసులందరూ ఆనందంతో పొంగిపోతూ స్వాగతసన్నాహాలు చేశారు.

iBAT తాత్పర్యము

నగరంలోని బాటలన్నింటిని ఎగుడుదిగుళ్ళు లేకుండా నున్నగా చేసుకొన్నారు. చక్కగా, దుమ్ము లేవకుండా నీళ్ళు చల్లారు. బాటలపొడవునా అరటిస్తంభాలు నిలిపారు. పట్టుచీరలు వానికి చుట్టారు. అందమైన తోరణాలను వీధులలో కమనీయం గా కట్టారు. ఇళ్ళముందరి అరుగులను అలికి పెక్కురత్నాల పొడులతో పెక్కురకాల మ్రుగ్గులు పెట్టారు. ఇండ్లగోడలమీద రామకథ లను వ్రాయించారు. ఎత్తైన మేడలమీదా, దేవాలయాలమీదా, గోపురాలమీదా బంగారుకుండ లెత్తించారు. వీథులలో శ్రీరామ చంద్రులవారికి సమర్పించుకోవటానికి కానుకలు సిద్ధంచేసుకొని ఉంచారు. తాము కూడా చక్కగా చూడముచ్చటగా అలంకరించు కొన్నారు. నాలుగువిధాలైన వాద్యాల కమ్మనినాదాలు వినవస్తూ ఉండగా శ్రీరామచంద్రులవారిని తోడ్కొని రావటానికి ఎదురుగా బయలుదేరారు.
9-324 ఇతఁడే రామనరేంద్రుఁ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఇతఁడే రామనరేంద్రుఁ డీ యబలకా యింద్రారి ఖండించె న
ల్లతఁడే లక్ష్మణుఁ డాతఁడే కపివరుం డా పొంతవాఁడే మరు
త్సుతుఁ డా చెంగట నా విభీషణుఁ డటంచుం జేతులం జూపుచున్
సతు లెల్లం బరికించి చూచిరి పురీ సౌధాగ్ర భాగంబులన్.

iBAT సందర్భం

శ్రీరామచంద్రులవారిని చూచినవెంటనే అయోధ్యాపురకాంతలందరికీ హృదయంలో ఒక ఆనందపు పొంగు వెల్లి విరిసింది. ఆ మహాత్ముని మహిమలను ఒకరికొకరు చెప్పుకొంటూ తక్కినవారిని గుర్తుపడుతూ ఇలా అనుకొంటున్నారు.

iBAT తాత్పర్యము

ఏమిటీ! ఈయనా శ్రీరామచంద్రమహారాజు! ఈ అమ్మవారికోసమా ఇంద్రశత్రువైన రావణాసురుణ్ణి ముక్కలుగా నరికి ప్రోవులు పెట్టాడు. అడుగడుగో లక్ష్మణస్వామి. అతడే కదయ్యా కోతులరేడు సుగ్రీవుడు! ఆ ప్రక్కన ఉన్నాడే ఆయనయే వాయుపుత్రుడు హనుమన్న. అతనికి కొంచెం ప్రక్కగా ఉన్నవాడే లంకారాజ్యానికి కొత్త ఏలిక విభీషణుడు. అంటూ చేతులతో చూపిస్తూ ఆ మహానగరం భవనాలపై భాగాలలో నిలిచి కాంతలందరూ తదేకంగా శ్రీరామచంద్రపరివారాన్ని చూచి మురిసిపోతున్నారు.
9-332 కలఁగు టెల్లను... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కలఁగు టెల్లను మానెఁ గంధు లేడింటికి; జలనంబు మానె భూచక్రమునకు;
జాగరూకత మానె జలజలోచనునకు; దీనభావము మానె దిక్పతులకు;
మాసి యుండుట మానె మార్తాండ విధులకుఁ; గావిరి మానె దిక్తటములకును;
నుడిగిపోవుట మానె నుర్వీరుహంబుల; కణఁగుట మానె ద్రేతాగ్నులకును;

(ఆటవెలది)

గడిఁది వ్రేఁగు మానెఁ గరి గిరి కిటి నాగ
కమఠములకుఁ బ్రజల కలఁక మానె;
రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు
ధరణి భరణరేఖఁ దాల్చు నపుడు.

iBAT సందర్భం

శ్రీరామచంద్రుడు అయోధ్యలో ప్రవేశించి అమ్మలకు, అయ్యవారలకు, పూజ్యులకు నమస్కరించి వారి కోరిక మేరకు పట్టాభిషేకం చేసుకొన్నాడు. జగములన్నీ ప్రమోదం పొందే విధంగా పాలన చేస్తున్నాడు. ఆ మహాత్ముని పాలన లో విశ్వం ఎలా ఉన్నదో అభివర్ణిస్తున్నారు.

iBAT తాత్పర్యము

శ్రీరామచంద్ర అనే మహారాజు భూభారాన్ని వహించటంతోనే ఏడుసముద్రాలూ సంక్షోభం లేనివయ్యాయి. భూమికి కంపం లేకుండాపోయింది. ఎప్పుడు ఏ దుష్టుడు ఏ ప్రళయం తెచ్చిపెడతాడో అని మేలుకొనియే ఉండే శ్రీమహావిష్ణువు శాంత చిత్తుడై ఒక కునుకు తీయటానికి సిద్ధపడుతున్నాడు. ఇంతవరకు రావణుని భయంవలన బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న దిక్పతులు దీనతలేనివారయ్యారు. సూర్యుడు చంద్రుడు మాసిపోవటంలేదు. దిక్కుల అంచులను కావిరికమ్ముకొనటంలేదు. పెద్ద పెద్ద చెట్లు క్రుంగిపోవటం లేదు. ఆవహనీయము, దక్షిణము, గార్హపత్యము అనే మూడు అగ్నులు అణగిపోకుండా ఉన్నాయి. భూమిని నిరంతరం మోసే ఎనిమిది దిగ్గజాలు, ఏడు కులపర్వతాలు, ఆదివరాహము, ఆదిశేషుడు, ఆదికూర్మము బరువు దించు కొని ఊరటపొందాయి.
9-337 సిగ్గుపడుట గల్గి... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
సిగ్గుపడుట గల్గి సింగారమును గల్గి
భక్తి గల్గి చాల భయముఁ గల్గి
నయముఁ బ్రియముఁ గల్గి నరనాథు చిత్తంబు
సీత దనకు వశము చేసికొనియె.

iBAT సందర్భం

భారతీయ దాంపత్యంలో చాల ప్రముఖమైన అంశం ఇల్లాలు ఇంటి ఆయనను సర్వసమర్పణభావనతో గౌరవించటం. స్త్రీ లోకానికి అన్ని విషయాలలో ఆదర్శప్రాయ అయిన సీతాదేవి రాముని హృదయాన్ని ఆకట్టుకొన్న తీరును చక్కగా అభివర్ణిస్తున్నారు.

iBAT తాత్పర్యము

అనుభవజ్ఞులు లజ్జ ఉంటే కులటా, లేకుంటే కులకాంతా చెడిపోతారు అంటారు. సిగ్గుపడటం ఒక ఉదాత్త మైన ప్రవర్తనకు చిహ్నం. సీతాదేవి ఆగుణంతో రాముని హృదయాన్ని ఆకట్టుకొన్నది. అలాగే సహజసౌందర్యాన్ని పెంపొందించే అలంకారాలను ధరిస్తూ ఉండేది. తనభర్తయందు అచంచలమైన భక్తి ఆమెకు అనుక్షణమూ ఉండేది. అటువంటి ఉత్తమగుణాలు ఏ చాపల్యంవలననైనా జారిపోతాయేమో అనే భయం ఉండేది. ఈ గుణాలతో సీతాదేవి తన భర్త చిత్తాన్ని తనవశం చేసికొన్నది.
9-358 ఆది దేవుఁ డైన... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఆది దేవుఁ డైన యా రామచంద్రుని
కబ్ది గట్టు టెంత? యసురకోటి
జంపు టెంత? కపుల సాహాయ్య మది యెంత?
సురల కొఱకుఁ గ్రీడ చూపెఁ గాక.

iBAT సందర్భం

శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పరమాత్మ. ఆయన అనేక మహాకార్యాలు అలవోకగా చేశాడు. పదునొకండు వేల యేండ్లు భూమిని పాలించి తన మొదటి తావునకు వెళ్ళిపోయాడు. ఆయనను మనం ఏవిధంగా అర్థం చేసుకోవాలో కవి తెలుపుతున్నాడు

iBAT తాత్పర్యము

శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు. ఎంత అసాధ్యమైన మహాకార్యాలైనా ఆయనకు ఆటలే. ఇది మనం గమనిం చాలి. సాగరానికి వారధి కట్టటం మనకు అసాధ్యమేమో కానీ ఆయనకు అదెంత పని? దేవతలను దిక్పాలకులను గడ గడలాడించిన పేరుప్రఖ్యాతులు గల రాక్షసులను చంపివేయటం ఆ మహాత్మునకు ఒక బరువా? కోతిసేనల సాయం పొందటం చెప్పుకోదగిన సంగతా? ఇదంతా దేవతలకోసం ఆయన ఆడిన నాటకం. అంతే.
9-359 వశుఁడుగ మ్రొక్కెదన్... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
వశుఁడుగ మ్రొక్కెదన్ లవణవార్ధి విజృంభణతా నివర్తికిన్
దశ దిగధీశ మౌళిమణి దర్పణమండిత దివ్యకీర్తికిన్
దశశత భానుమూర్తికి సుధారుచి భాషికి సాధు పోషికిన్
దశరథరాజు పట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్

iBAT సందర్భం

నిజానికి భాగవతం చెప్పదలచిన రామకథ అయిపోయింది. కానీ కవికి పరితృప్తి కలుగలేదు. మఱికొన్ని మాటలలో శ్రీరామచంద్రుని గుణగణాలను స్మరిస్తూ తానానిందించి మనలను ఆనందసముద్రంలో ముంచి యెత్తు తున్నాడు.

iBAT తాత్పర్యము

ఆ మహితాత్ముడు మహాసముద్రం ఎగిరిపాటులను అణగగొట్టినవాడు. పదిమంది దిక్పాలకుల కిరీటాల మణులనే అద్దాలకు అందచందాలను కూర్చిన దివ్యమైన కీర్తి కలవాడు. వేయిమంది భాస్కరుల వెలుగులకు వెలుగు నిచ్చేవాడు. అమృతం రుచిని మరపించే పలుకులు గలవాడు. సాధువులను ఆదరిఇంఛి ఆదుకొనే దయామూర్తి. దశరథ మహారాజు ముద్దులపట్టి – అతిక్రూరచిత్తం గల రావణుడనే రాక్షసరాజు ప్రాణాలు తీసిన మహామల్లుడు. అట్టి

శ్రీరామచంద్రునకు నేను నన్ను సమర్పణ చేసికొని మ్రొక్కుతాను.
9-360 నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులన్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డీవుత మా కభీష్టముల్.

iBAT సందర్భం

కవికి తనివితీరటం లేదు. శ్రీరామదర్శనం నుండి బయటపడలేకపోతున్నాడు. శ్రీరామచంద్రుని నుండి తనకూ, తనద్వారా మనకూ ఏమి కావాలో కోరుకొంటున్నాడు.

iBAT తాత్పర్యము

ఆయన నల్లనివాడు. ఆకాశంలాగా అంబుధిలాగా అనంతమైనవాడు. పద్మములవంటి విశాలములైన కనులతో మనలను చల్లగా చూస్తూ ఉంటాడు. ఎక్కడా, ఎప్పుడూ వ్యర్థంకాని మహాబాణాలూ, విల్లూ ధరించి ఉండేవాడు. అతివిశాలమైన వక్షఃస్థలంతో విరాజిల్లుతూ భక్తులారా! మీరెందరైనా, ఎక్కడివారైనా రండి ఇక్కడ మీకు చోటు ఉన్నది అని ప్రకటించేవాడు. అందరికీ శుభాన్ని, మేఘం వర్షంలాగా, కురిపించేవాడు. ఎగుబుజములవాడు. తనకీర్తిని అన్నిదిక్కులలో చల్లిన మహానుభావుడు. అటువంటి రఘువంశతిలకుడైన శ్రీరాముడు మాకోరిన కోర్కలను తీర్చుగాక!
9-361 రామచంద్రుఁ గూడి... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
రామచంద్రుఁ గూడి రాకలఁ పోకలఁ
గదిసి తిరుగువారుఁ గన్నవారు
నంటికొన్నవారు నా కోసలప్రజ
లరిగి రాదియోగు లరుగు గతికి.

iBAT సందర్భం

శ్రీరామచంద్రుడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే. దుష్టశిక్షణకోసం మానవుడుగా భూమిలో అవతరించాడు. ఆ మహాత్మునితో కలసిమెలసి ఉండగలగటం ఒక మహాపుణ్యం. దాని ఫలాన్ని ఈపద్యంలో వర్ణిస్తున్నారు.

iBAT తాత్పర్యము

ఆయన శ్రీరామచంద్రుడు. చంద్రుడంటే అందరికీ ఆహ్లాదం కలిగించేవాడు. అయోధ్యలో ఎందరో పుణ్యవంతులు అతనికి చెలికాండ్రై కలసిమెలసి ఉన్నారు. విశ్వామిత్రుడు మొదలైన మహర్షులు అతనిని ఆశ్రయించి కొన్ని ఘనకార్యాలు చేయించుకొన్నారు. అరణ్యవాసంలో జానపదులు ఎందరో ఆయనను దర్శించుకొన్నారు. సుగ్రీవుడు మొదలైన వానరాదులు, విభీషణుడు మొదలైన రాక్షసులు అతని చెలిమితో పవిత్రులైనవారే. మరల అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత కోసలదేశం ప్రజలు ఆయన చెలిమి కలిమిని అనుభవించినవారే. అలా ఆయనతోపాటు రాకపోకలతో కలిసి – అంటిపెట్టుకొని – తిరిగిన వారూ, కనుగొన్నవారూ, ఆయనను తాకినపుణ్యం పొందినవారూ అయిన కోసల ప్రజలు ఆదియుగంనాటి యోగులు పొందిన పుణ్యలోకాలము చేరుకొన్నారు.
9-362 మంతనములు సద్గతులకు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మంతనములు సద్గతులకుఁ
పొంతనములు ఘనము లైన పుణ్యముల కిదా
నీంతన పూర్వమహాఘ ని
కృంతనములు రామనామ కృతిచింతనముల్.

iBAT సందర్భం

శ్రీరామచంద్రునికి సంబంధించిన భావనలు చాలా గొప్పవి అని నిరూపిస్తున్నారు.

iBAT తాత్పర్యము

రామునిపేరును తలపోయటం, ఆయన చేసిన మహాకార్యములను మనస్సులో సంభావించటం అనే రెండూ ఉత్తమ లోకాలకు చేరుకోవటానికి దారిచూపే ఆలోచనలు. గొప్ప గొప్ప పుణ్యాలను చక్కగా సమకూర్చే మంచియోగాలు. అవి ఈ కాలము నకు, వెనుకటి జన్మములకు సంబంధించిన మహాపాతకాలను నామరూపాలు లేకుండా చీల్చిపారవేసే శక్తిసంపద కలవి. అట్టి మహాఫలాలను ప్రసాదించే రామనామాన్ని తనివితీరా జపించండి. ఆయన ఆ అవతారంలో చేసిన ఘనకార్యాలను సంభావిం చండి - అంటున్నది శ్రీమహాభాగవతం.
9-462 క్షమ గలిగిన... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
క్షమ గలిగిన సిరి గలుగును
క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్
క్షమ గలుగఁ దోన కలుగును
క్షమ గలిగిన మెచ్చు శౌరి సదయుఁడు దండ్రీ!

iBAT సందర్భం

పది అవతారాలలో పరశురామావతారం ఒకటి. ఆయన మహర్షి జమదగ్ని కొడుకులలో ఒకరు. కార్తవీర్యార్జునుడు అనే మహాచక్రవర్తి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి పెద్దపరివారంతో వచ్చాడు. మహర్షి అందరికీ ఆతిథ్యం ఇచ్చి గొప్పవిందుభోజనం పెట్టాడు. అది అతని హోమధేనువు మహిమ. రాజుననే పొగరుతో అర్జునుడు బలవంతంగా దానిని తీసికొనిపోయాడు. పరశు రాముడు ఇది తెలిసికొని పట్టరాని కోపంతో మాహిష్మతీపురానికి వెళ్ళి రాజునూ, ఆరితేరిన సైనికులనూ అతిక్రూరంగా చంపి దూడతోపాటు ఆవును తెచ్చి తండ్రికి సమర్పించాడు. తాను ప్రళయరుద్రుడై చేసిన సంహారకాండను కూడా వివరించాడు. శాంత మూర్తి అయిన జమదగ్ని నొచ్చుకొన్నాడు. కొడుకును మందలిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

నాన్నా! సహనం చాలా గొప్పదయ్యా! అది ఉంటే అన్నీ ఉన్నట్లే. సహించటం తెలిసినవారికి సంపదలు కొల్లలుగా కలుగుతాయి. ఓర్పు కలవానికి మంచిమాటలు సిద్ధిస్తాయి. సౌఖ్యాలన్నీ సహనశీలుణ్ణి వెనువెంటనే చేరుకొంటాయి. బాబూ! దయామయుడైన శ్రీమహావిష్ణువు ఓరిమిని పండించుకొన్నవానిని మెచ్చుకొంటాడయ్యా!
9-507 రాజ్యంబు పాపమూలము... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
రాజ్యంబు పాపమూలము
రాజ్యముతో నొడ లెఱుంగ రాదు సుమతియున్
రాజ్యమునఁ బూజ్యు నెఱుఁగడు
రాజ్యము గీజ్యంబు ముక్తిరతులకు నేలా?

iBAT సందర్భం

వెనుకటి కాలంలో నహుషచక్రవర్తి ఒకడు ఉండేవాడు. అతడు ఇంద్రపదవిని పొందగలిగిన పుణ్యశాలి. అతనికి యతి మొదలైన ఆరుగురు పుత్రులు కలిగారు. నహుషుడు పెద్దకొడుకు యతికి రాజ్యం ఇచ్చాడు. కానీ ఆ మహానుభావుడు వైరాగ్యాన్ని పండించుకొన్నవాడు కనుక ఇలా అనుకొన్నాడు.

iBAT తాత్పర్యము

రాజ్యం అనేది అన్ని పాపాలకూ మూలకారణం. ఒకమారు రాజ్యం దక్కింది అంటే వానికిక ఒళ్ళు తెలియదు. ఎంత మంచిబుద్ధి ఉన్నవాడయినా రాజ్యం పొందిన తరువాత గౌరవింపదగినవానిని తెలిసికోలేడు. పూజ్యులను అవమా నిస్తాడు. ఘోరమైన ఆపదలను కొనితెచ్చుకొంటాడు. కాబట్టి మోక్షసామ్రాజ్యం మీద ప్రీతి ఉన్నవారికి ఈ రాజ్యమూ గీజ్యమూ ఎందుకు? – అని రాజ్యాన్ని పూచికపుల్లలా వదలివేసి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు.
9-581 కామోపభోగ సుఖములు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కామోపభోగ సుఖములు
వేమాఱును బురుషుఁ డనుభవింపుచు నున్నం
గామంబు శాంతిఁ బొందదు
ధూమధ్వజుఁ డాజ్యవృష్టిఁ ద్రుంగుడు వడునే?

iBAT సందర్భం

నహుషుని రెండవకొడుకు యయాతి రాజయ్యాడు. శుక్రాచార్యుని బిడ్డ దేవయాని అతనికి భార్య అయింది. ఒక నాడతనికి ఆత్మజ్ఞానం కలిగింది. స్త్రీకారణంగా మోసపోయాననుకొన్నాడు. వైరాగ్యం హృదయంలో కదలాడుతూ ఉండగా కామవికారం ఎంతఘోరమైనదో ఆమెకు తెలియజేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

దేవయానీ! మానవుడు కామసుఖాలను వేలకొలదిగా అనుభవిస్తూనే ఉంటాడు. కానీ కామం ఒక పెద్ద అగ్నివంటిది. పెద్దపెద్ద పాత్రల నిండుగా నేతిని తెచ్చి అగ్నిలో పోస్తున్నా అగ్ని ఇంక చాలు అంటుందా? అటువంటిదే ఈ కామాగ్ని. దాని అను భవాలు పెరిగిపోతున్నకొద్దీ కామం మరింతగా విజృంభిస్తుందే కానీ అణగారదు.
9-725 ఎప్పుడు ధర్మక్షయ మగు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఎప్పుడు ధర్మక్షయ మగు
నెప్పుడు పాపంబు పొడము నీ లోకములో
నప్పుడు విశ్వేశుఁడు హరి
దప్పక విభఁ డయ్యుఁ దన్నుఁ దా సృజియించున్.

iBAT సందర్భం

శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు భగవంతుని అవతారాలనూ, భాగవతుల చరిత్రనూ భాగవతరూపంలో చెబుతు న్నాడు. యాదవవంశ చరిత్రను చెబుతూ శ్రీకృష్ణవాసుదేవుని అవతారకారణాన్ని వివరిస్తున్నాడు

iBAT తాత్పర్యము

పరీక్షిన్మహారాజా! ఈ సృష్టి అంతా ఒక విచిత్రమైన చక్రం తిరుగుళ్ళవంటిది. ఒక్కొక్క కాలంలో ధర్మం క్షీణించిపోతుంది. పాపం పండిపోతుంది. అదిలోకం అంతటికీ చేటుకాలం. గమనిస్తాడు విశ్వానికంతటికీ ప్రభువైన విష్ణువు. అధర్మమైన పాపాన్ని అంతం చేసి ధర్మాన్ని మళ్ళీ సుస్థితికి తేవటం కర్తవ్యంగా పెట్టుకొని తన్ను తాను సృజించుకొంటాడు. అతడే దేవకి ఎనిమిదవ గర్భంగా అవతరించిన శ్రీకృష్ణవాసుదేవుడు.
9-730 మంగళ హరికీర్తి... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మంగళ హరికీర్తి మహా
గంగామృత మించుకైనఁ గర్ణాంజలులన్
సంగతము సేసి ద్రావఁ దొ
లంగును గర్మంబు లావిలం బగుచు నృపా!

iBAT సందర్భం

శ్రీకృష్ణవాసుదేవుని అవతార పరిసమాప్తిని సూచనామాత్రంగా వినిపిస్తున్నాడు శుకయోగీంద్రుడు పరీక్షిన్మహా రాజునకు. అట్టి శ్రీహర్ అమృతచరిత్రను విన్నవారికి కలిగే పుణ్యఫలం ఎట్టిదో తెలుపుతున్నాడు.

iBAT తాత్పర్యము

రాజా! పరీక్షిత్తూ! కృష్ణుడై అవతరించి దుష్టులను శిక్షించి, శిష్టులను కాపాడి ధర్మస్థాపన చేసిన శ్రీహరికీర్తి సకలశుభా లనూ సమకూర్చుతుందయ్యా! ఆకీర్తి మహాగంగ. అదియొక అమృతవాహిని. దానిని ఏ కొంచెమైనా చెవిదొప్పలతో హృదయం లోనికి చేర్చుకొంటే కర్మములన్నీ కాలిపోతాయి. అంటే పుట్టటం చావటం అనే చట్రంలో తిరుగుతూ ఉండే ఘోరమైన ఆపద తొలగిపోతుంద్.
9-732 నగుమొగమున్... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాటప
ట్టగు నురమున్ మహాభుజము లంచిత కుండలకర్ణముల్ మదే
భగతియు నీలవేణియుఁ గృపారస దృష్టియుఁ గల్గు వెన్నుఁ డి
మ్ముగఁ బొడసూపుఁ గాత గను మూసిన యప్పుడు విచ్చు నప్పుడున్.

iBAT సందర్భం

శుకయోగీంద్రులు శ్రీకృష్ణవాసుదేవుని మనోహరరూపాన్ని తన జ్ఞాననేత్రంముందు కదలాడనని కోరుకొంటున్నారు. మనకు కూడా అట్టి భాగ్యాన్ని కలిగిస్తున్నారు.

iBAT తాత్పర్యము

ఆ మహాత్ముడు నిరంతరమూ నవ్వుమొగంతోనే కానవస్తాడు. అంటే అచ్చమైన ఆనందం ఆయన స్వరూపమన్నమాట. సన్నని నడుమును గమనిస్తే అందులోనే పదునాలుగులోకాలు భద్రంగా ఉన్న స్ఫూర్తి కలుగుతుంది. ఆయన అనంతుడు అని తెలపటానికై ఆకాశంవంటి నీలమైన దేహకాంతితో అలరారుతున్నాడు. ఆవిశాలమైన వక్షఃస్థలం శ్రీమహాలక్ష్మికి ఆటపట్టు. ఎంత అలవికాని పనినైనా అలవోకగా చేస్తాయి అనిపించే పొడవైన గొప్పహస్తాలతో వెలుగొందుతున్నాడు స్వామి. కర్ణముల కుండలాలు కమనీయంగా కాంతులను విరజిమ్ముతూ కదలాడుతున్నాయి. అడుగుతీసి అడుగువేస్తుంటే ఒక మదించిన గజరాజు ఆ మహాత్ము ని నుండియే నడకను అభ్యసించిందా అనిపిస్తుంది. తలమీది కేశపాశం నల్లనివన్నెతో నిగనిగలాడిపోతున్నది. కన్నులలో అపార మైన కృపారసం తొణికిసలాడుతూ ఉంటుంది. అటువంటి గొప్పలక్షణాలు గల కన్నయ్య కన్నులు మూసినా తెరచినా నాకు కన పడుతూ ఉండాలి.