iBam భాగవతం ఆణిముత్యాలు

తృతీయ స్కంధం

3-1 శ్రీ మహిత వినుత... (కందము)
iBAA పద్య గానం
iBAP పద్యము
శ్రీమహిత వినుత దివిజ
స్తోమ! యశస్సీమ! రాజసోమ! సుమేరు
స్థేమ! వినిర్జితభార్గవ
రామ! దశాననవిరామ! రఘుకులరామా!

iBAT సందర్భం

పోతనగారు మూడవ స్కంధం రచనను ప్రారంభిస్తూ సంప్రదాయాన్ని అనుసరించి తన కృతిపతి శ్రీరామచంద్రుని గుణగణాలను పేర్కొంటూ ఇలా ప్రార్థిస్తున్నారు.

iBAT తాత్పర్యము

వాక్కుల సంపదలతో దేవతలు గుంపులు గుంపులుగా చేరి నిన్ను స్తుతిస్తూ ఉంటారు. నీ కీర్తి చిట్టచివరి అంచులకు చేరినట్టిది. రాజులందరూ తారలు అనుకొంటే నీవు వారిలో చంద్రుడవు బంగారుకొండవలె సుస్థిరంగా నిలువగలవాడవు. ఇరవైయొక్క పర్యాయాలు రాజులనందరినీ ఊచకోతకోసిన పరశురాముడు నీచేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. పదితలల పెద్దరక్కసుడు రావణుడు నీతో పోరాడి ఘోరమైన చావు చచ్చాడు. స్వామీ! రఘువంశం నీవలన గొప్పమహిమను, అందచందాలనూ పొందింది. స్వామీ! అట్టి నీవు నాకవిత్వాన్ని ఆలకించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి, స్వామీ!
3-30 ఏ పరమేశుచే... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఏ పరమేశుచే జగము లీ సచరాచరకోటితో సము
ద్దీపితమయ్యె, ఏవిభుని దివ్యకళాంశజు లబ్జగర్భగౌ
రీపతి ముఖ్యదేవ మునిబృందము, లెవ్వడనంతు డచ్యుతుం
డాపురుషోత్తముండు కరుణాంబుధి కృష్ణుడు వో నరేశ్వరా!

iBAT సందర్భం

పరీక్షిత్తునకు శుకమహర్షి భాగవత రహస్యాలను వివరిస్తున్నాడు. అందులో భాగంగా విదురుడు ధృతరాష్ట్రునకు బోధిస్తున్న శ్రీకృష్ణుని మహిమను ఈ క్రింది పద్యం మనకు తెలియజేస్తున్నది.

iBAT తాత్పర్యము

ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణవాసుదేవుడు సముద్రమంతటి దయగలవాడయ్యా! ఆయన పురుషోత్తముడు. ఆంటే పరమాత్మ అని వేదాలు ఎవనిని కొనియాడుతున్నాయో అటువంటివాడు. అచ్యుతుడు ఎక్కడా, ఎందునా జారుపాటులేనివాడు. అనంతుడు. అంతంలేని ఆనందమే అయినవాడు. కదలుతూ ఉండేవీ, కదలకుండా ఉండేవీ అయిన జీవరాశులతో నిండిన లోకాలన్నీ ఆ దేవునిచేతనే వెలుగొందుతూ ఉన్నాయి. లోకాలనన్నింటినీ సృష్టి చేసే బ్రహ్మదేవుడూ, లయం చేసే పరమశివుడూ, ఇంకా దేవేంద్రుడు మొదలైన దేవతలూ, జ్ఞానసంపన్నులైన మహర్షుల సముదాయాలూ ఆ మహాత్ముని కళల వలననే ఏర్పడినవారు.
3-71 అట్టి సరోజాక్షుఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అట్టి సరోజాక్షుఁ డాత్మీయ పదభక్తు; లడవులనిడుమలఁ గుడుచుచుండ
దౌత్యంబు సేయఁ గొందఱు విరోధులు పట్టి; బద్ధునిఁ జేయ సన్నద్ధు లైన
బలహీను మాడ్కి మార్పడ లేఁడ యసమర్థుఁ; డని తలంచెద వేని నచ్యుతుండు
పరుల జయింప నోపక కాదు విద్యాభి;జన ధన మత్తులై జగతిఁ బెక్కు

(తేటగీతి)

బాధల గలంచు దుష్ట భూపతుల నెల్ల
సైన్య యుక్తంబుగా నని సంహరించు
కొఱకు సభలోన నప్పు డా కురుకుమారు
లాడు దుర్భాషణములకు నలుగఁ డయ్యె.

iBAT సందర్భం

తీర్థయాత్రలు చేసి వచ్చిన విదురుడు శ్రీకృష్ణుని ప్రియమిత్రము ఉద్ధవుణ్ణి కలుసుకున్నాడు. ఆత్రంగా శ్రీకృష్ణాదుల క్షేమవార్తలను అడుగుతున్నాడు. ఆ సందర్భంలో వెనుక కౌరవసభకు దూతగా వచ్చినప్పటి శ్రీకృష్ణవాసుదేవుని అద్భుతమైన ప్రవృత్తిని తలచుకొని యిలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

ఉద్ధవా! ఆ పుండరీకాక్షుడు అడవులలో ఇడుములు పడుతున్న, తనవారైన పాండవులను గమనించాడు. వారికోసం కౌరవుల దగ్గరకు దూతగా వెళ్ళాడు. బుద్ధిలేని కొందరు అతనిని కట్టిపడవేయాలనుకొన్నారు. స్వామివారిని అలవోకగా రూపుమాప గలడు. కానీ బలహీనునిలాగా నటించి వారిని బ్రదకనిచ్చాడు. ఎందుకంటే వారి కారణంగా దుర్మార్గులనందరినీ మట్టుపెట్టాలి. వారు తమకున్న కొద్దిపాటి చదువు, కులమూ, ధనమూ అనేవానితో పొగరెక్కి ఉన్నారు. లోకాన్ని బాధిస్తున్నారు. అట్టి దుష్టులు బంధు మిత్రపరివారంతో నాశనమైపోవాలి. దానిని మనస్సులో కుదురుకొల్పుకొని దుర్యోధనుడు మొదలైన నీచుల కాఱుకూతలను పట్టించుకోలేదు. వారిమీద అప్పటికి మాత్రం కోపాన్ని చూపలేదు.
3-72 జననం బందుట లేని... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
జననంబందుటలేని యీశ్వరుఁడుదా జన్మించు టెల్లన్ విరో
ధి నిరాసార్థము వీతకర్ముఁ డగు నద్దేవుండు గర్మప్రవ
ర్తనుఁ డౌ టెల్లఁ జరాచరప్రకట భూతశ్రేణులన్ గర్మ వ
ర్తనులం జేయఁ దలంచి కాక కలవే దైత్యారికిం గర్మముల్.

iBAT సందర్భం

విదురుడు శ్రీకృష్ణదేవుని జన్మకర్మముల రహస్యాన్ని ఉద్ధవునకు ఈవిధంగా వివరిస్తున్నాడు. గీతలో భగవంతుడు నా జన్మమూ, నా కర్మమూ దివ్యములయ్యా! అని అర్జునునకు స్వయంగా చెప్పాడు. కనుక భగవంతుని దివ్యమైన జన్మకర్మములను విదురుడు ఇలా తెలియజేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

ఉద్ధవా! మనస్వామి వాసుదేవునకు పుట్టుక అనేదిలేదు. ఆయన అందరకు ఈశ్వరుడు. మఱి కృష్ణుడుగా పుట్టినాడు గదా! అంటావేమో. అది జగములకు పగవారైన దుష్టులను రూపుమాపటంకోసమే. అలాగే మనకులాగా ఆయనకు చేయవలసిన పనులేవీ లేవు. కానీ ఎన్నో కర్మములు చేస్తున్నాడు. అది ఎందుకంటే లోకాలలోని స్థావరములు, జంగమములూ అయిన ప్రాణులనందరినీ వారివారికి ఏర్పడిన క్రియలలో ఎలా మెలగాలో తెలియజేయటానికి మాత్రమే. రక్కసులను మట్టుపెట్టే మహాత్ములకు కర్మలంటూ ఉంటాయా?
3-73 హరి నరుల కెల్లఁ... (కందము)
iBAA పద్య గానం
iBAP పద్యము
హరి నరుల కెల్లఁ బూజ్యుఁడు
హరి లీలామనుజుఁడును గుణాతీతుఁడు నై
పరఁగిన భవ కర్మంబులఁ
బొఁరయం డఁట హరికిఁ గర్మములు లీల లగున్.

iBAT సందర్భం

విదురుడు ఉద్ధవునితో శ్రీకృష్ణుని లీలాస్వరూపాన్ని గురించి యిలా చెబుతున్నాడు. ఈ పద్యం కర్మబంధంలో చిక్కుకొన్న ప్రాణులకూ, కర్మబంధాలులేని భగవంతునకూ ఉన్న భేదాన్ని చక్కగా తెలియజేస్తుంది.

iBAT తాత్పర్యము

మహానుభావా! ఉద్ధవా! కర్మవశం వలన పుట్టిన జీవులందరికీ శ్రీహరి పూజింప దగినవాడు. ఆయన కోరికోరి కొన్ని మహాకార్యాలను చేయటానికి భూమిపై పుడుతూ ఉంటాడు. అందువలననే ఆయనను లీలామనుజుడు అంటారు. జీవులందరు సత్త్వము, రజస్సు, తమస్సు అనే గుణాలనుబట్టి మెలగుతూ ఉంటారు. దానివలన వారు బంధాలను వదలించుకోలేరు. కానీ శ్రీహరి గుణాలకు లోబడినవాడుకాడు. కాబట్టి ఆయనకు కర్మబంధాల అంటుసొంటులు ఉండవు. ఆయన చేసే కర్మములు ఆ విధంగా లీలలు అవుతాయి.
3-148 కనియెం దాపస పుంగవుం... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
కనియెం దాపసపుంగవుండఖిలలోకఖ్యాతవర్ధిష్ణు, శో
భనభాస్వత్పరిపూర్ణ యౌవనకళాభ్రాజిష్ణు, యోగీంద్ర హృ
ద్వనజాతైక చరిష్ణు, కౌస్తుభముఖోద్య ద్భూషణాలం కరి
ష్ణు నిలింపాహితజిష్ణు విష్ణు ప్రభవిష్ణుం కృష్ణు రోచిష్ణునిన్.

iBAT సందర్భం

పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన సందర్భంలోని వింతలను వివరిస్తున్న ఘట్టం. శ్రీకృష్ణుడు సరస్వతీ నదీతీరంలో ఒక చెట్టు మొదట కూర్చున్నాడు. ఉద్ధవుణ్ణి బదరీవనానికి పొమ్మన్నాడు. కానీ అతడు పోలేక అతనినే అనుసరించాడు. అలా ఉండగా మహాభాగవతుడైన మైత్రేయమహర్షి శ్రీకృష్ణదర్శనభాగ్యాన్ని పొందటాన్ని ఈ పద్యం మనకు తెలియజేస్తున్నది.

iBAT తాత్పర్యము

తాపసులలో తలమానికం అనదగిన మైత్రేయుడు శ్రీకృష్ణవాసుదేవుని దర్శించుకున్నాడు. ఆ మహాత్ముడు లోకాలన్నింటికీ బాగా తెలిసిన ఔన్నత్యం కలవాడు. గొప్పగా ప్రకాశించే నిండైన యౌవనపు కళతో విరాజిల్లుతున్నాడు. మహాయోగుల హృదయాలనే కమలాలలో మాత్రమే సంచరించే శీలం కలవాడు. కౌస్తుభమూ మొదలైన దివ్యములైన భూషణాలతో అలరారుతున్నవాడు. ఇంకా విష్ణుమూర్తి. రక్కసులను ముక్కలు ముక్కలుగా నరికి ప్రోగులుపెట్టే శీలం కలవాడు. అంతటా వ్యాపించి ఉండేవాడు. సర్వకార్యాలనూ చక్కగా చేసే సామర్థ్యం కలవాడు. గొప్ప దేహకాంతితో విరాజిల్లేవాడు.
3-356 చారు పటీర... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
చారు పటీర హీర ఘనసార తుషార మరాళ చంద్రికా
పూర మృణాళ హార పరిపూర్ణ సుధాకర కాశ మల్లికా
సారనిభాంగశోభిత భుజంగమతల్పమునందు యోగని
ద్రారతి చెందియుండు జఠరస్థిత భూర్భువరాది లోకుడై

iBAT సందర్భం

మైత్రేయుడు విదురునకు అనేక తత్త్వవిషయాలను బోధించాడు. అందులో ప్రళయకాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉండే స్థితిని ఈ పద్యం అభివర్ణిస్తున్నది.

iBAT తాత్పర్యము

విదురా! శ్రీహరి ప్రళయసమయంలో మహాసముద్రంలో శేషశయ్యమీద పవ్వళించి యోగనిద్రలో హాయిగా ఉంటాడు. ఆ శేషుడు ఎంత తెల్లచల్లగా ఉంటాడో చెబుతాను. విను. మంచిగందంలాగా, వజ్రంలాగా, కర్పూరంలాగా, మంచుతుంపురులలాగా, హంసలాగా, వెన్నెలలాగా, తామరతూడులలాగా, ముత్యాలహారంలాగా, నిండు చందురునిలాగా, రెల్లుపూవులలాగా, మల్లెపూవులలాగా ఉంటాడు. అలా తెల్లని కాంతులను విరజిమ్ముతున్న ఆ విష్ణుమూర్తి ఆదిశేషుణ్ణి పానుపుగా చేసికొని పవ్వళించి ఉన్నాడు. ఆయన కడుపులో భూలోకం, భువర్లోకం, స్వర్లోకం మొదలైన లోకాలన్నీ చల్లగా ఉన్నాయి.
3-513 వర వైకుంఠ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
వర వైకుంఠము సారసాకరము; దివ్యస్వర్ణ శాలాంక గో
పుర హర్మ్యావృత మైన తద్భవన మంభోజంబు; తన్మంది రాం
తర విభ్రాజిత భోగి గర్ణిక; దదుద్యద్భోగ పర్యంకమం
దిరవొందన్ వసియించు మాధవుఁడు దా నేపారు భృంగాకృతిన్.

iBAT సందర్భం

సనకసనందనాది జ్ఞానమూర్తులు ఏ అపేక్షలూ లేనివారు. కేవలం ఆనందం కోసం శ్రీమహావిష్ణువును దర్శించుకొనిపోదామని వైకుంఠ మహానగరానికి వెళ్ళారు. వారు చేరుకొంటున్న వైకుంఠం ఎలా ఉన్నదో వివరిస్తున్నది యీ పద్యం.

iBAT తాత్పర్యము

వైకుంఠం చాలా మేలైనపురం. అది ఒక పద్మాల కొలను అనుకొంటే అందులోని పసిడి గోపురాలతో కూడిన మేడల మధ్యనున్న శ్రీ మహావిష్ణువు ఉండే భవనం ఒక గొప్ప పద్మంలాగా ఉన్నది. ఆ భవనం లోపల విరాజిల్లుతున్న ఆదిశేషుడు, విష్ణువునకు సెజ్జగానుండి పద్మంలోని దుద్దులాగా కానవస్తున్నాడు. పైకి చక్కగా ఎత్తిపట్టి ఉన్న ఆ శేషుని తలలనే పానుపు మీద మాధవుడు మకరందాన్ని తనివితీరా గ్రోలటానికి వచ్చిన తుమ్మెదలాగా కనపడుతున్నాడు.
3-537 నిఖిల మునీంద్ర... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నిఖిల మునీంద్ర వర్ణిత సస్మితప్రస; న్నాననాంబుజముచే నలరు వాఁడు
విశ్రుత స్నేహార్ద్ర వీక్షణ నిజభక్త;జన గుహాశయుఁ డనఁ దనరు వాఁడు
మానిత శ్యామాయమాన వక్షమున నం;చిత వైజయంతి రాజిల్లు వాఁడు
నతజనావన కృపామృత తరంగితము లై; భాసిల్లు లోచనాబ్జముల వాఁడు

(తేటగీతి)

నఖిల యోగీంద్ర జన సేవ్యుఁ డైనవాఁడు
సాధు జనముల రక్షింపఁజాలువాడు
భువనచూడా విభూషణభూరిమహిమ
మించి వైకుంఠపురము భూషించువాఁడు.

iBAT సందర్భం

వైకుంఠంలో శేషశయ్య మీద పవ్వళించియున్న శ్రీమహావిష్ణువును మన కన్నులకు కట్టేవిధంగా వర్ణిస్తున్నాడు పోతన మహాకవి.

iBAT తాత్పర్యము

వైకుంఠంలో ఉన్న శ్రీమహావిష్ణువు గొప్ప మునులందరూ వర్ణించే చిరునవ్వుతో కూడిన ప్రసన్నమైన పద్మంవంటి మోముతో అలరారుతున్నారు. ప్రసిద్ధమైన చెలిమితో చెమ్మగిల్లిన కన్నులు ఉన్న తన భక్తజనులకు గుహవలె రక్షణ కల్పించే హృదయం కలవాడా అన్నట్లు ఉన్నాడు. ఆ దేహకాంతి చూడముచ్చటగా ఉంటుంది. అటువంటి దేహంలోని వక్షో భాగంలో కాంతులను విరజిమ్ముతున్న వైజయంతి అనే పూలమాల విరాజిల్లుతున్నది. తనకు మ్రొక్కులు చెల్లించే జనులను కాపాడే దయ అనే అమృతం అలలుఅలలుగా పైకి ఉబుకుతున్నదా అన్నట్లున్న పద్మాలవంటి కన్నులతో ప్రకాశిస్తున్నాడు. యోగివర్యులందరూ ఆయనను సేవించుకుంటూ అన్నివైపులా కూర్చున్నారు. ఆ వైకుంఠపురం భూమికంతటికీ ఒక గొప్ప అలంకారం అనుకుంటే దానికి అలంకారంగా వెలిగిపోతూ ఉన్న మహనీయుడు ఆ శ్రీహరి .
3-534 కటి విరాజిత... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కటి విరాజిత పీత కౌశేయ శాటితో; వితత కాంచీగుణ ద్యుతి నటింప
ఆలంబి కంఠహారావళి ప్రభలతోఁ; గౌస్తుభ రోచులు గ్రందు కొనఁగ
నిజ కాంతి జిత తటిద్ర్జ కర్ణకుండల; రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ
మహనీయ నవ రత్నమయ కిరీటప్రభా; నిచయంబు దిక్కుల నిండఁ బర్వ

(తేటగీతి)

వైనతేయాంస విన్యస్త వామహస్త
కలిత కేయూర వలయకంకణము లొప్ప
నన్య కరతల భ్రమణీ కృతానుమోద
సుందరాకార లీలారవింద మమర.

iBAT తాత్పర్యము

నడుముమీద మెరిసిపోతున్న పట్టుపీతాంబరం మీద మొలత్రాడు దీప్తి చిందులు త్రొక్కుతున్నది. చాలా పొడవుగా వ్రేలాడుతున్న హారాల కాంతులను కౌస్తుభమణి కాంతులు మించిపోతున్నాయి. తన కాంతులనే మెరపుల గుంపులను జయించిన చెవులకు ఆభరణాలైన కుండలాల కాంతులను చెక్కిళ్ళ వెలుగులు మరింత పెంపొందిస్తున్నాయి. చాలా గొప్పవి అయిన తొమ్మిది రకాల రత్నాలు పొదిగిన కిరీటం ప్రభలు దిక్కులందంతటా వ్యాపిస్తున్నాయి. విలాసంగా ఆస్వామి తన పాదాలదగ్గర ఉన్న గరుత్మంతుడి భుజంమీద ఎడమ చేతిని ఉంచాడు. ఆ చేతికున్న వలయాలు, కంకణాలు, కేయూరాలూ వెలుగులను వెదజల్లు తున్నాయి. రెండవ చేతితో ఒక సుందరమైన పద్మాన్ని విలాసంగా త్రిప్పుతూ ప్రకాశిస్తున్నాడు ఆ స్వామి.
3-861 భూరి మదీయ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
భూరి మదీయమోహతమముం బెడబాప సమర్థులన్యులె
వ్వారలు నీవు కాక? నిరవద్య! నిరంజన! నిర్వికార! సం
సారలతాలవిత్ర! బుధసత్తమ! సర్వశరణ్య! ధర్మవి
స్తారక! సర్వలోక శుభదాయక! నిత్యవిభూతి నాయకా!

iBAT సందర్భం

తృతీయ స్కంధంలో చాలా భాగం విదుర మైత్రేయుల సంవాదం. మైత్రేయుడు విదురునకు కపిల, దేవహూతుల సంవాదాన్ని తెలియజేశాడు. అందులో తల్లి దేవహూతి కొడుకు కపిలుని వలన తత్త్వజ్ఞానం పొందిన సందర్భంలోని ఒక ఆణిముత్యాన్ని గమనిద్దాం.

iBAT తాత్పర్యము

నాయనా! కపిలా! నన్ను చాలా ఎక్కువైన అజ్ఞానం అనే చీకటి క్రమ్ముకొని ఉన్నది. దానిని తొలగించివేయటానికి సమర్థులు నీకంటె వేరైనవారు ఎవ్వరూలేరు. ఎందుకంటే నీవు ఏ దోషాలూ లేనివాడవు. ఏ అంటుసొంటులూ లేనివాడవు. ఏ వికారాలూ నీకు లేవు. సంసారం అనే తీగలను కోసివేయగల కొడవలివంటివాడవు నీవు. సర్వమూ తెలిసినవారిలో మొదటి స్థానం నీది. అందరకూ నీవే దిక్కు. ధర్మాన్ని పెంపొందించే దైవస్వరూపుడవు నీవు. అన్ని లోకాలకూ శుభాలను ఇవ్వగలవాడవు. ఎన్నటికీ చెడిపోని మహిమలకు నాయకుడవు.
3-952 హరి మంగళ గుణకీర్తన... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
హరి మంగళ గుణకీర్తన
పరుఁడై తగ నార్జవమున భగవత్పరులన్
గర మనురక్తి భజించుట
నిరహంకారమున నుంట నిశ్చలుఁ డగుటన్

iBAT సందర్భం

కపిలుడు సర్వజ్ఞానాలూ నిండుగా ఉన్నవాడు. తల్లి దేవహూతికి పరమాత్మను చేరుకోవటానికి చెందిన అన్ని యాగాలనూ బోధించాడు. అందులో భక్తియోగాన్ని గురించి తెలుపుతూ ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

తల్లీ! నారాయణునివన్నీ మంగళగుణాలే. వానిని కొనియాడుతూ ఉండటమే తన బ్రతుకు అనుకోవాలి సాధకుడు. భగవంతుని భక్తియేతప్ప మరొకటి పట్టనివారిని భాగవతులు అంటారు. అట్టివారి విషయంలో కల్లాకపటాలు లేకుండా, అనురాగంతో వారికి సేవలందిస్తూ ఉండాలి. అహంకారం అంటే నేనే గొప్ప అనుకోవటం. అది అణువంతైనా లేకుండా ప్రవర్తించాలి. భక్తి విషయంలో చపలచిత్తం లేకుండా మెలగాలి.
3-955 అనిశము సర్వభూత... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
అనిశము సర్వభూతహృదయాంబుజవర్తి యనందనర్చు నీ
శునను నవజ్ఞచేసి మనుజుం డొగి మత్ర్పతిమార్చనా విడం
బనమున మూఢుడై యుచితభక్తిని నన్ను భజింపడేని అ
మ్మనుజుడు భస్మకుండమున మానక వేల్చిన యట్టి వాడగున్.

iBAT సందర్భం

కపిలాచార్యుడు తన తల్లి దేవహూతికి భక్తియోగాన్ని ఇంకా ఇలా వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

అమ్మా! పరమాత్ముడనైన నేను సర్వకాలాలలో ప్రాణులందరి హృదయపద్మాలలోనే ఉంటాను. ఊరకనే ఉండటంకాదు. పరిపాలిస్తూ ఉంటాను. అట్టి నన్ను కొంచెంపాటి జ్ఞానంకూడాలేని మనిషి లెక్కచెయ్యడు. కానీ నా విగ్రహాలను ముందుపెట్టుకొని లోకం మెప్పును ఆశిస్తూ మూఢుడై మెలగుతూ ఉంటాడు. అది సరియైన భక్తికాదు. ఆ విధంగా ప్రవర్తించేవాడు బూడిదరాశిలో హోమద్రవ్యాలను వేసేవాడవుతాడు. జ్వాలలతో అలరారుతున్న అగ్నిలో హవ్యాలను వేయాలి. కానీ బూడిదలో వేస్తే అది పనికిమాలినదే అవుతుంది కదా!
3-984 - అనయమును భువన రక్షణ…
iBAA పద్య గానం
iBAP పద్యము
అనయమును భువనరక్షణ
మునకై స్వేచ్ఛానురూపమున పుట్టెడి వి
ష్ణుని భయవిరహితమగు పద
వనజయుగం బర్థి కొల్తు వారనిభక్తిన్

iBAT సందర్భం

కపిలమహర్షి తల్లికి గర్భంలో పిండం ఎలా ఏర్పడుతుందో చెప్పాడు. ఆ వరుసలో తల్లిగర్భంలో ఉన్న జీవుడు భగవంతుణ్ణి ఎలా స్తుతిస్తాడో అనే విషయాన్ని కూడా వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

ఆ శ్రీ మహావిష్ణువు ఎల్లకాలాలలో లోకాలన్నింటినీ కాపాడటంకోసం తన యిష్టాన్ని బట్టి అవతరిస్తూ ఉంటాడు. ఆ మహాత్ముని పాదాలు పద్మాలవంటివి. వానిని ఆశ్రయిస్తే సంసారభయం తొలగిపోతుంది. నిశ్చలమైన భక్తితో ఆ పాదపద్మాలను నేను పూజించుకొంటూ ఉంటాను.
3-994 భర మగుచున్న... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
భరమగుచున్న దుర్వ్యసనభాజనమై, ఘనదుఃఖ మూలమై
యరయగ పెక్కుతూంట్లు గలదై క్రిమిసంభవమైన యట్టిదు
స్తరబహుగర్భవాసముల సంగతి మాన్పుటకై భజించెదన్
సరసిజనాభ భూరిభవసాగరతారక పాదపద్మముల్

iBAT సందర్భం

తల్లిగర్భంలో పడి పెక్కు కష్టాలు అనుభవిస్తున్న జీవుడు పరమాత్మను పరమభక్తితో ఆరాధించటం తప్ప మరొక గతిలేదనుకుంటూ ఉంటాడని కపిలుడు దేవహూతికి చెబుతున్నాడు.

iBAT తాత్పర్యము

అయ్యయ్యో! తల్లిగర్భంలో ఉండటం ఎంత ఘోరమైన విషయం! ఎందుకంటే దానిని భరించటం చాలాకష్టం. అది చాలాచాలా వ్యసనాలకు పాదు. గొప్పదుఃఖాలకు మూలం. అన్నీ చిల్లులే. అంతేనా అక్కడ అసహ్యమైన సూక్ష్మజీవులు పుట్టి తనచుట్టూ తిరుగుతూ బాధిస్తూ ఉంటాయి. దానినుండి తప్పించుకోవటం తేలిక పని కాదు. పైగా అటువంటవి లెక్కపెట్టటానికి కూడా సాధ్యంకానివి. అటువంటి మహాభయంకరమైన దుఃఖాన్ని తొలగించుకోవటంకోసం శ్రీ మహావిష్ణువు పాదపద్మాలను నిరంతరంగా సేవించుకొంటూ ఉంటాను. అవేకదా చాలా పెద్దది అయిన సంసారమనే సముద్రంనుండి జీవుణ్ణి తరింపజేసేవి!
3-1002 ధన పశు పుత్ర... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ధనపశుపుత్ర మిత్ర వనితా గృహకారణభూతమైన యీ
తనువున నున్నజీవుడు పదంపడి యట్టి శరీరమెత్తినన్
అనుగతమైన కర్మఫల మందగపోవకరాదు, మింటబో
యిన భువి దూఱినన్ దిశలకేగిన ఎచ్చటనైన దాగినన్.

iBAT సందర్భం

పుట్టినజీవికి వరుసగా బంధాలు పెరిగిపోతాయి. మొదట ఆలు, తరువాత పిల్లలూ, ఇల్లూవాకిలీ, గొడ్డూగోదా ఏర్పడతాయి. అవన్నీ జీవుణ్ణి సంసారంలో కట్టిపడవేసి భగవంతుణ్ణి గుర్తించకుండా చేస్తాయి. అది ఒక భయంకరమైన చావు. దీనిని తెలుసు కోవాలి అని తల్లికి కపిలుడు తెలియజేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

ఒక్కమారు సంసారమనే ఊబిలో చిక్కుకొన్న జీవుని అవస్థ ఎలా ఉంటుందో, అమ్మా! గమనించు. వాడు ధన సంపాదనకోసం పాట్లుపడుతూ ఉంటాడు. పశువులు కావాలి. కొడుకులు, చెలికాండ్రు, స్త్రీలు, కొంపలు ఏర్పరచుకొంటూ ఉంటాడు. దీనికి మూలకారణం ఈ దేహం. అందులో ఉన్న జీవుడు అది పోయిన తరువాత కూడా దాని బంధాలను పోగొట్టుకోలేడు. ఆకాశంలోనికి ప్రవేశించినా, భూమిలో దూరినా, దిక్కులకు పాఱినా, ఎక్కడ దాక్కున్నా కూడా వెనుక ప్రోగుచేసుకొన్న ఫలం వెంటతగులుకొని వస్తూనే ఉంటుంది. మళ్ళీ మరొక శరీరాన్ని పొందుతూ ఉంటాడు
3-1028 నీ నామస్తుతి... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నీనామస్తుతి శ్వపచుం
డైనను జిహ్వాగ్రమందు ననుసంధింపన్
వానికి సరి భూసురుడుం
గానేరడు చిత్ర మిది జగంబుల నరయన్

iBAT సందర్భం

కర్దమ ప్రజాపతి యిల్లాలు దేవహూతి సాక్షాత్తూ విష్ణుని అవతారమే అయిన తన కొడుకు కపిలుని వలన పరమార్థజ్ఞానం అంతా ఆకళింపు చేసుకొన్నది. ఆనందంతో ఆ మహాత్ముని స్తోత్రం చేస్తున్నది.

iBAT తాత్పర్యము

కుమారా! కపిలుని రూపంతో కానవస్తున్న పరమాత్మా! కుక్కమాంసం వండుకొని తింటూ బ్రతికే నీచుడయినా నీ నామాలను తన నాలుక కొనమీద భద్రంగా ఉంచుకొని స్తుతిస్తే, అట్టివానికి, గొప్ప పుట్టుక కలవాడనని అహంకరించే బ్రాహ్మణుడు కూడా సాటిరాడు. గమనిస్తే ఇది ఈ లోకాలలో చాలా చిత్రమైన విషయం సుమా!