ద్వితీయ స్కంధం

2-11 గోవిందనామ కీర్తనఁ...(కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
గోవిందనామ కీర్తన
గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరి
త్రీవిభుడు సూఱ గొని యెను
కైవల్యము తొల్లి రెండు గడియలలోనన్

iBAT సందర్భం

పరీక్షిత్తు చిన్న తప్పిదం వలన శాపగ్రస్తుడైనాడు. అతనికి ముక్తి పొందాలనే కోరిక చాలా గట్టిగా కలిగింది. శ్రీ శుకమహర్షి యాదృచ్ఛికంగా అతని దగ్గరకు ఏతెంచాడు. పరీక్షిత్తు తన కోరికను విన్నవించుకొన్నాడు. శుకమహర్షి అతనికి ముక్తిమార్గాన్ని ఉపదేశిస్తూ ముందుగా ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

పరీక్షిన్మహారాజా! పూర్వం ఖట్వాంగుడనే మహారాజు ఉండేవాడు . ఆయన గోవిందుని నామాన్ని జపించి, సంసారభయాన్ని పోగొట్టుకొని రెండు గడియల కాలంలోనే ముక్తిని పొందాడు. ముక్తి అంటే పుట్టటం, చనిపోవటం అనే చక్రం మళ్ళీమళ్ళీ తిరుగుతూ ఉండటం అనే దానినుండి విడుదల పొందటం. దానినే కేవలత్వం, కైవల్యం అని కూడా అంటారు.
2-17 హరిమయము విశ్వమంతయు... (కందము). .
iBAA పద్య గానం
iBAP పద్యము
హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పనిలే దా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన! వింటే.

iBAT సందర్భం

పరీక్షిత్తునకు ముక్తిని సాధించాలని గాఢమైన వాంఛ కలిగింది. అతనికి ఆ మహాఫలాన్ని అందించటానికి భగవంతుడే స్వయంగా పంపాడా అన్నట్లుగా అన్ని సంగాలనూ అవలీలగా వదలిపెట్టిన శుకయోగీంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు. రాజు అతనిని సేవించుకొని కొన్ని ప్రశ్నలు అడిగాడు. శుకమహర్షి సమాధానాలు చెబుతూ ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

నాయనా! పరీక్షిన్మహారాజా! నీవు నీ వంశాన్ని నీ పుట్టుకచేత పవిత్రం చేసినవాడవు. చూడు, పదునాలుగు లోకాల సముదాయమైన విశ్వమంతా శ్రీమహావిష్ణువుతో నిండిపోయినదే. ఆయనకంటె వేరుగా ఏమీలేదు. అంతేకాదు. ఆ హరి విశ్వమంతా నిండి సర్వమూ తానే అయి ఉన్నాడు. శ్రీహరితో వ్యాపించి ఉండని వస్తువు పరమాణు మాత్రమైనా లేదు సుమా! విన్నావా?
2-21 కమనీయ భూమి భాగములు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కమనీయ భూమి భాగములు లేకున్నవే; పడియుండుటకు దూది పఱుపు లేల?
సహజంబులగు కరాంజలులు లేకున్నవే; భోజన భాజన పుంజ మేల?
వల్కలాజినకుశావళులు లేకున్నవే; కట్ట దుకూల సంఘాత మేల?
గొనకొని వసియింప గుహలు లేకున్నవే; ప్రాసాద సౌధాది పటల మేల?

(తేటగీతి)

ఫల రసాదులు గురియవే? పాదపములు;
స్వాదుజలముల నుండవే? సకలనదులుఁ;
పొసఁగ బిక్షయుఁ వెట్టరే? పుణ్యసతులు;
ధనమదాంధుల కొలువేల? తాపసులకు.

iBAT సందర్భం

శుకమహర్షి ఆర్తుడైన పరీక్షిన్మహారాజునకు ప్రపంచ సంబంధమైన భోగభాగ్యాల కోసం వెంపరలాడటం తగదనీ, అది మానవుణ్ణి ముక్తికి దూరం చేస్తుందనీ వివరిస్తూ ఇలా పలుకుతున్నాడు.

iBAT తాత్పర్యము

మహారాజా! మోక్షం అనే మహాఫలం పొందాలి. అంటే మానవుడు తపస్సును వదలిపెట్టరాదు. అట్టివారే తాపసులు. పుట్టించిన భగవంతుడు ప్రాణులు సుఖంగా జీవించటానికి అవసరమైన అన్నింటినీ ఏర్పాటుచేసి అందుబాటులో ఉంచాడు. అది గమనింపక ఏదో కావాలని ఆరాటపడుతూ జీవనకాలాన్ని వ్యర్థం చేసుకోవటం ఎంత అవివేకం? చూడు, దేహానికి సుఖాన్నిచ్చే చక్కని ప్రదేశాలు చాలా ఉన్నాయి. పడి ఉండటానికి దూదిపరుపులెందుకు? రెండు చేతులూ కలుపుకుని దోసిలిగా చేసుకొని ఏ పదార్థాన్నయినా నోటిలోనికి పెట్టుకోవచ్చు. తిండి తినటానికి పాత్రలను ప్రత్యేకించి కూర్చుకోవాలా? నార చీరలు, చనిపోయిన జంతు చర్మాలూ కావలసినంతగా దొరుకుతాయి. వానికోసం అష్టకష్టాలూపడి పట్టువస్త్రాలు సంపాదించాలా? ఉండటానికి కొండగుహలు మెండుగా ఉన్నాయి. పెద్దపెద్ద ఇండ్లను కట్టుకోవాలా? ఆడుగడుగునా ఎన్నో విధాలయిన చెట్లు పండ్లరసాలను కురిపిస్తున్నాయి. నదులన్నీ ఎంతో కమ్మని జలాలను అందిస్తున్నాయి. కన్నతల్లులవంటి వనితలు భిక్షపెట్టి కడుపు నింపుతారు. వీనికోసం ధనమదంతో కన్నుగానని వారిని కొలవటం ఎందుకు?
2-22 రక్షకులు లేనివారల... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
రక్షకులు లేనివారల
రక్షించెద ననుచుఁ జక్రి రాజై యుండన్
రక్షింపు మనుచు నొక నరు
నక్షముఁ బ్రార్థింపనేల? యాత్మజ్ఞునకున్.

iBAT సందర్భం

మానవుడు ముందుగా వివేకం పండించుకోవాలి. ఆత్మతత్త్వాన్ని చక్కగా తెలుసుకోవాలి. తన్ను రక్షించేవాడు భగవంతుడొక్కడే అని నిరూపిస్తున్నాడు, శుకయోగీంద్రుడు.

iBAT తాత్పర్యము

అజ్ఞానం వలన కొందరు ‘అయ్యో! నన్ను రక్షించేవారు ఎవరున్నారు’ అని అనవసరంగా అలమటిస్తూ ఉంటారు. గొప్ప పనితనంగల సుదర్శన చక్రాన్ని పట్టుకొని విష్ణువు ‘నేను మీ అందరినీ రక్షిస్తాను’ అని పాలకుడై అన్ని కాలాలలో అన్నిదేశాలలో అండదండలిస్తూ నిలిచి ఉన్నాడు. దానిని గమనింపక ‘బాబూ! నన్ను కాపాడు’ అంటూ ఆ పనికి ఏమాత్రమూ సామర్థ్యంలేని ఒక మనిషిని దేబెరించటం ఆత్మతత్త్వం తెలిసినవానికి చేయదగిన పనికాదు.
2-51 నారాయణుని... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నారాయణుని దివ్య నామాక్షరములపైఁ; గరఁగని మనములు గఠిన శిలలు
మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ; మిళితమై యుండని మేను మొద్దు
చక్రికి మ్రొక్కని జడుని యౌదల నున్న; కనక కిరీటంబు కట్టెమోపు
మాధవార్పితముగా మనని మానవు సిరి; వన దుర్గ చంద్రికా వైభవంబు

(ఆటవెలది)

కైటభారి భజన గలిగి యుండని వాఁడు
గాలిలోననుండి కదలు శవము
కమలనాభు పదముఁ గనని వాని బ్రతుకు
పసిఁడికాయలోని ప్రాణి బ్రతుకు.

iBAT సందర్భం

పరీక్షిత్తు పసితనంనుండీ పరమాత్మను అర్చించే శీలం కలవాడు. శుకమహర్షి వాసుదేవునియందే మూడుకరణాలనూ చెదరకుండా నిలుపుకొన్నవాడు. అటువంటి శుకమహర్షి పరీక్షిత్తునకు విష్ణుభావనలేని దౌర్భాగ్యాన్ని ఇలా వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

నారాయణునిది దివ్యమైన నామం. ఆ నామపు అక్షరాలను విని కరగని మనస్సులు బండరాళ్ళు. ఆయన మురవైరి. అంటే దుష్టులైన రక్కసులను రూపుమాపేవాడు. ఆయన కథలు వింటూ ఉంటే ఆనందభాష్పాలు జాలువారుతూ ఉంటాయి. అటువంటి ఆనందాన్ని పొందనివాని దేహం ఒక పెద్దమొద్దు. సుదర్శనం అనే చక్రాన్ని ధరించి అందరినీ కాపాడే ఆ స్వామికి మ్రొక్కనివాడు జడుడు. వాని తలమీదనున్న కిరీటం కట్టెలమోపు. మాధవుని సేవ కోసం కాకుండా బ్రతికేవాని సంపద అడవిలో కాచిన వెన్నెల. శ్రీమహావిష్ణువు భజనలేనివాడు గాలిలో కదలాడే పీనుగు. బ్రహ్మదేవుని జన్మకు కారణమైన కమలం బొడ్డునందు కల లక్ష్మీపతి పాదాలను చూడలేనివాని బ్రతుకు మేడిపండులోని పురుగు బ్రతుకు.
2-60 ఏ విభు వందనార్చనము... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఏ విభు వందనార్చనము లేవిభుచింతయు నామకీర్తనం
బేవిభు లీల లద్భుతము లెవ్వని సు శ్రవణంబు సేయదో
షావలి బాసి లోకము శుభాయతవృత్తి జెలంగునండ్రు నే
నావిభు నాశ్రయించెద నఘౌఘనివర్తను భద్ర కీర్తనున్.

iBAT సందర్భం

భగవంతుడు ఏ శక్తులను ఆశ్రయించి పెక్కురూపాలు పొందుతాడు? ఆయనకు ఈ జగత్తులను పుట్టించటం మొదలైన వినోదాలు ఎందుకు? మొదలైన ప్రశ్నలు పరీక్షిత్తునకు పుట్టాయి. శుకమహర్షిని అడిగాడు. సమాధానం చెప్పబోతూ ముందుగా శుకుడు ఆ పరమేశ్వరునకు నమస్కారం చేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

పరమాత్మను చక్కగా తెలుసుకున్నవారు ఆయనకు మ్రొక్కటం, పూజలు చేయటం, భావిస్తూ ఉండటం, నామజపం చేయటం, లీలలను స్మరిస్తూ ఉండటం అనే పనులు అద్భుతాలని చెబుతూ ఉంటారు. ఆయన విభుడు. కనుక అన్నిరూపాలతో మనకు కానవస్తూ ఉంటాడు. దేవదేవుడైన అతని కథలు వినటం వలన పాపాలన్నీ తొలగిపోతాయి, లోకమంతా సమస్తశుభాలతో మెలగుతూ ఉంటుంది – అని కూడా పలుకుతారు. పాపాల రాశులను పోగొట్టి శుభపరంపరలను కలుగజేసే ఆ పరమేశ్వరుని నేను ఆశ్రయిస్తాను.
2-61 ఏ పరమేశు పాదయుగ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఏ పరమేశు పాదయుగ మెప్పుడు గోరి భజించి నేర్పరుల్
లోపలి బుద్ధిలో నుభయలోకము లందుల సక్తిఁ బాసి, యే
తాపము లేక బ్రహ్మగతిఁ దారు గతశ్రములై చరింతు; రే
నా పరమేశు మ్రొక్కెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్.

iBAT సందర్భం

పరీక్షిత్తు ప్రశ్నలకు సమాధానం చెప్పబోతూ పరమాత్మ జ్ఞానాన్ని ప్రసన్నంగా తెలుసుకోవటానికీ, తెలియ జెప్పటానికీ తన్నుతాను రూపొందించుకుంటూ శుకుడు చేస్తున్న ప్రార్థన.

iBAT తాత్పర్యము

వివేకం కలవారు ఆ పరమేశ్వరుని పాదాల జంటను నిరంతరమూ కోరి సేవించుకుంటూ బ్రదుకుతారు. గుండెలోపలి పొరలలో ఈ లోకానికీ, ఆ లోకానికీ చెందిన తగులాలను పోగొట్టుకుంటూ ఉంటారు. ఏ బాధలూ లేనివారై బ్రహ్మమునందే దారి కలవారై శ్రమలను దూరం చేసుకొని మెలగుతూ ఉంటారు. అలా వివేకవంతుల పాపాలను పటాపంచలు చేసి ఆ పరమేశ్వరుడు వారికి శుభాలను కలిగిస్తూ ఉంటాడు. ఆయనకు నేను మ్రొక్కుతూ ఉంటాను.
2-64 తపములఁ జేసిననో... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
తపముల్ సేసిననో, మనోనియతినో, దానవ్రతప్రీతినో,
జపమంత్రంబులనో, శ్రుతిస్మృతులనో, సద్భక్తినో యెట్లు ల
బ్దపదుండౌ నని బ్రహ్మ రుద్ర ముఖరుల్, భావింతు రెవ్వాని న
య్యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుం డౌఁ గాక నా కెప్పుడున్.

iBAT సందర్భం

శుకమహర్షి తన జ్ఞానసంపదనంతా పద్యాలనే పెట్టెలో భద్రంగా నిక్షేపించి పరీక్షిత్తునకు ఉపదేశిస్తూ పరమాత్మను స్తుతిస్తున్నాడు

iBAT తాత్పర్యము

పరమాత్మ పాపాల రాశులన్నింటినీ భస్మం చేసి వేస్తాడు. ఆయనను కీర్తిస్తే సర్వశుభాలూ కలుగుతాయి. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా వాని ఫలాలన్నింటినీ ఆ పరమాత్మునకు సమర్పించుకోవాలి. లేకపోతే అవన్నీ పాడైపోయి దాటశక్యం కాని ఆపదలను కలిగిస్తాయి. అటువంటి కీడు కలుగకుండా నన్ను కాపాడవలసిందిగా ఏ కొలతలకు అందని ఆ పరమాత్మను వేడుకుంటాను.
2-81 నానాస్థావరజంగమ.. (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
నానాస్థావరజంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప వి
జ్ఞానం బేమియు లేక తొట్రుపడ నిచ్చన్ నాకు సర్వానుసం
ధానారంభవిచక్షణత్వము మహోదారంబుగా నిచ్చె ము
న్నేనా యీశ్వరు నాజ్ఞ గాక జగముల్ నిర్మింప శక్తుండనే?

iBAT సందర్భం

శుకుడు భాగవత కథలను పరీక్షిత్తునకు వివరిస్తూ బ్రహ్మదేవునికీ నారదునకూ అయిన సంవాదాన్ని ప్రస్తావించాడు. అందులో నారదుడు బ్రహ్మను విశ్వప్రకారం తెలియజేయవలసినదిగా కోరగా ఆయన ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

నాయనా! నారదా! ఈ విశ్వం అంతా పెక్కువిధాలయిన వ్యక్తులతో, వస్తువులతో నిండి ఉన్నది. అందులో కొన్ని స్థావరాలు. కదలిక లేక నిలిచి ఉండేవి. కొన్ని జంగమాలు. కదలుతూ ఉండేవి. ఇలా ఉండే వానినన్నింటినీ నా అంత నేను సృష్టిచేసే విజ్ఞానం కొంచెం కూడా లేక తికమకపడుతున్నాను. అప్పుడు తనకు తానుగా నాకు సాక్షాత్కరించి ఆ పరమేశ్వరుడు అన్నింటినీ కూర్చుకొని నిర్మింపగల వివేకాన్ని చాలా గొప్పగా నాకు కలుగజేశాడు. ఆయన ఆజ్ఞ లేకపోతే నేను ఈ లోకాలనన్నింటినీ నిర్మించే శక్తి కలవాడనా?
2-85 ఆ యీశుఁ డనంతుఁడు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఆ యీశు డనంతుడు హరి
నాయకు డీ భువనములకు నాకున్ నీకున్
మాయకు ప్రాణివ్రాతము
కేయెడలన్ లేదు ఈశ్వరేతరము సుతా!

iBAT సందర్భం

బ్రహ్మ నారదునితో పరమాత్మ వైభవాన్ని గూర్చి వివరిస్తున్నాడు. సృష్టి మొదలైన కార్యాలన్నీ ఆ మహాత్మునకు ఒక ఆట అని చెప్పాడు. ఆయన సర్వమునకూ పాలకుడని చెబుతూ ఇలా అంటున్నాడు

iBAT తాత్పర్యము

నాయనా! కుమారా! నారదా! ఆ పరమాత్మ మొదలూ తుదీ లేనివాడు. ఆయనను హరి అంటారు. ఈ లోకాలన్నింటికీ, నాకూ, నీకూ ఆయనయే నాయకుడు. ఈ సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవులరాశులు అన్నింటికీ కూడా ఆయనయే నాయకుడు. దానికి ముందు మాయ అని ఒకటి ఉన్నది. మాయ అంటే ఆయన వలన ఏర్పడిన ప్రకృతియే. దానిని కూడా నడిపించే శక్తి ఆ పరమాత్మయే. ఎక్కడా కూడా ఆ పరమాత్మకంటే వేరైనది ఏదీలేదు.
2-110 పరమాత్ముం డజుఁ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
పరమాత్ముం డజు డీజగంబు ప్రతికల్పంబందు కల్పించు తా
పరిరక్షించును ద్రుంచు నట్టి యనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగ
ద్భరితుం గేవలు నద్వితీయుని విశుద్ధజ్ఞాను సర్వాత్ము నీ
శ్వరు నాద్యంతవిహీను నిర్గుణుని శశ్వన్మూర్తి చింతించెదన్.

iBAT సందర్భం

పరమాత్ముని మహిమను నారదునకు బ్రహ్మ తెలియజెప్తున్నాడు. ఆయన దివ్య చరిత్రను భావించి భావించి ఆనందం పొందుతూ ఆ జ్ఞానాన్ని అమృతంలాగా కొనియాడుతూ ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

నారదా! ఆయనను పరమాత్ముడు అంటాయి వేదాలు. ఎందుకంటే ఆయన అజుడు. అంటే పుట్టుక లేనివాడు. కానీ ప్రతికల్పంలోనూ ఈ జగత్తును కల్పిస్తూ ఉంటాడు. దానిని కాపాడుతూ ఉంటాడు. కొంతకాలం తరువాత మళ్ళీ తనలో కలిపి వేసుకుంటూ ఉంటాడు. ఆయనకు మనకులాగా ఏ పాపాలూ ఉండవు. ఏ కొలతలకూ అందని ఆత్మ స్వరూపుడు. జీవులకువలె మరణం ఉండదు, కనుక నిత్యుడు. జగములన్నింటను నిండి ఉండేవాడు. ఆయనతో పోల్చిచెప్పటానికి ఆయనవంటి తత్త్వం మరొకటి ఏదీ లేదు. ఆ విధంగా ఆయనను అద్వితీయుడు, కేవలుడు అని వర్ణిస్తాయి వేదాలు. ఆయనది విశుద్ధమైనజ్ఞానం. ఆయన సర్వులకూ, సర్వమునకూ ఆత్మ. ఈశ్వరుడు. ఆయన మొదలూ, తుదీ లేనివాడు. ఏ గుణాలూ లేనివాడు. ఎల్లప్పుడూ ఉండేవాడు. అట్టి పరమాత్మనుగూర్చి భావిస్తూ ఉంటాను.
2-209 హరిఁ బరమాత్ము... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
హరి పరమాత్ము నచ్యుతు ననంతుని చిత్తములం దలంచి సు
స్థిరత విశోకసౌఖ్యముల చెందిన ధీనిధు లన్యకృత్యముల్
మరచియు చేయనొల్లరు తలంచిన నట్టిదయౌ సురేంద్రుడుం
బరువడి నుయ్యి ద్రవ్వునె పిపాసితుడై సలిలాభిలాషితన్

iBAT సందర్భం

బ్రహ్మదేవుడు పరమాత్మ అయిన విష్ణువును గూర్చి తనకు తెలిసిన దానినంతటినీ నారదునకు తెలియ జేస్తున్నాడు. వరుసగా అవతార విశేషాలన్నింటినీ సంగ్రహంగా చెప్పి పరమాత్మను తెలుసుకోవటం అంత సులభమైన విషయం కాదని వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

ఆయన హరి. సర్వాన్నీ తనలోనికి తీసుకొనే స్వభావం కలవాడు. పరమాత్మ. అంతయూ తానే అయి అంతటా వ్యాపించి ఉండేవాడు. ఆయన అనంతుడు. ఎక్కడనో అయిపోవటం అనే లక్షణం లేనివాడు. అట్టి మహాప్రభువును మనస్సులలో భావించి ఎప్పటికీ నశించినవీ, దుఃఖం అణువంతకూడా లేనివీ అయిన సుఖాలను పొందే బుద్ధిమంతులు ఇతరములైన పనులను, మరచికూడా, చేయటానికి ఇష్టపడరు. ఆలోచిస్తే అది అటువంటిదే. దేవేంద్రుడంతటివాడైనా దప్పిక కలిగినప్పుడు పారా, పలుగూ పట్టుకొని గబగబా నుయ్యి త్రవ్వుతాడా!
2-211 కారణకార్య హేతువగు... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
కారణకార్య హేతువగు కంజదళాక్షుని కంటె నన్యు లె
వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో
దారుని సద్గుణావళు లుదాత్తమతిన్ గొనియాడకుండినన్
జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్.

iBAT సందర్భం

భగవంతుని మహిమను నారదునికి బ్రహ్మదేవుడు ఇంకా ఇలా వివరిస్తున్నాడు. తొమ్మిది విధాలుగా భగవంతుని గుణవిశేషాలను పాడుకొంటూ ఉండటం ఒక భక్తిమార్గం. దానిలో ప్రవర్తించి దానిద్వారా పరమస్థితికి చేరుకోవాలని తెలియజేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

శ్రీ మహావిష్ణువును పుండరీకాక్షుడు అంటారు. బాగా వికసించిన పద్మపు విశాల మైన రేకులవంటి కన్నులున్నవాడు. సృష్టిలో ఏర్పడే ప్రతిదానిని కార్యం అంటారు. దానికి కారణం ఒకటి వేరుగా ఉంటుంది. విత్తనం కారణం. చెట్టు కార్యం. కాని పరమాత్మా, జగత్తూ రెండూ విష్ణువే. మరొకరులేరు. నాయనా! అటువంటి భగవంతునీ, అంతము లేనివానినీ, లోకాల సముదాయాన్నంతటినీ భావిస్తూ ఉండేవానినీ ధ్యానిస్తూ ఉండాలి. నిజానికి ఆయనకు ఏ గుణాలూ లేవుగానీ మనలను ఉద్ధరించటానికి ఆయన కొన్నిగుణాలు ఏర్పరచుకొని మనయందు కృపతో తెలియవస్తూ ఉంటాడు. అటువంటి గుణాలను గొప్పగా సంస్కరించుకొన్న బుద్ధితో మనం కొనియాడుతూ ఉండాలి. అలా చేయకపోతే గుణాలు లేని పరమాత్మను మన మనస్సులు చేరవు. అది చాలాపెద్ద ప్రమాదం.
2-214 ఉపవాస వ్రత శౌచ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఉపవాసవ్రత శౌచశీలమఖ సంధ్యోపాసనాగ్ని క్రియా
జపదానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర ద
చ్చపుభక్తిన్ హరి పుండరీకనయనున్ సర్వాతిశాయిన్, రమా
ధవు పాపఘ్ను పరేశు నచ్యుతుని నర్ధిన్ గొల్వలేకుండినన్.

iBAT సందర్భం

నారదునకు ఆయన తండ్రిగారైన బ్రహ్మ భక్తిని గూర్చి గట్టిగా బోధిస్తున్నాడు. అదితప్ప వేరేగతి లేదంటున్నాడు. భక్తి లేకపోతే భగవంతునికోసం చేసే గొప్ప పనులన్నీ ఫలంలేనివైపోతాయని తెలియజేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

కుమారా! నారదా! మానవులు కర్మబంధాలను త్రెంచి వేసుకొని పుట్టుకా, చావూ అనే ఆగకుండా తిరుగుతూ ఉండే సంసారచక్రం నుండి బయటపడాలి. దానినే మోక్షం అంటారు. అది పొందటానికి శాస్త్రాలు కొన్ని మార్గాలను బోధించాయి. అవి ఉపవాసాలు, వ్రతాలూ, లోపలా బయటా పరిశుద్ధిని సాధించటం, మంచి శీలాన్ని పెంపొందించుకోవటం, యజ్ఞాలూ, సంధ్యావందనాలూ, అగ్నికార్యాలూ, భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండటమూ, దానాలూ, వేదాలను వల్లించటమూ మొదలైనవి. వీటిని అన్నింటినిగానీ, కొన్నింటినిగానీ శక్తిమేరకు చేస్తూనే ఉండాలి. అయితే ఒక్క విషయాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది పుండరీకాక్షుడూ, అందరికంటె, అన్నింటికంటె దాటిపోయిన మహిమ కలవాడూ, లక్ష్మీపతీ, పాపాలను రూపుమాపేవాడూ, దేవతలకు కూడా దేవుడూ అచ్యుతుడూ అయిన శ్రీహరిని అచ్చమైన భక్తితో ఆరాధిస్తూ ఉండటం. అది లేకపోతే ఉపవాసాలూ మొదలైనవానితో మోక్షం కలుగదు.
2-278 హరియందు నాకాశ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
హరి యందు నాకాశ; మాకాశమున వాయు; వనిలంబువలన హుతాశనుండు;
హవ్యవాహను నందు నంబువు; లుదకంబు; వలన వసుంధర గలిగె; ధాత్రి
వలన బహుప్రజావళి యుద్భవం బయ్యె; నింతకు మూలమై యెసఁగునట్టి
నారాయణుఁడు చిదానంద స్వరూపకుం; డవ్యయుం, డజరుఁ, డనంతుఁ, డాఢ్యుఁ,

(తేటగీతి)

డాది మధ్యాంత శూన్యుం, డనాదినిధనుఁ,
డతనివలనను సంభూత మైన యట్టి
సృష్టి హేతు ప్రకార మీక్షించి తెలియఁ
జాల రెంతటి మునులైన జనవరేణ్య!

iBAT సందర్భం

శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజునకు సృష్టితత్త్వాన్నీ, దానికి మూలకారణమైన పరమాత్మతత్త్వాన్నీ ఇలా తెలియజేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

మహారాజా! మహావిష్ణువునుండి మొట్టమొదట ఆకాశం ఏర్పడింది. ఆకాశం,నుండి వాయువూ, వాయువునుండి అగ్నీ, అగ్నినుండి నీరూ, నీటి నుండి భూమీ ఏర్పడ్డాయి. భూమినుండి పెక్కువిధాలైన ప్రాణుల గుంపులు పుట్టుకొని వచ్చాయి. ఈ అంతటికీ మూలకారణం నారాయణుడు. నారాయణుడంటే ఉనికీ, జ్ఞానమూ, ఆనందమూ అనే మూడు మహావిషయాల రాశి. ఏవిధమైన మార్పులూ లేకుండా ఒకే తీరున ఉండేవాడు. జీవులకులాగా ఆ స్వామికి ముసలితనం,మరణం ఉండవు. అందువలననే ఆయనను అందరూ అన్నివేళలా ధ్యానిస్తూ ఉంటారు. పుట్టటం, జీవించడం, పోవటం అనే వికారాలు అయనకు లేవు. ఈ సృష్టి అంతా అతని వలననే వెలువడింది. దీని తత్త్వం పట్టుకోగలగటం ఎంతటి తపశ్శక్తి కలవారికి కూడా సులభం కాదు.
2-280 ధరణీశోత్తమ భూత సృష్టి... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ధరణీశోత్తమ! భూతసృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా
హరి కర్తృత్వము నొల్లఁ డాత్మగత మాయారోపితంజేసి తా
నిరవద్యుండు నిరంజనుండు పరుఁడున్ నిష్కించనుం డాఢ్యుఁడున్
నిరపేక్షుండును నిష్కళంకుఁ డగుచున్ నిత్యత్వమున్ బొందెడిన్.

iBAT సందర్భం

పరమాత్మ అంటే ఏమిటో విస్పష్టంగా తెలుసుకోవటానికి సహకరించే మఱికొన్ని జ్ఞానవిషయాలను శుకుడు పరీక్షిత్తునకు ఇలా తెలుపుతున్నాడు.

iBAT తాత్పర్యము

పరీక్షిన్మహారాజా! అంతాతానే అయిన ఆ శ్రీమహావిష్ణువు ఇదంతా నావలననే జరిగింది, నేనే కర్తను – అనుకోడు. తనలోని మాయ దీనికి కారణం అని తెలియజేస్తూ ఉంటాడు. దానికి అనుగుణంగా నెలకొల్పటం, కాపాడటం చేస్తూ కూడా తామరాకు మీద నీటిబొట్టులాగా అంటుసొంటులు లేకుండా ఉంటాడు. అందువలన ఆయనలో అహంకారం మొదలైన ఏదోషాలూ ఉండవు. తగులములు ఉండవు. సృష్టి మొదలైనవానితో సంబంధంలేని పరుడై ప్రకాశిస్తాడు. తనది అంటూ ఏమీలేనివాడూ, అందరిచేత కొనియాడబడేవాడూ అయి ఉంటాడు. పూర్ణకాముడు కనుక ఆయనకు కోరదగినది ఏమీలేదు. కోరికలు తీర్చుకోవటానికి కొన్ని సందర్భాలలో పాపాలు చేయవలసివస్తుంది. ఆ విధమైన మచ్చలు ఆయనకులేవు. కనుక ఆయన నిత్యుడు. సర్వకాలాలలో, సర్వదేశాలలో ఏ బాధలూ లేకుండా ఆనందస్వరూపుడై విరాజిల్లుతూ ఉంటాడు.
2-286 రామ గుణాభిరామ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
రామ! గుణాభిరామ! దినరాజ కులోంబుధి సోమ! తోయద
శ్యామ! దశాననప్రబలసైన్య విరామ! సురారి గోత్ర సు
త్రామ! సుబాహు బాహుబల దర్ప తమః పటు తీవ్ర ధామ! ని
ష్కామ! కుభృల్ల లామ! గరకంఠ సతీ నుత నామ! రాఘవా!

iBAT సందర్భం

తెలుగుల పుణ్యాల పెట్టె అయిన పోతన మహాకవి రెండవ స్కంధం రచనను పూర్తిచేసి తన స్వామి శ్రీరామచంద్రునకు విన్నవించుకుంటూ ఆ పరమాత్మను ఈవిధంగా స్తుతిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

శ్రీరామా! నీగుణాలన్నీ చాలా మనోహరములయినవయ్యా! సూర్యదేవుని కులం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడవు నీవు. నీలమేఘం వంటి మేనిఛాయతో అలరారుతూ ఉంటావు. పదితలల రక్కసుని పిక్కటిల్లిన బలం కల సేనలను రూపుమాపినవాడవు. దేవతల పగవారు అనే కొండలకు ఇంద్రుడవు. సుబాహువు ఆనే రాక్షసుని బాహువుల బలం వలన కలిగిన పొగరు ఒక చీకటి అయితే దానికి నీవు సూర్యుడవు. నీకు ఏ కోరికలూ లేవు. భూమిని పాలించేవారిలో మేలుబంతి అయినవాడవు. పరమేశ్వరుని యిల్లాలు పార్వతీదేవి నీ నామాన్ని నిరంతరమూ జపిస్తూ ఉంటుంది. రఘువంశం నీ వలన మహిమను పొందిందయ్యా