iBam భాగవతం ఆణిముత్యాలు

అష్టమ స్కంధం

8-19 నీరాట వనాటములకుఁ... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నీరాట వనాటములకు
పోరాటం బెట్లు గలిగె, పురుషోత్తము చే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్

iBAT సందర్భం

అత్యద్భుతమైన గజేంద్ర మోక్షణకథ ప్రపంచ వాఙ్మయంలోనే తలమానికం వంటిది. ఎనిమిదవ స్కంధం భాగవతంలో ఈ కథతోనే మొదలవుతున్నది. పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ఇలా అడుగుతున్నాడు.

iBAT తాత్పర్యము

స్వామీ! ఒకటి నీటిలో తిరుగాడే జంతువు. మరొకటేమో అడవులలో సంచరించే ఏనుగు. పట్టుకొన్నది మొసలి. పట్టుపడినది భద్రగజం. అబ్బో! ఎంత దేహం! ఎంతబలం! అటువంటి ఆ రెండు మహాజంతువులకూ పోరాటం ఎలా కలిగింది? ఎందుకు కలిగింది? పోనీ కలిగిందే అనుకుందాం. సృష్టిలో ఎన్నో ప్రాణులు కొట్టుకొని చస్తూ ఉంటాయి. కానీ మీరు ఘోరమైన అడవిలో ఆభద్రగజం ఆరాటాన్ని పురుషోత్తముడు పోగొట్టాడంటున్నారు! అది ఎలా జరిగింది? అంతా ఆశ్చర్యంగా ఉన్నది. నాకు వినాలని వేడుక పుట్టింది, వినిపించండి.
8-42 అటఁ గాంచెన్... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
అట గాంచెం గరిణీవిభుండు నవ పుల్లాంభోజ కల్హారమున్
నట దిందిందిర వారమున్ గమఠ మీన గ్రాహ దుర్వారమున్
వట హింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీ తీరమున్
చటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబు కాసారమున్

iBAT సందర్భం

శ్రీశుకులవారు పరీక్షిన్మహారాజునకు గజేంద్ర మోక్షణ కథను వివరిస్తున్నారు. రాజా! త్రికూటం అనే గొప్ప పర్వతం ఉంది. దానినుండి ఒకపెద్ద ఏనుగుల మంద దప్పిక తీర్చుకోవటానికీ, జలవిహారం చేయటానికీ బయలుదేరింది. ఆ మందలరేడు ఒక గొప్ప గజరాజునకు ఒక పెద్దజలాశయం కంటపడింది. అది -

iBAT తాత్పర్యము

ఆ జలాశయం అప్పుడప్పుడే విచ్చుకుంటున్న తామరపూవులతో కలువపూవులతో కళకళలాడుతున్నది. వానిమీద మదించిన తుమ్మెదలు నాట్యాలు చేస్తున్నాయి. దానినిండా పెద్దపెద్ద తాబేళ్ళూ, చాలా పెద్ద చేపలూ, ఇంకా పెద్దమొసళ్ళూ విహరిస్తున్నాయి. వానితో అది ఎవ్వరికీ ప్రవేశింపనలవి కాకుండా ఉంది. దాని ఒడ్డుల మీద రావిచెట్లూ, ఒకజాతి తాటిచెట్లూ, మామిడిచెట్లూ, మద్దిచెట్లూ, పూల తీగలతో అల్లుకొన్న పొదరిళ్ళూ చూడముచ్చటగా ఉన్నాయి. అటూ ఇటూ గొప్ప ఉత్సాహంతో ఎగురుగున్న హంసలూ, చక్రవాకాలూ, కొంగలూ మొదలైన పక్షులు కన్నులకు విందు చేస్తున్నాయి. అటువంటి పెద్దజలాశయాన్ని ఆ గజరాజు చూచాడు.
8-45 తొండంబులఁ బూరించుచు... (కందము)
iBAA పద్య గానం
iBAP పద్యము
తొండంబులఁ బూరింపుచు
గండంబులఁ జల్లుకొనుచు గళగళ రవముల్
మెండుకొన వలుఁదకడుపులు
నిండన్ వేదండకోటి నీరుం ద్రావెన్.

iBAT సందర్భం

ఏనుగులన్నీ జలక్రీడలు మొదలుపెట్టాయి. నీటిలోనికి ప్రవేశించాయి. ముందుగా కడుపునిండా నీరు త్రాగాయి. ఆ త్రాగటం ఎలా ఉన్నదంటే,

iBAT తాత్పర్యము

తొండాలతో నీటిని నింపుకున్నాయి. ఒకదాని చెక్కిలిమీద మరొకటిగా చిమ్మనగ్రోవితో చిమ్మినట్లు జల్లుకొన్నాయి. అప్పటి ఆ ధ్వనులు చెవులకు ఇంపుగా వినవస్తున్నాయి. కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయికదా! వాని గళగళధ్వనులు మిన్నుముట్టుతున్నాయి. కావలసినంత నీరు ఉన్నది. తక్కువేమి మనకు అన్నట్లుగా కడుపులు నిండేవిధంగా ఆ ఏనుగుల మందలు నీరు త్రాగాయి.
8-47 ఇభలోకేంద్రుఁడు... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీ రెక్కించి పూరించి చం
డభ మార్గంబున కెత్తి నిక్కి వడి నుడ్డాడించి పింజింప నా
రభటిన్నీరములోనఁ బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్
నభమం దాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్.

iBAT సందర్భం

ఏనుగుల నాయకుడు కడుపునిండా నీరు త్రాగి తరువాత తన నీటి ఆటలను మొదలుపెట్టాడు. ఆ సహజసుందర సన్నివేశాన్ని పోతనామాత్యులవారు మన కన్నులకు కట్టిస్తున్నారు.

iBAT తాత్పర్యము

ఏనుగుల మందలకు నాయకుడైన ఆ గజరాజు తొండాల రంధ్రాలలోనికి నీరెక్కించాడు. సందు లేకుండా నింపాడు. తొండాన్ని ఆకాశంవైపునకు బాగా ఎత్తిపట్టాడు. ఊపుకోసం నిక్కినిలుచున్నాడు. లోపలి నీటిని బాగా పుక్కిలిపట్టాడు. ఒక్కపెట్టున పైకి చిమ్మాడు. ఆ దెబ్బకు ఆ జలాశయంలోని మొసళ్ళు, పెద్దచేపలూ, మిగిలిన జలజంతువులూ గగనంలోనికి దూసుకుంటూ పోయాయి. ఆకాశంలో ఉన్న మీనము, కర్కాటకమూ, అనే గ్రహాలను పట్టుకున్నాయి. దేవతలు అది చూచి చేష్టలుదక్కి నిలుచుండిపోయారు.
8-49 కరిణీ కరోజ్ఝిత... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కరిణీ కరోజ్ఝిత కంకణ చ్ఛట దోగి సెలయేటి నీలాద్రి చెలువు దెగడు
హస్తినీ హస్తవిన్యస్త పద్మంబుల వేయుగన్నులవాని వెఱపు సూపు
కలభ సముత్కీర్ణ కల్హార రజమున కనకాచలేంద్రంబు ఘనత దాల్చు
కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభ వహించు

(ఆటవెలది)

మదకరేణుముక్త మౌక్తిక శక్తుల
మిఱుగు మొగిలుతోడ మేలమాడు
నెదురులేని గరిమ నిభరాజమల్లంబు
వనజగేహకేళి వ్రాలునపుడు

iBAT సందర్భం

ఆ గజేంద్రుని ఆటల ఆర్భాటాలు ఇంకా ఈవిధంగా చూడముచ్చటగా ఉన్నాయి.

iBAT తాత్పర్యము

ఆ ఏనుగులరేనికి ఎదురేలేదు. ఆడినది ఆటగా ఆ పెద్ద చెఱువులో విహరిస్తున్నది. దాని ఆడఏనుగులన్నీ తొండాలతో తుంపురులను దానిమీదకు చిమ్ముతున్నాయి. అప్పుడది సెలయేటిలోని నల్లని కొండలాగా అలరారుతున్నది. అలాగే ఆపెంటి ఏనుగులు చెరువులోని పద్మాలను కుప్పలుతెప్పలుగా దానిమీద వేస్తున్నాయి. అవన్నీ దానిమీద నిలిచి వేయికన్నుల యింద్రుణ్ణి తలపింపజేస్తున్నాయి. గున్నయేనుగులు కలువపూవుల పొడిని దానిమీద చల్లుతున్నాయి. అప్పుడది బంగారుకొండలాగా వెలిగిపోతున్నది. ఆడ ఏనుగులు తామరతూడులను లాగి దానిమీదకు విసరుతున్నాయి. ఆవిధంగా పాములు అలంకారాలుగా భాసిల్లే పరమశివునిలాగా చూపట్టుతున్నది. మదించిన ఏనుగుభామలు పైనిచల్లిన ముత్యాలుగల ముత్యపు చిప్పలతో మెఱుగుతీగలతో విరాజిల్లుతున్న మేఘంలాగా శోభిల్లుతున్నది.
8-51 భుగభుగాయిత భూరి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
భుగభుగాయిత భూరి బుద్బుద చ్ఛటలతో, కదలుచు దివికి భంగంబు లెగయ
భువన భయంకర ఫూత్కార రవమున ఘోర నక్రగ్రాహకోటి బెగడ
వాలవిక్షేప దుర్వార ఝంఝానిల వశమున ఘుమఘుమావర్త మడర
కల్లోల జాల సంఘట్టనంబుల తటీ తరులు మూలములతో ధరణి గూల

(తేటగీతి)

సరసిలో నుండి పొడగని సంభ్రమించి
యుదిరి కుప్పించి లంఘించి హుంకరించి
భాను కబళించి పట్టు స్వర్భానుపగిది
నొక్కమకరేంద్ర డిభరాజు నొడిసిపట్టె.

iBAT సందర్భం

కొలను ఆ ఏనుగుల చిలిపి ఆటలకు అతలాకుతలం అయిపోతున్నది. అది గమనించింది అందులో ఉన్న ఒక మకరం. అది ఈ ఏనుగుల రాజు కంటే ఏమీ తక్కువతిన్నది కాదు. పట్టనలవికాని పట్టుదలతో ఆ ఏనుగును ఒడిసిపట్టుకొన్నది.

iBAT తాత్పర్యము

ఏనుగులరేడు ఒడను తెలియకుండా ఆడుకుంటున్నది. కొలనులో ఉన్న ఒక పెద్దమొసలి దానిని గమనించింది. ఆ మొసలికి స్థానబలం ఉన్నదికదా! అది తనముందు ఆ ఏనుగుఆటలను సాగనిస్తుందా? విజృంభించింది. భుగభుగ అని పొంగుకొని వస్తున్న బుడగలతో అలలు ఆకాశాన్నంటుతున్నాయి. జనాల గుండెలు అదరిపోయే విధంగా అది చేస్తున్న ఫూత్కారనాదంతో మహాభయంకరమైన మొసళ్ళ గుంపులు కూడా అడలిపోతున్నాయి. తోకను ఈడ్చిఈడ్చి కొడుతున్నది. దానివలన పెల్లురేగిన పెద్దగాలిచేత ఘుమఘుమలాడే సుడి గిరగిరా తిరుగుతున్నది. అలలు ఒకదానికొకటి కొట్టుకొనగా ఒడ్డులనున్న మహావృక్షాలు పెల్లగిల్లిపోతున్నాయి. ఆ మొసలి ఒక్కపెట్టున పట్టు చిక్కించుకొని కిప్పించి హుంకరించి ఏనుగును ఒడిసిపట్టుకొన్నది. అది సూర్యగ్రహాన్ని పట్టుకొన్న రాహుగ్రహంలాగా ఉన్నది.
8-54 కరిఁ దిగుచు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కరి దిగుచు మకరి సరసికి
కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్
కరికి మకరి మకరికి గరి
భర మన ని ట్లతల కుతల భటు లదిరిపడన్.

iBAT సందర్భం

పట్టుకొన్న మొసలి, పట్టుచిక్కిన ఏనుగూ పంతం విడనాడకుండా గుంజుకొంటున్నాయి. ఆరెంటి గుంజులాటను కవి కమనీయంగా వర్ణిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

మొసలి ఏనుగును కొలనులోనికి గుంజుకొనిపోతున్నది. భగభగమంటున్న పగ అనే నిప్పుతో ఏనుగు మొసలిని నేలమీదకు లాగుతున్నది. ఈగుంజులాటను నేలపై, నింగిపైనున్న వీరాగ్రేసరులందరూ వింతగ చూస్తున్నారు. కరికి మకరి బరువైపోతున్నది. కాదుకాదు మకరికే కరి బరువైపోతున్నది. అనుకొంటూ ఒక నిర్ణయానికి రాలేక ఊగులాడిపోతున్నారు.
8-57 ఆటోపమ్మునఁ జిమ్ము... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఆటోవమ్మున జిమ్ము ఱొ మ్మగల వజ్రాభీల దంతమ్ములన్
దాటించున్ మెడ జుట్టి పట్టి హరి దోర్దండాభశుండాహతిన్
నీటన్ మాటికి మాటికిం దిగువగా నీరాటము న్నీటి పో
రాటం దోటమిపాటు జూపుట కరణ్యాటంబు వాచాట మై.

iBAT సందర్భం

ఏనుగుల ఏలిక మొసలిపట్టునుండి విడిపించుకోవటానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నది. పడరాని పాట్లన్నీ పడుతున్నది. దాని విజృంభణను మన కన్నులకు కట్టిస్తున్నాడు కవీంద్రులు

iBAT తాత్పర్యము

ఏనుగుల ఏలిక వజ్రాలవంటి అతి కఠినమైన దంతాలతో ఆ మొసలిని రొమ్ము పగిలే విధంగా కొడుతున్నది. శ్రీమహావిష్ణువు భుజదండవంటి తొండంతో మొసలి మెడను బిగించిపట్టుకొంటున్నది. ఆ మొసలి మాటిమాటికీ శక్తినంతా ఉపయోగించి నీటిలోపలికి గుంజివేస్తున్నది. స్థానబలం ఉండటంవలన మొసలికి ఓడిపోతానేమో అని ఏనుగు పెనుఘీంకారాలతో దిక్కులను ముక్కలు చేస్తున్నది.
8-59 మకరితోడఁ బోరు... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
మకరితోడఁ బోరు మాతంగవిభుని నొ
క్కరుని డించిపోవఁ గాళ్ళు రాక
కోరి చూచుచుండెఁ గుంజరీయూథంబు
మగలు దగులుగారె మగువలకును.

iBAT సందర్భం

ఏనుగుల రాజు, మొసళ్ళరేడు పరమ ఘోరంగా పోరాడుతున్నాయి. గజేంద్రుని పతిగా భావించే ఆడ ఏనుగులు లక్షల సంఖ్యలో అక్కడ దీనంగా చూస్తూ నిలబడ్డాయి. ఆ సందర్భంలో కవి దాంపత్య ధర్మానికి సంబంధించిన ఒక మహా విషయాన్ని పశువుల మీద సమన్వయించి లోకానికి ఒక నీతి తెలియ చేస్తున్నారు.

iBAT తాత్పర్యము

ఏనుగుల మందలకు ఏలిక అయి ఇప్పుడు మొసలిరేనితో పరమ ఘోరంగా పోరాడుతున్నాడు గజరాజు. సాధారణంగా మానవజాతిలో అటువంటి సందర్భాలలో సంబంధం కల వ్యక్తులు తమకేమి ఆపద మూడుతుందో అని తమ దారిన తాము పోతూ ఉంటారు. ఆ గజేంద్రుని భర్తగా సంభావించిన లక్షలకొలదిగా ఉన్న ఆడ ఏనుగులకు మాత్రం తమ దారి తాము చూచుకోవటానికి కాళ్ళు రాలేదు. ఏమైతే అదే అవుతుంది అని ఏడుస్తూ అలాగే చూస్తూ ఉన్నాయి. ఆడవారికి పతితో ఉండే తగులం అటువంటిది.
8-65 పాదద్వంద్వము నేల... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
పాదద్వంద్వము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియో
న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని
ప్ఖేద బ్రహ్మపదావలంబన గతిం గ్రీడించు యోగీంద్రు మ
ర్యాద న్నక్రము విక్రమించె కరి పాదాక్రాంత నిర్వక్ర మై

iBAT సందర్భం

మొసలి విజృంభణకు ఏనుగు తల్లడిల్లిపోతున్నది. మకరానికి అంతకంతకూ ఉత్సాహం ఉవ్వెత్తున పొంగిపొరలుతున్నది. నీటిలో మునిగితేలటంలో ఆరితేరిన ఆ మొసలి పరాక్రమాన్ని పోతనామాత్యుల వారు ఇలా వర్ణిస్తున్నారు

iBAT తాత్పర్యము

రెండుకాళ్ళనూ గట్టిగా నేలకు తన్నిపట్టి, ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను గొప్పసాధనతో నిలిపి ఉంచాడు. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే అయుదు ఇంద్రియాల పిచ్చితిరుగుళ్ళను మచ్చిక చేసుకొని తన వశంలో పెట్టుకున్నాడు. బుద్ధి అనే లతకు మాఱాకు తొడిగాడు. అణువంత దుఃఖం కూడాలేని బ్రహ్మపదాన్ని చేరుకొనేదారిలో విహరించే పరమయోగి ఇలా ఉంటాడు. ఇక్కడ మొసలి ఆ యోగీంద్రుని తీరుతెన్నులను మనకు స్ఫురింపజేస్తూ ఏనుగు పాదాలపట్టులో ఏమాత్రమూ సడలింపులేనిదై పరాక్రమిస్తున్నది.
8-71 ఏ రూపంబున... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఏ రూపంబున దీని గెల్తు, నిటమీ దే వేల్పు చింతిం తు, నె
వ్వారిం జీరుదు? నెవ్వ రడ్డ? మిఁక నివ్వారిప్రచారోత్తమున్
వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపారపారాయణుల్
లేరే? మ్రొక్కెద దిక్కుమాలిన మొ ఱాలింపం బ్రపుణ్యాత్మకుల్.

iBAT సందర్భం

గజరాజు మహాశక్తితో ఆ జలగ్రహంతో పెక్కేండ్లు పోరాడినది. దేహశక్తి సన్నగిల్లిపోతున్నది. తన పగవానిబలం పెరిగిపోతున్నది. దీనిని గెలవటం అసాధ్యం అనుకొన్నది. అప్పుడు దానికి పూర్వపుణ్యం వలన దివ్యజ్ఞానం పెల్లుబికి వచ్చింది. అప్పుడు ఆ గజరాజు ఇలా అనుకుంటున్నది

iBAT తాత్పర్యము

ఈ మొసలిని ఏరూపంతో నేను గెలుస్తాను? ఇకపైన ఏ దేవతను తలచుకుంటాను? ఎవ్వరిని ఆశ్రయిస్తాను? ఎవరితో మొరపెట్టుకుంటాను? నాకూ ఈ మొసలికీ అడ్డపడి నన్ను రక్షించేవారెవ్వరు? దీనిని నిలువరించేవారెవ్వరు? ఎటువంటి అలవికాని పనినైనా అలవోకగా చేసి ఆశ్రయించినవారి ఆర్తిని పోగొట్టే దీక్షగల మహాపుణ్యాత్ములు, దిక్కుమాలినవారి మొరలను చెవినిపెట్టే మహాత్ములు లేరా? ఉంటే వారికి మ్రొక్కుతాను.
8-72 నానానేకప యూథముల్... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
నానానేకప యూధముల్ వనములోనం బెద్దకాలంబు స
న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండ నై యుండి మ
ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండలే
కీ నీరాశ నిటేల వచ్చితి, భయం బెట్లోకదే, ఈశ్వరా!

iBAT సందర్భం

ఏనుగునకు తన వెనుకటి వైభవం గుర్తుకువచ్చింది. కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉండే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకొని ఇక్కడికి రావటం తన బుద్ధిలేనితనం అనుకుంటున్నది.

iBAT తాత్పర్యము

నేను ఎంతగొప్పవాడను! మహారణ్యంలో పెక్కుఏనుగుల గుంపులు నన్ను మన్ననతో సేవిస్తూ ఉంటాయి. నాసుఖ భోగాలకు ఇష్టపడి నన్ను ఆనందింపజేస్తున్న ఆడఏనుగులు పదిలక్షల కోట్ల సంఖ్యలో ఉన్నాయి. నాఒడలినుండి వెలువడే మదజలంతో ఏపుగా పెరిగిన, తీగలల్లుకొన్న మంచిగందపు చెట్ల నీడలలో నేను విలాసంగా, వినోదంగా తిరుగుతూ ఉండవచ్చు. కానీ కర్మప్రాబల్యంవల్ల అక్కడ ఉండలేక దప్పిక తీర్చుకోవటానికి ఇక్కడకు ఎందుకు వచ్చిపడ్డాను? ఈశ్వరా! గుండెలో గుబులు కలుగుతున్నదయ్యా
8-73 ఎవ్వనిచే జనించు... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వనిలోపల నుండు లీన మై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాది మధ్య లయుఁ డెవ్వఁడు; సర్వముఁ దాన యైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

iBAT సందర్భం

గజేంద్రునకు గుండె నిలువటంలేదు. అయినా పూర్వపుణ్యఫలంవలన దివ్యజ్ఞాన సంపద అమృతపు బుగ్గలాగా పొంగుకొనివస్తున్నది. పరమాత్మ చైతన్యం అంతరాంతరాలలో పరవళ్ళు త్రొక్కుతున్నది. దానివలన వెలువడే పలుకులు ఉపనిషత్తులను తలపింపజేస్తున్నాయి.

iBAT తాత్పర్యము

ఈ జగత్తు అంతా ఏ పరమాత్మవలన పుట్టినదో, ఎవనిలోపల భద్రంగా వేరుచేయటానికి వీలుకాకుండా ఉంటుందో, చివరకు ఎవనిలో లయమైపోతుందో, ప్రభువులకు కూడా ప్రభువై పాలించే మహాత్ముడు ఎవడో, సర్వమునకు మొట్టమొదటి కారణం ఎవడో, మొదలు, నడుమ, చివర అనే దశలు ఎవనికి ఉండవో, సర్వమూ తానే అయినవాడెవడో అట్టి ఈశ్వరుని, అవసరాన్నిబట్టి తనంతతాను అవతరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మస్థాపన చేసే ఆ పరమాత్మను నాకు రక్షకుడై రావలసినదని ప్రార్థిస్తూ ఉంటాను.
8-74 ఒకపరి జగములు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఒకపరి జగములు వెలినిడి
యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దా నై
సకలార్థ సాక్షి యగు న
య్యకలంకుని నాత్మమూలు నర్థి దలంతున్

iBAT సందర్భం

గజేంద్రుని హృదయంలో ఉపనిషత్తుల దివ్యజ్ఞానం కదలాడుతున్నది. అతని సుకృతం పండి మొసలిపట్టు అతనికి ఆర్తిని కలిగించింది. దానితో అద్భుత వేదాంత రహస్యాలు అతనినోటినుండి వెలువడుతున్నాయి

iBAT తాత్పర్యము

పరమాత్మ ఈ జగములనన్నింటినీ ఒకమారు వెలుపలికి తెస్తూ ఉంటాడు. మరొకమారు అల్లిన గూటిని సాలెపురుగులాగా, లోపలికి తీసుకుంటూ ఉంటాడు. ఆవిధంగా వెలుపలికి వచ్చిన ప్రపంచమూ తానూ ఒకటే అయిపోతాడు. ఈ ఆటకు తన బాధ్యత ఏమీలేకుండా కేవలం సాక్షిగా అంటుసొంటులు లేనివాడై అలరారుతూ ఉంటాడు. జీవులందరికీ ఆదికారణం అయిన ఆ పరమాత్మను స్మరిస్తూ ఉంటాను.
8-75 లోకంబులు లోకేశులు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగిన తుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వడు
నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

iBAT సందర్భం

అది ఒకగొప్పవెలుగు. అయితే దానిని గుర్తించటం చాలా కష్టం. కానీ గుర్తించి తీరాలి. ఎందుకంటే దానికంటె వేకొకటి లేదు అంటున్నది గజేంద్రం.

iBAT తాత్పర్యము

ఈ విశ్వంలో ఉన్న ప్రతి లోకానికి కొంత కాలపరిమితికి లోబడి ఒక పాలకుడు ఉంటాడు. అటువంటి లోకేశులు ఎందరు వచ్చి వెళ్ళిపోయారో! ఇంకా ఎందరు రానున్నారో? ఇక ఆ లోకాలలో ఏర్పడి, కొంతకాలం ఉండి, మళ్ళీ అంతరించిపోతున్న జీవకోట్లు ఎన్ని కోట్లకోట్ల సంఖ్యలో ఉన్నారో! ఆ లోకాలూ, ఆ లోకపాలకులూ, ఆ లోకంలోనివారూ పరమత్మలాగా శాశ్వతంగా ఉండరు. లయమై పోతారు. ఆపని అయిన తరువాత ఏమీ ఉండదు. దానినే ‘అలోకం’ అంటారు. ఆ లోకం పెద్దవెలుగు. అలోకం పెనుచీకటి. దానికి ఆవలివైపున ఒక మహావ్యక్తి, ఒక మహాశక్తి, చెక్కుచెదరని ఆకారంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనే పరమాత్మ. అలా ఉన్న పరమాత్ముణ్ణి నేను సేవించుకుంటాను.
8-76 నర్తకునిభంగిఁ బెక్కగు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నర్తకుని భంగిఁ బెక్కగు
మూర్తులతో నెవ్వఁ డాడు? మునులుఁ దివిజులున్
గీర్తింప నేర? రెవ్వని
వర్తన మొరు లెఱుఁగ? రట్టి వాని నుతింతున్.

iBAT సందర్భం

ప్రపంచంలో ఎంతోమంది వ్యక్తులూ, ఎన్నెన్నో పదార్థాలూ మనకు కానవస్తున్నాయి. తత్త్వదృష్టితో గమనిస్తే ఆ వ్యక్తులందరూ, ఆ పదార్ధాలు అన్నీఆ పరమాత్మయే. నా ఆర్తిని అంతంచేసి నన్ను కాపాడే ఆ స్వామిని నేను కొనియాడతాను.

iBAT తాత్పర్యము

ఆ పరమాత్మ ఎన్నివేషాలయినా వేసి రక్తి కట్టింపగల మహానర్తకుడు. ఏక్షణాన ఏరూపంతో, ఏవిధంగా ఆడుకుంటాడో, తపస్సంపన్నులయిన మునులూ, పుణ్యాలపంట పండించుకొని దేవలోకంలో సుఖంగా తిరుగుతున్న దేవతలూ కూడా తెలుసుకోలేరు. అతని తీరుతెన్నులు ఈవిధంగా ఉంటాయి అని ఎవరూ కొనియాడలేరు. అట్టి పరమత్ముని నాకు తెలియవచ్చినవిధంగా స్తోత్రం చేస్తాను.
8-86 కలఁ డందురు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణములపాలం
గలఁ డందు రన్ని దిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?

iBAT సందర్భం

ఆర్తిలో నిలువెల్లా మునిగినవానికి అన్నీ అనుమానాలే. ‘ఉన్నాడు’ అనుకొన్నవాడు నిజంగా ఉన్నాడా? లేడా? అని సందేహం కలిగింది గజేంద్రునికి. దానినే అతడు ఇలా చెప్పుకుంటున్నాడు.

iBAT తాత్పర్యము

ఆ పరమాత్మ దిక్కులేని దీనులపట్ల ఉంటాడు అని తత్త్వం తెలిసినవారు విస్పష్టంగా ప్రకటిస్తున్నారు. అలాగే పరమమైన యోగసాధన చేసి ఫలసిద్ధి పొందిన యోగుల సముదాయాల సంరక్షణకోసం ‘ఉన్నాడు’ అంటారు. అన్ని దిక్కులందూ ప్రతి అణువులోనూ ‘ఉన్నాడు’ అంటారు. కానీ అలా ఉన్నాడు, ఉన్నాడు అనే భావనలో తిరుగాడే ఆ స్వామి నిజంగా ఉన్నాడో, లేడో!
8-87 కలుగఁడే నా పాలి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కలుగఁడే నాపాలి కలిమి సందేహింపఁ; గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ; బడిన సాధుల కడ్డపడెడు వాఁడు?
చూడఁడే నా పాటుఁ చూపులఁ జూడకఁ; జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొ ఱాలింపఁడే మొఱఁగుల; మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?

(తేటగీతి)

నఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
నాది మధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినడె, చూడడె, తలపడె, వేగరాడె!

iBAT సందర్భం

గజేంద్రునకు మెల్లమెల్లగా తన సంరక్షునియందు నమ్మకం కలుగుతున్నది. కానీ ఆ పరమాత్మ తనను ఆదుకోవటానికి ఎందుకు రావటంలేదు అని ఆరాటం పెరిగిపోతున్నది. అప్పుడు ఆ గజరాజు ఇలా అనుకుంటున్నాడు.

iBAT తాత్పర్యము

ఆ పరమాత్మ నాపట్ల ఉన్నాడా అని సందేహిస్తున్నాను. నిజానికి ఆయనకు ఉండటమూ, లేకుండటమూ లేదు. మరెందుకు వచ్చి నన్ను రక్షింపడు? ఇతరులకు పీడించటమే శీలం అయిన వారి పాలబడిన సజ్జనులకు అడ్డంగా నిలిచి రక్షించేస్వామి నాకు అడ్డపడరాడేమిటి? లోపలిదృష్టితో చూడగలిగిన యోగులను, భక్తులను కృపతో చూచే దయాశీలి నాపాటు చూడడేమి? మోసగాళ్ళ ఆర్తనాదాలు వినికూడా గుట్టుగా ఉండి మంచివారిని మాత్రమే కాపాడే ఆ దేవుడు నామొఱలు ఆలకింపడేమి? సృష్టిలో ఉన్న అన్ని రూపాలూ తన రూపాలే అయినవాడు, ఆదిమధ్యాంతములు లేక వెలుగొందేవాడు. భక్తజనములయెడలా, దీనులయెడలా అండగా నిలిచేవాడు అయిన ఆపరమాత్మ వినడేమి? కనడేమి? నన్నుగూర్చి పట్టించుకోడేమి? వడివడిగా రాడేమి?
8-90 లావొక్కింతయు లేదు... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలం బయ్యెఁ; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమం బయ్యెడిన్;
నీవే తప్ప నితః పరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!

iBAT సందర్భం

గజేంద్రుడు పరిపరివిధాలైన భావాలకు లోనవుతున్నాడు. చిట్టచివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు. దానిమీద స్థిరంగా నిలిచి తన బాధ వింటున్న ఆ శ్రీమహావిష్ణువుతో ఇలా అంటున్నాడు. -

iBAT తాత్పర్యము

ఈశ్వరా! ఇంక నాలో సత్తువ కొంచెం కూడా లేదు. ధైర్యం చెల్లాచెదరైపోయింది. ప్రాణాలు ఏక్షణానైనా జారిపోయేవిధంగా తమతమ తావులనుండి వెలుపలికి వచ్చాయి. మూర్ఛ వస్తున్నది. శరీరం బడలిపోయింది. అలసట నిలువెల్లా ఆక్రమించింది. నన్ను కాపాడేవాడవు నీవు కాక మరొకరు లేరు. ఇటుగాని అటుగాని ఏదీ నాకు తెలియరాకున్నది, స్వామీ!. దీనుణ్ణి. నన్ను మన్నించిరావయ్యా! రా! నీవు భక్తులు కోరిన వరాలిచ్చేవాడవు గదా! నన్ను కాపాడు. భద్రాత్మకా! నన్ను సంరక్షించు, స్వామీ!.
8-92 ఓ కమలాప్త... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఓ! కమలాప్త! యో! వరద! యో! ప్రతిపక్ష విపక్షదూర! కు
య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో! శరణాగ తామరా
నోకహ! యో! మునీశ్వర మనోహర! యో! విపులప్రభావ! రా
వే! కరుణింపవే! తలపవే! శరణార్థిని నన్ను గావవే!

iBAT సందర్భం

గజేంద్రుడు ఎలుగెత్తి ఆక్రోశిస్తున్నాడు. స్వామి మహాగుణాలను సంభావిస్తూ పిలుస్తున్నాడు. తననే రక్షకునిగా సంభావిస్తున్న సంగతిని ఆయనకు నివేదించుకుంటున్నాడు.

iBAT తాత్పర్యము

స్వామీ! కమలాపతీ! అందరికీ కోరిన వరాలిచ్చే కరుణాశాలివి. పగవారిని కూడా పగవారుగా భావింపని దయామయా! గొప్పమేధాబలంగల యోగులు కూడా నిన్ను నిరంతరం ఆరాధిస్తూ ఉంటారు. నీ గుణాలన్నీ సద్గుణాలే. వానివలన నీవు పురుషోత్తముడవయ్యావు కదయ్యా! శరణు కోరివచ్చిన వారికి నీవు కల్పవృక్షానివి. మునిశ్రేష్ఠుల మనస్సులను హరించేవాడవు. నీ ప్రభావానికి ఎటువంటి ఎల్లలూ లేవు. రా తండ్రీ! నన్ను కరుణించు. ఒక్కసారి నన్ను ‘వీడు నావాడు’ అనుకో. రక్షణ కోరి నిన్నాశ్రయించిన నన్ను కాపాడు,స్వామీ!
8-94 విశ్వమయత లేమి... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
విశ్వమయత లేమి వినియు నూరక యుండి
రంబుజాసనాదు లడ్డపడక
విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు
భక్తియుతున కడ్డపడఁ దలంచి.

iBAT సందర్భం

గజేంద్రుడు ఆర్తభక్తుడు, సుకృతి. తనగోడు తన స్వామికి అరమరికలు లేకుండా విన్నవించుకుంటున్నాడు. అతని మొర అచ్యుతునికి వినిపించింది. అచ్యుతుడు మాత్రమే పట్టించుకున్నాడు.

iBAT తాత్పర్యము

పరమాత్మ అయిన విష్ణువొక్కడే విశ్వమయుడు. అంటే విశ్వమంతా తానే అయి ఉన్నవాడు. అటువంటిస్థితి బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైనవారికి లేదు. అందువలన ఆ గజేంద్రుని ఆర్తనాదం విని కూడా వారు అతనికి అడ్డపడక ఊరక ఉండిపోయారు. విశ్వమయుడైన విష్ణువు మాత్రం ఎక్కడ కావాలంటే అక్కడ, ఏరూపం కావాలంటే ఆ రూపంతో ఏర్పడగలవాడు కనుక, ఎల్లవేళలా జయమే పొందగలవాడు కనుక తనయందు అచంచలమైన భక్తిగల ఆ గజేంద్రుణ్ణి కాపాడదలచుకున్నాడు.
8-95 అల వైకుంఠపురంబులో... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా
పల మందార వనాంత రామృతసరఃప్రాం తేందుకాం తోప లో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము "పాహి పాహి" యనఁ గు య్యాలించి సంరంభి యై.

iBAT సందర్భం

ఇప్పుడు మీరు ఆస్వాదించబోయే ఆణిముత్యంలాంటి ఈ పద్యం శ్రీమహాభాగవతం లోని "గజేంద్రమోక్షణం" లోనిది. గజరాజు మొసలి కోరలలో చిక్కుకుని తన శక్తియుక్తులన్నీ వినియోగించి దానిని విదళించి, విసిరికొట్టి విడిపించుకోవటానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. ధైర్యం చెదరిపోయి, ప్రాణాలు గూళ్ళనుండి జారిపోతున్న సమయంలో అతనికి పరమాత్మ గుర్తుకు వచ్చారు. పూర్వజన్మ సంస్కారంతో స్వామిని తనివితీరా స్తుతించాడు. "శరణార్ధినయ్యా, నన్ను కాపాడు" అని ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని ఆర్తనాదం చేశాడు. అప్పుడు -

iBAT తాత్పర్యము

స్వామి ఎక్కడో వైకుంఠపురం లో ఉన్నారు. అందులోనూ అందరికీ అందుబాటులో ఉండని అంతఃపురంలో ఉన్నారు. అక్కడ కూడా ఆయన ఉండే భవనం చాలా లోపలగా ఉంటుంది. దానికి ఎడమ వైపుగా ఒక మందారాల పూల తోట, ఆ లోపల ఒక అమృతపు కొలను, దానికి ఆనుకుని చంద్రకాంత మణుల అరుగు, దాని నిండా నల్లకలువలు పరచుకుని ఉన్నాయి. అదిగో, అక్కడ దానిమీద స్వామి తన ప్రాణప్రియ రమాదేవితో వినోదంగా కాలక్షేపం చేస్తున్నారు. అయినా ఆపదలలో చిక్కుకుని దిక్కులేక అలమటిస్తున్న భక్తులయందు ప్రసన్న భావంతోనే ఉంటారు కదా! అలవికాని దుఃఖంతో, అదుపు తప్పిన అవయవాలలో తల్లడిల్లి పోతున్న ఆ గజరాజు 'కుయ్యి' ఆలకించి ఇక దేనినీ పట్టించుకోని తొందరతనంతో బయలుదేరారు శ్రీమహావిష్ణువు.
8-96 సిరికిం జెప్పఁడు... (మత్తేభం)
iBAA పద్య గానం
iBAP పద్యము
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణి కాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోద్ధతశ్రీకుచో
పరి చేలాంచల మైన వీడడు గజ ప్రాణావనోత్సాహి యై

iBAT సందర్భం

స్వామి సద్భక్తుణ్ణి సంరక్షించటానికి బయలుదేరాడు. ఆపదలో చిక్కుకొన్న అర్భకుణ్ణి కాపాడి అక్కున చేర్చుకోవటానికి ఆరాటపడే అమ్మలా బయలుదేరాడు. అక్కడ దేనితో ఏమి పనిపడుతుందో అనే ఆలోచన కూడా ఆయనకు కలుగలేదు.

iBAT తాత్పర్యము

తన ప్రియకాంత శ్రీదేవికి చెప్పలేదు. అక్కడ అవసరమవుతాయేమో అని రెండు చేతులలో శంఖాన్నీ, చక్రాన్నీ కూర్చుకోలేదు. ఎవ్వనితో ఏమి పనిపడుతుందో అనుకొని సేవకుల నెవ్వరినీ రండయ్యా! నాతో రండి అని పిలువలేదు. ఎంతదూరమో ఎలా పోవాలో అని తన వాహనమైన గరుత్మంతుణ్ణి సిద్ధం చేసికోలేదు. చెవి కమ్మలమీద చీకాకు కలిగిస్తూ చెదరిపడుతున్న కేశపాశాన్ని ముడివేసుకోలేదు. ఆర్తునిపొలికేక వినకముందు అమ్మవారితో ఆడుకుంటూ వినోదపు కలహంలో చేత చిక్కించుకొన్న ఆమె వక్షస్థలం మీది వస్త్రం అంచును కూడా వదలిపెట్టలేదు. గజరాజుప్రాణాలను కాపాడాలి అనే ఉత్సాహం ఒక్కటే సర్వమూ అయిన ఆ స్వామి పరుగులు తీస్తున్నాడు
8-98 తనవెంటన్ సిరి... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు దా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాల గోపాలమున్.

iBAT సందర్భం

ఆర్తుని రక్షణయే ధ్యేయంగా పరుగులు తీస్తున్న స్వామి చెప్పకపోతే ఏమి? కావలసిన కార్యమంతా చక్కగా జరిగిపోతుంది. స్వామిచిత్తం ఎరిగిన అందరూ, అన్నీ ఆయనవెంట అప్రయత్నంగా అంగలు వేసుకుంటూ బయలుదేరటాన్ని పోతనగారు అతి రమణీయంగా మనకు తెలియజేస్తున్నారు.

iBAT తాత్పర్యము

స్వామి అలా బయలుదేరాడో లేదో ఎప్పుడూ విడచి ఉండని లక్షీదేవి వెంటబడింది. ఆమె వెనుక అంతఃపురంలోని అంగనామణులందరూ బయలుదేరారు. వారిని చూచి పక్షిరాజు గరుత్మంతుడు దూకుకుంటూ వస్తున్నాడు. అతనిననుసరించి శాఙ్గమనే విల్లూ, కౌమోదకి అనే గదా, పాంచజన్యమనే శంఖమూ, సుదర్శనమనే చక్రమూ మొదలైనవన్నీ వరుసలో నిలిచి ఉరకలు వేస్తున్నాయి. నిరంతరమూ నారాయణ స్మరణతో ఆనందం పొంగులెత్తే అంతరంగం గల నారదుడు వచ్చి చేరాడు. సేనాపతి విష్వక్సేనులవారు చేరుకున్నారు. ఇంక చెప్పేదేముంది? వీరందరినీ చూచి వైకుంఠపురంలో ఉన్న పసిపిల్లలు మొదలుకొని గోవులను కాచుకొనే గోపాలుర వరకూ అందరూ గజేంద్రుడున్న తావునకు తరలివచ్చారు.
8-100 తన వేంచేయు... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
తన వేంచేయు పదంబు పేర్కొన, డనాథ స్త్రీ జనాలాపముల్
వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్?
దనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో? భక్తులం
గని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్.

iBAT సందర్భం

బయలుదేరిందికానీ అమ్మవారి అంతరంగంలో అనేకమైన ఆలోచనలు. ఎక్కడికి, ఏ పనిమీద, ఎంత దూరం పోవాలి? అనే భావపరంపర ఆమెను నిలువనీయటం లేదు.

iBAT తాత్పర్యము

నా స్వామి తాను ఎక్కడికిపోతున్నాడో చెప్పలేదు. దిక్కులేని అబలల ఆర్తనాదాలు చెవిని పడ్డాయేమో! నిలువెల్లా విషమే అయిన నీచులు దొంగలై వేదరాశులను దొంగిలించారేమో! రక్కసిమూకలు దేవతల రాజగృహాలమీద దండెత్తినవేమో! పాడుబుద్ధిగల వివేకహీనులు భక్తులను చూచి, చక్రం చేతబట్టి ఏదో అద్భుతాలు చేస్తాడంటున్నారే ఆ బోడిచక్రాయుధుడు ఎక్కడ ఉన్నాడో చూపండిరా అని ధిక్కరించి పలుకుతున్నారేమో!
8-103 అడిగెద నని... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడ వెడ సిడిముడి తడఁబడ
నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్.

iBAT సందర్భం

శ్రీమహాలక్ష్మికి చిత్తం చెదరిపోతున్నది. స్వామి సంరంభం ఏమిటో తెలుసుకోవాలి. ఒకవేళ తనతో అయ్యే పనిఏదైనా ఉంటే చేయటానికి నడుముకట్టాలి కదా! అందుకని తెలుసుకోవటానికి ఆరాటపడుతున్నది. ఆ ఆరాటాన్ని అద్భుతమైన అక్షరాల చిత్రంతో మనకందిస్తున్నారు పోతనామాత్యులవారు. .

iBAT తాత్పర్యము

ఆయననే అడిగివేస్తాను అని ఆయనకంటె కొంచెం వడినిపెంచి ముందుకు పోతున్నది. ఇంతలోనే యీ మహానుభావుడు తనవైపు తిరిగి సావధానంగా చెబుతాడో లేదో అని మళ్ళీ వెనక్కి తిరుగుతున్నది. మనస్సంతా గందరగోళంగా ఉన్నది. అడుగులు తడబడుతున్నాయి. అడుగువేయాలి అని అనుకోవటమే కానీ అడుగు ముందుకుపడటంలేదు. కాళ్ళల్లో కదలిక లేని స్థితి ఏర్పడుతున్నది.
8-104 నిటలాలకము లంటి... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నిటలాలకము లంటి నివుర జుం జుమ్మని; ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు;
నళులఁ జోపఁగఁ జిల్క లల్ల నల్లన జేరి; యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు;
శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం;దాకినీ పాఠీనలోక మెగుచు;
మీనపంక్తుల దాఁట మొయిదీఁగతో రాయ; శంపాలతలు మింట సరణిఁ గట్టు;

(ఆటవెలది)

శంపలను జయింపఁ జక్రవాకంబులుఁ
కుచయుగంబుఁ దాఁకి క్రొవ్వు చూపు;
మెలఁత మొగులు పిఱిఁది మెఱుఁగుఁ దీగెయుఁ బోలె
జలదవర్ణు వెనుకఁ జరుగు నపుడు.

iBAT సందర్భం

లోకమాత లక్షీదేవి స్వామి వెన్నంటిపోతూ అష్టకష్టాలు పడుతున్నది.

iBAT తాత్పర్యము

విష్ణుదేవుని వెన్నంటి భక్తరక్షణకోసం పరువులు తీస్తున్న అమ్మవారి పరిస్థితి ఎలా ఉందంటే – నుదుటి మీద ముంగురులు క్రమ్ముకొంటున్నాయి. వానినంటుకొని మోముదామరమీద జుంజుం అంటూ మధురనాదం చేస్తూ తుమ్మెదలు ముసరుకొంటున్నాయి. వానిని పూనికతో తోలే ప్రయత్నంలో ఉండగా రామచిలుకలు మెల్లమెల్లగా చేరి క్రిందిపెదవి కాంతులను ఒడిసిపట్టుకుంటున్నాయి. చిలుకలను తరిమివేసిన వెంటనే కన్నులనే ఒంపుసొంపుల చేపలను మిన్నేటిలోని పెద్దచేపలు తరుముకొని వస్తున్నాయి. ఆచేపల వరుసలను దాటుకోగా మేను అనే తీగతో మెఱుపుతీగలు మింటిలో రాసుకుంటున్నాయి. మెఱుపుతీగలను ప్రక్కకు తొలగింపగా చక్రవాకాలు పాలిండ్లపై వ్రాలి క్రొవ్వుచూపుతున్నాయి. మబ్బువెనుక మసలే మెఱుపుతీగలాగా నీలమేఘశ్యాముని వెంటనంటిన లక్ష్మీదేవి స్థితి ఇలా ఉన్నది.
8-105 వినువీథిన్ జనుదేరఁ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణా వర్ధిష్ణుఁ యోగీంద్ర హృ
ద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృందప్రాభ వాలంకరి
ష్ణు, నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణున్, జిష్ణు, రోచిష్ణునిన్.

iBAT సందర్భం

శ్రీమహావిష్ణువు ఆకాశవీధిలో పయనిస్తూ ఏనుగును రక్షించటానికి వస్తున్నాడు. ఆ దర్శనం కవివరేణ్యుని హృదయంలో కమనీయ రసభావాలను ఉప్పొంగజేస్తున్నది. ఆ పొంగును పాఠకుని హృదయంలో పరవళ్ళు త్రొక్కించటానికి పోతనామాత్యుల వారు ఇలా వర్ణిస్తున్నారు.

iBAT తాత్పర్యము

గగనమార్గంలో వస్తూ ఉండగా దేవతలు పారవశ్యంతో పరమాత్మను దర్శించుకున్నారు. ఆ మహాత్మునిలో దేవతల పగవారైన రక్కసుల బ్రతుకుపంట బండలపాలు కావటం కానవస్తున్నది. భక్తులయెడల దయను ఆ స్వామి మరింతగా పెంపొందిస్తున్నాడు. యోగంలో మిన్నులుముట్టినవారి హృదయాలనే వనాలలో విహరిస్తున్నాడు. భక్తులకోసం ఎంతలేసి కష్టాలనైనా సహించేశీలం అతనిది. భక్తజనుల గుంపుల సంపదలే ఆయన అలంకారాలుగా చేసుకుంటాడు. ఎల్లవేళలా క్రొత్తపెండ్లి కూతురే అయిన ఇందిర పరిచర్యలను ప్రేమతో, లాలనతో అందుకుంటూ ఉంటాడు. జయమందుకోవటమే ఆయన శీలం. అతని దేహపు వెలుగులు ప్రపంచాన్నంతటినీ ప్రకాశింపజేస్తూ ఉంటాయి.
8-107 చనుదెంచెన్ ఘనుఁ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
చనుదెంచెన్ ఘనుఁ డల్ల వాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం
ఖనినాదం బదె; చక్ర మల్లదె; భుజంగధ్వంసియున్ వాఁడె; క్ర
న్నన నేతెంచె నటంచు వేల్పులు "నమో నారాయణా యేతి" ని
స్వను లై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.

iBAT సందర్భం

భక్తరక్షణ కళాసంరంభంతో భూమికి దిగివస్తున్న శ్రీహరినిగూర్చి పారవశ్యంతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ స్వామికి మ్రొక్కులు చెల్లించుకుంటున్నారు దేవతలు.

iBAT తాత్పర్యము

‘చూచారా! అదిగో హరి మహానుభావుడు విచ్చేశాడు. అదిగో ఆ ప్రక్కనే లోకమాత లక్ష్మీదేవి నిలిచిఉన్నది. శంఖంనాదం అదిగో. అదిగదిగో చక్రం. అతడే కదయ్యా సర్పాలను సర్వనాశనం చేసే గరుత్మంతుడు. ‘వడివడిగా వచ్చాడు’ అని ఆనందంతో దర్శించుకుంటూ ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని జపిస్తూ ఏనుగు దురవస్థను రూపుమాపటానికి వస్తున్న చక్రధరునికి మ్రొక్కుతున్నారు దేవతలు. వారి గుంపులతో, ఘోషలతో గగనమంతా నిండిపోయింది.
8-122 అవనీనాథ గజేంద్రుఁ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
అవనీనాథ! గజేంద్రు డా మకరితో నాలంబు గావించె, మున్
ద్రవిళాధీశుఁ డతండు పుణ్యతముఁ డింద్రద్యుమ్న నాముండు వై
ష్ణవముఖ్యుండు గృహీత మౌననియతిన్ సర్వాత్ము నారాయణున్
సవిశేషంబుగఁ బూజ చేసెను మహాశైలాగ్ర భాగంబునన్.

iBAT సందర్భం

స్వామి మకరేంద్రుణ్ణి మట్టుపెట్టాడు. గజేంద్రుణ్ణి గట్టెక్కించాడు. అందరికీ ఆనందాన్ని అందించాడు. కాగా తరువాతి కథలో ఆ ఏనుగు వెనుకటి జన్మలో ఎవరో తెలియజేస్తున్నారు శుకమహర్షుల వారు.

iBAT తాత్పర్యము

పరీక్షిన్మహారాజా! మొసలితో పెద్దకాలం పోరాడిన ఆ గజేంద్రుడు వెనుకటి జన్మలో ద్రవిడదేశానికి ఏలిక. గొప్పపుణ్యం మూటకట్టుకొన్న మనీషి. ఆయన పేరు ఇంద్రద్యుమ్నుడు. విష్ణుభక్తులలో పేరుప్ర ఖ్యాతులు సంపాదించినవాడు. మౌనవ్రతాన్ని అవలంబించి సర్వాత్ముడైన శ్రీమన్నారాయణుని శ్రద్ధాభక్తులతో గొప్ప కొండకొమ్ముమీద కూర్చుండి ఆరాధించాడు.
8-123 ఒకనాఁ డా నృపుఁ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఒకనాఁ డా నృపుఁ డచ్యుతున్ మనములో నూహింపుచున్ మౌని యై
యకలంకస్థితి నున్నచోఁ గలశజుం డచ్చోటికిన్ వచ్చి లే
వక పూజింపక యున్న రాజు గని నవ్యక్రోధు డై మూఢ! లు
బ్ధ కరీంద్రోత్తమ యోని బుట్టు మని శాపం బిచ్చె భూవల్లభా!

iBAT సందర్భం

ఆ ఇంద్రద్యుమ్నుడు మహాభక్తుడే కాదు, మహోదాత్తవ్యక్తి కూడా! . కానీ ధ్యాననిష్ఠలో ఉండగా ఒక అపచారం జరిగిపోయింది. దానివలన ఏనుగైపుట్టాడు. ఆ వివరం చెబుతున్నాను విను అంటున్నారు శుకయోగీంద్రులు.

iBAT తాత్పర్యము

మహారాజా! ఒకనాడు ఆ ఇంద్రద్యుమ్నుడుమనస్సులో అచ్యుతుని నిలుపుకొన్నాడు. మనస్సును చెదరకుండా నిగ్రహించుకున్నాడు. శ్రీమహావిష్ణువునే భావిస్తున్నాడు. చుట్టుప్రక్కల ఏమి జరుగుతున్నదో తెలిసికొనే స్థితిలో కూడా లేడు. మాటలాడటం మానివేశాడు. అతని ధ్యానంలో రవంత కళంకం కూడా లేదు. అదిగో ఆ స్థితిలో అక్కడకు అగస్త్యమహాముని ఏతెంచాడు. ఆయన అన్నివిధాలా పూజింపదగిన తపస్సంపన్నుడు. ఇంద్రద్యుమ్నుడు ధ్యానంలో ఉన్న కారణంగా లేవలేదు. పూజింపలేదు. అటువంటి రాజును చూచిన మునివర్యునకు పట్టనలవికాని కోపం చెలరేగింది. మూఢా! లుబ్ధా! ఏనుగు కడుపులో పుట్టు – అని శపించాడు.
8-135 నరనాథ నీకును... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నరనాథ! నీకును నాచేత వివరింప బడిన యీ కృష్ణానుభావ మైన
గజరాజ మోక్షణ కథ వినువారికి; యశము లిచ్చును గల్మషాపహంబు;
దుస్స్వప్న నాశంబు దుఃఖ సంహారంబుఁ; బ్రొద్దుల మేల్కాంచి పూతవృత్తి
నిత్యంబు పఠియించు నిర్మలా త్మకు లైన విప్రులకును బహువిభవ మమరు

(తేటగీతి)

సంపదలు గల్గు; పీడలు శాంతిబొందు;
సుఖము సిద్ధించు; వర్ధిల్లుశోభనములు;
మోక్ష మఱచేతి దై యుండు; ముదము చేరు
ననుచు విష్ణుండు ప్రీతుఁ డై యానతిచ్చె.

iBAT సందర్భం

‘గజేంద్రమోక్షం’ అనేది భాగవతంలో ఒక విలక్షణమైన కథ. జీవుడు సంసారం అనే మొసలి కోరలలో చిక్కుకొని భగవంతుని అనుగ్రహంతో విడుదలపొందటం ఇందులో ప్రతీకాత్మకంగా తెలియజెప్పారు. కాబట్టి దీనిని జాగ్రత్తగా గమనించి నరుడు సంసారంనుండి విముక్తిని పొందాలి. దానిని స్ఫురింపజేస్తూ ఫలశ్రుతిని వివరిస్తున్నారు.

iBAT తాత్పర్యము

రాజా! పరీక్షిత్తూ! నేను నీకు వివరించిన ఈ గజేంద్రమోక్షణ కథ శ్రీమహావిష్ణుని మహిమను చక్కగా వివరిస్తుంది. ఈకథ వినేవారికి కీర్తిని కలిగిస్తుంది. పాపాలను పోగొడుతుంది. పాడుకలలను నశింపజేస్తుంది. పాడుకలలంటే పాడుబ్రదుకులే. దుఃఖాన్ని తొలగించివేస్తుంది. సూర్యోదయం కాకముందే నిద్రనుండి మేల్కొని పవిత్రమైన నడవడితో ప్రతిదినమూ ఈ కథను పఠించే నిర్మలమైన అంతరంగం గల విద్యావంతులకు అనేక విధాలైన సంపదలు కలుగుతాయి. పీడలు శాంతిస్తాయి. మంగళములు వృద్ధి పొందుతాయి. మోక్షం అరచేతిలో ఉన్న వస్తువులాగా ఉంటుంది. ఆనందం కలుగుతుంది అని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే చెప్పాడు.
8-437 బలి నంభోరుహనేత్రుఁ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
బలి నంభోరుహనేత్రు డేమి కొఱకై పాదత్రయిన్ వేడె; ని
శ్చలుడుం బూర్ణుడు లబ్ధకాముడు రమాసంపన్నుడై తా పర
స్థలికిన్ దీనునిమాడ్కినేల చనియెన్; ద ప్పేమియున్ లేక ని
ష్కలుషున్ బంధన మేల చేసెను; వినం గౌతూహలం బయ్యెడిన్.

iBAT సందర్భం

భాగవతమహాకావ్యంలో వామనచరిత్ర ఒక ఆనందలహరి. ఆ కథకు అంకురార్పణవంటిది పరీక్షిత్తు అడుగుతున్న ఈ ప్రశ్న.

iBAT తాత్పర్యము

స్వామీ! శుకయోగీంద్రా! బలిచక్రవర్తిని పద్మాలవంటి విశాలసుందరాలైన కన్నులున్న హరి మూడడుగుల నేలను దేనికోసం అడిగాడు? ఆయన జీవులకులాగా చంచలమైనచిత్తం కలవాడు కాదు. ఏ లోపమూ లేనివాడు. అన్ని కోరికలూ నిండుగా తీరినవాడు. అంటే ఏమీ అక్కరలేనివాడు. అట్టి పురుషోత్తముడు దీనునిలాగా పరులతావునకు వెళ్ళాడు. అంతేకాదు ఏ తప్పూలేని మహాత్ముడు, పుణ్యాత్ముడు అయిన బలిని బంధించాడు. ఇది వింత అయిన విషయం. దీనిని వివరంగా తెలుసుకోవాలని గుండెనిండా కోరిక ఉన్నదయ్యా! నాకోరిక తీర్చు మహానుభావా!
8-514 నన్నుఁ గన్నతండ్రి... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నన్ను గన్నతండ్రి! నాపాలి దైవమ!
నా తపః ఫలంబ! నా కుమార!
నాదు చిన్నివడుగ! నా కులదీపిక!
రాగదయ్యా! భాగ్యరాశి వగుచు.

iBAT సందర్భం

శ్రీమహావిష్ణువు అవతారప్రయోజనం సాధించటంకోసం తల్లిదండ్రులనుగా అదితికశ్యపులను ఎన్నుకున్నాడు. తన నిజస్వరూపాన్ని మగురుపరచి కపట వటువు వేషం తాల్చి అమ్మ ముందర ఆటలాడుకుంటున్నాడు. తల్లి అదితి అతనిని చూచి ఆనందపారవశ్యంతో ఇలా అంటున్నది.

iBAT తాత్పర్యము

నా చిన్నికుమారా! నీవు నన్నుగన్నతండ్రివి. నాపాలి దైవానివి. నేను చేసుకొన్న తపస్సులపంటవు. నాచిన్నివడుగ! నాకులానికి చిన్నిదీపం అయినవాడా! నా భాగ్యాలరాశివై రా నాయనా!

నిలువెల్లా వాత్సల్యం అనే అమృతంతో నిండిన ఏతల్లి అయినా కన్నకొడుకును ఇలాగే పిలుస్తూ ఉంటుంది. కానీ లోకుల విషయంలో అవన్నీ కల్పనలు. ఇక్కడమాత్రం పరమసత్యాలు. ఎందుకంటే ఇక్కడి పసికూన పరమాత్మ కదా! కనుక అందరికిలాగానే అమ్మకు కూడా తండ్రియే. దైవమే. తపస్సుల ఫలమే. కులమంటే లోకాల సముదాయం. దానికి వెలుగును ప్రసాదించే దీపమే.
8-526 హరిహరి సిరియురమునఁగల... (కందము)
iBAA పద్య గానం
iBAP పద్యము
హరిహరి సిరియురమునగల,
హరి హరిహయు కొఱకు దనుజునడుగన్ జనియెన్
బరహిత రతమతియుతు లగు,
దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్

iBAT సందర్భం

మహావిష్ణువు సర్వసంపదలకు నిలయమైన మహాలక్ష్మికి భర్త. కానీ ఇప్పుడు చిల్లిగవ్వలేని భిక్షుకుడై ఇంద్రునికోసం రాక్షసేంద్రుని దగ్గరకు బిచ్చమెత్తడానికి వెళ్ళాడు. దానిని శుకయోగీంద్రులు ఇలా సమర్థిస్తున్నారు. .

iBAT తాత్పర్యము

హరిహరీ! లక్ష్మీదేవిని వక్షఃస్థలంమీద నిలుపుకొన్న శ్రీహరి హరిహయుడైన ఇంద్రునికోసం ఒక రాక్షసుని దగ్గరకు బిచ్చమెత్తడానికి వెళ్ళాడు. ఇది ఎంత వింత! కాదులే. ఇతరులకు మేలు చేయటమే ఎల్లప్పుడు కోరిక అయిన దొరలకు ఇలా బిచ్చమెత్తటాలు దేహానికి అలంకారాలు అవుతాయి. దానిని ఒకలీలగా సంభావించి సంతోషించండి. భగవంతుడు ఏమిచేసినా అందులో ఆయన గొప్పతనమే తెలియవస్తుంది.
8-545 స్వస్తి జగత్త్రయీ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ద్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధానవిహర్తకు, నిర్జరీ గళ
న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్.

iBAT సందర్భం

బలిచక్రవర్తి ఒక గొప్పయజ్ఞం చేస్తున్నాడు. హరి వామనుడై అవతరించి ఆ యజ్ఞశాలకు చేరుకున్నాడు. అతడిబుడిబుడి నడకలు చూచేవారిని ఆనందసాగరంలో ముంచెత్తుతున్నాయి. చక్రవర్తిని చూచి పవిత్రము, అక్షతలు గల కుడిచేతిని ఎత్తి ఇలా ఆశీర్వదిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

మూడులోకాలకూ ఏలిక అయినవానికి, నవ్వినంత మాత్రాన దేవేంద్రుడంతవానిని కూడా రూపుమాపగల శక్తినిండుగా ఉన్నవానికి, ఉదారుడు అనే పదంతో వ్యవహరింపదగినవానికి, మునివర్యుల స్తుతులతో కూడిన శుభప్రదమైన యజ్ఞవిధులలో ఎల్లవేళలా విహరించేవానికి, దేవకాంతల మెడలలోని మంగళసూత్రాలను తొలగించి వేసే పరాక్రమశాలికీ, రాక్షసలోకానికి పాలకుడైనవానికీ బలిమహాప్రభువునకు స్వస్తి.
8-549 వడుగా యెవ్వరివాఁడ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
వడుగా! ఎవ్వరివా౦డ వెవ్వడవు? సంవాసస్థలంబెయ్యది
య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్;
గడు ధన్యాత్ముఁడ నైతి; నీ మఖము యోగ్యం బయ్యె; నా కోరికల్
గడతేఱెన్; సుహుతంబు లయ్యె శిఖులుం; గల్యాణ మిక్కాలమున్.

iBAT సందర్భం

బలిచక్రవర్తి గొప్పదానశీలుడు. ఇప్పుడు తనదగ్గరకు వచ్చినవాడు ముద్దులు మూటగడుతున్న మోహన బ్రహ్మచారి. అతడు తన గొప్పతనాన్ని గొప్పమాటలతో పేర్కొని స్వస్తి వాచనం చేశాడు. దానికి ఆనందపడి ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

ఓ బ్రహ్మచారీ! నీ తల్లిదండ్రులెవ్వరు? నీవు ఎవడవు? నీవు ఉండే ఊరేది? ఇప్పుడు నీవు ఇక్కడకు రావటంవలన నా వంశమూ, నా పుట్టువూ పొందవలసిన ప్రయోజనాన్ని పొందాయి. నాయనా! నేను చాలా ధన్యాత్ముడనయ్యాను. నాయీ యజ్ఞం యోగ్యమై ఒప్పారుతున్నది. నా కోరికలన్నీ తీరినవి. నా అగ్నిహోత్రాలు విశిష్టమైన హోమద్రవ్యాలతో, ఏ జారుపాటూలేని మంత్రతంత్రాలతో వెలుగొందుతున్నాయి. నేను కోరుకొనే శుభాలను అనుగ్రహించే మంచికాలం ఇది.
8-550 వరచేలంబులొ మాడలో... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
వరచేలంబులొ, మాడలో, ఫలములో, వన్యం బులో, గోవులో,
హరులో, రత్మములో, రథంబులొ, విమృష్టాన్నంబులో, కన్యలో,
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీఖండమొ, కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!

iBAT సందర్భం

తన ధన్యతను మేలైన ఉదాత్త వాక్యాలలో ప్రకటించి ఆ బ్రహ్మచారి తననుండి ఏదైనా దక్షిణగా గ్రహించి మరింత ధన్యుణ్ణి చేయాలనే కోరికతో బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

బ్రాహ్మణవరేణ్యా! నీవు కోరినది సమర్పించుకొని నేను యాగఫలం పొందుతాను. అడుగు. మేలుజాతి వస్త్రాలు కావాలా? బంగారు నాణేలు ఇత్తునా? రుచికరములైన పండ్లు ఇవ్వమంటావా? అడవులలో లభించే పుట్టతేనె వంటివి కోరుకుంటావా? ఆవులను అడుగుతావా? గుఱ్ఱాలా? ? రత్నాలా? రథాలా? పంచభక్ష్యపరమాన్నాలతో కూడిన భోజనాలా? కన్యలా? ఏనుగులా? బంగారమా? గొప్ప భవనాలా? అగ్రహారాలా? భూములా? లేక నేను పరిపాలించే రాజ్యంలో భాగమా? ఇంకా నేను పేర్కొనని ఏది అయినా అడుగు. నేను ఆనందంతో ఇస్తాను.
8-552 ఇది నాకు నెలవని... (సీసము)....
iBAA పద్య గానం
iBAP పద్యము
ఇది నాకు నెలవని యేరీతి బలుకుదు ఒకచోటనక ఎందునుండనేర్తు
ఎవ్వనివాడ నంచేమని పలకుదు నా యంతవాడనై నడవనేర్తు
ఈ నడవడి యని యెట్లు వక్కాణింతు పూని ముప్పోకల పోవనేర్తు
అదినేర్తు నిదినేర్తు నని యేల చెప్పంగ నేరుపు లన్నియు నేన నేర్తు

(ఆటవెలది).

ఒరులు గారు నాకు నొరులకు నేనౌదు;
నొంటివాడ; చుట్టమొకడు లేడు
సిరియు తొల్లి గలదు; చెప్పెద నాటెంకి;
సుజనులందు తఱచు చొచ్చియుందు.

iBAT సందర్భం

బలిచక్రవర్తి మాటలన్నీ విన్నాడు మాయాబ్రహ్మచారి. పైకి దిక్కుమాలినవాడనే భావన కలిగేవిధంగానూ, లోపల దేవదేవుడైన పరమాత్మ అనే అర్థం స్ఫురించేవిధంగానూ ఇలా తన తత్త్వాన్ని తెలియజేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

ఓ చక్రవర్తీ! ఇది నేనుండే చోటు అని ఎలా చెప్పగలనయ్యా! ఒకచోటు అని కాకుండా అన్నిచోట్లా ఉండగలుగుతాను. ఎవ్వరివాడవు అని అడిగావు. దానికి బదులుపలకటం సాధ్యంకాదు. ఎందుకంటే నేను సర్వతంత్ర స్వతంత్రుడను. నీనడవడి ఎటువంటిది అంటే ఏమి చెప్పను? నా సంకల్పంతో నేను మూడు పోకలతోపోతూ ఉంటాను. అవి నేలమీదా, నింగిలోనూ, నీటిపైనా కావచ్చు. ఏవిద్యలు నేర్చుకున్నావు అంటావనుకో అన్ని విద్యలూ నాలో అద్భుతంగా అలరారుతున్నాయి. నాకెవరూ ఏమీకారు. కానీ నేనందరికీ అన్నీ అవుతాను. నేను ఏకాకిని. చుట్టం ఒక్కడు కూడా లేడు. సంపద వెనుక ఉండేదిలే! అడిగావు కనుక నానెలవు చెబుతాను. సాధారణంగా మంచివారిలో కలసిమెలసి ఉంటాను.
8-556 ఒంటివాడ; నాకు... (ఆటవెలది)
iBAA పద్య గానం
iBAP పద్యము
ఒంటివాడ; నాకు నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల
కోర్కెదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర!

iBAT సందర్భం

నీవు ఏది కావాలంటే అది ఇస్తాను అంటున్నాడు బలిచక్రవర్తి. వచ్చినవాడు ఏకోరికలూ లేని పూర్ణకాముడని తెలియదు. ఆయనకు తగినట్లుగానే బదులు పలుకుతున్నాడు పరమాత్ముడైన వామనమూర్తి

iBAT తాత్పర్యము

దానాలు చేయాలనే ఉబలాటం గుండెనిండా ఉన్న ఓ రాక్షసరాజా! నేను ఒంటరివాడను. ఒకటి, రెండడుగుల నేల నాకు చాలు. ఇవ్వు. సొమ్ములూ, కొమ్మలూ నాకు అక్కరలేదు. ఆ మూడడుగుల కోరిక తీరిందనుకో. దానితో బ్రహ్మదేవుని జుట్టు ముడిని ముట్టినంతగా సంబరపడిపోతాను.

భగవంతుడు ఒక్కడే. భగవంతుళ్ళు లేరు. ఆయన అనంతుడు. ఇప్పుడు బలిచక్రవర్తిని ఉద్ధరించటానికి మూడడుగుల నేల కావాలి. బ్రహ్మకూకటిని త్రివిక్రమమూర్తియై ఎలాగూ తాకుతాడు. అని పరమాత్మ లక్షణాన్ని సూచనగా తెలియజేస్తున్నాడు.
8-569 వసుధాఖండము వేడితో... మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
వసుధాఖండము వేడితో, గజములన్ వాంఛించితో, వాజులన్
వెస నూహించితొ, కోరితో యువతులన్, వీక్షించి కాంక్షించితో
పసిబాలుండవు, నేర వీ వడుగ, నీ భాగ్యంబు లీపాటిగా
నసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీనేర్చునే.

iBAT సందర్భం

బలిచక్రవర్తికి వామనుని పలుకులు వింతగా తోచాయి. ఇలా అన్నాడు. మహానుభావా! నీవన్న మాటలన్నీ నిజాలే. కానీ ఇంతకొంచెమా అడగటం!?. దాత పెంపునైనా తలపవద్దా, ఇదిగో చూడు.

iBAT తాత్పర్యము

ఓ బ్రహ్మచారీ! నేనేలే భూభాగంలో కొంతభాగమైనా కోరరాదా?. ఏనుగులనూ, గుఱ్ఱాలనూ అడుగవచ్చు కదా! అందచందాలతో మంచి వయస్సులో ఉన్న కాంతలను ఇమ్మంటే ఇవ్వనా? పాపం పసివాడవు. ఏమి కోరుకోవాలో నీకు తెలియదు. నీ భాగ్యాలు ఈమాత్రానివి అయినంత మాత్రాన మూడడుగుల నేలను ఇవ్వటానికి రాక్షస చక్రవర్తికి మనస్సు ఒప్పుతుందా?
8-571 గొడుగో జన్నిదమో... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
గొడుగో జన్నిదమో కమండలువొ నాకున్ ముంజియో దండమో,
వడుగేనెక్కడ? భూములెక్కడ? కరుల్ వామాక్షులశ్వంబు లె
క్కడ? నిత్యోచితకర్మమెక్కడ? మదాకాంక్షామితంబైన మూ
డడుగుల్ మేరయు త్రోవ కిచ్చుటయ బ్రహ్మాండంబు నాపాలికిన్.

iBAT సందర్భం

బలిచక్రవర్తి తన దానసామర్థ్యానికి తగినట్లు ఇవ్వగలవానికి సంబంధించిన పట్టికను ఏకరువుపెట్టాడు. కానీ పొట్టివడుగు సుకుమారంగా తనకు ఏది కావాలో ఆ పట్టికను మాత్రమే ఆయన విప్పుతున్నాడు.

iBAT తాత్పర్యము

మహారాజా! నేను కోరదగినవి చాలా చిన్నవస్తువులు అయినటువంటిగొడుగో, జన్నిదమో, కమండలమో, దర్భల మొలత్రాడో, మోదుగ దండమో వంటివి మాత్రమే. బ్రహ్మచారినైన నాకు భూములతో, ఏనుగులతో, సుందరాంగులతో, గుఱ్ఱాలతో పని ఏమున్నదయ్యా! నేను ప్రతిదినము శ్రద్ధతో చేసుకొనే సంధ్యావందనం మొదలైన పనులకు నీవు చెప్పినవి ఏవీ ఉపయోగపడవుకదా! కాబట్టి నా కోరికకు లోబడి ఉన్న మూడడుగుల నేలను కాదనకుండా ఇవ్వటమే నాపాలిట బ్రహ్మాండం ఇచ్చినట్లు
8-574 ఆశాపాశంబు దాఁ... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఆశాపాశము దా గడు న్నిడుపు; లే దంతంబు రాజేంద్ర!; వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసిం బొందిరి గాక వైన్య గయ భూకాంతాదులు న్నర్థకా
మాశన్ బాయగనేర్చిరే మును; నిజాశాంతంబులం జూచిరే.

iBAT సందర్భం

ఇంకా వామనుడు ఇలా అంటున్నాడు - ఇవ్వగలిగినవాడు ఇస్తున్నకొద్దీ పుచ్చుకొనేవానికి ఆశ పెరుగుతూ ఉంటుంది. ఆ మాయ రోగానికి మందు ఉందా అనిపిస్తుంది.

iBAT తాత్పర్యము

రాజా! ఆశ అనేది ఒక మహాపాశం. అది చాలాచాలా పొడవైనది. దానికి అంతంలేదు. సముద్రాలు చుట్టుకొన్న భూవలయ సామ్రాజ్యం చేతికి చిక్కినా పృథువు, గయుడు మొదలైన రాజులు ఆశను చంపుకోలేక తామే నాశనమయ్యారు కానీ అర్థకామాలమీది ఆశను వదలగలిగారా? ఆశకు అంతం చూడగలిగారా?
8-577 దనుజేంద్ర యీతఁడు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
దనుజేంద్ర! యీతడు ధరణీసురుడు గాడు; దేవకార్యంబు సాధించుకొఱకు
హరి విష్ణు డవ్యయుం డదితిగర్భంబున గశ్యపసూను డై గలిగె; నకట
యెఱుగ వీతనికోర్కె; నిచ్చెద నంటివి; దైత్యసంతతి కుపద్రవము వచ్చు;
నీ లక్ష్మి తేజంబు నెలవు నైశ్వర్యంబు వంచించి యిచ్చును వాసవునకు;

(ఆటవెలది)

మొనసి జగములెల్ల మూడుపాదంబుల
నఖిలకాయు డగుచు నాక్రమించు
సర్వధనము విష్ణుసంతర్పణము చేసె
బడుగుపగిది యెట్లు బ్రదికె దీవు

iBAT సందర్భం

బాలుడు తన ప్రలోభాలకు ఏమాత్రం తలఒగ్గే తీరులో లేడు. మహాదానం ఇవ్వలేకపోతున్నాననే దిగులు బలిచక్రవర్తికి మనస్సులో ఉన్నా అడిగినది ఇచ్చి తృప్తి పడదామనుకొని దానమివ్వటానికి పూనుకున్నాడు. అప్పుడు గురువర్యులు శుక్రాచార్యులవారు ఇలా అంటున్నారు -

iBAT తాత్పర్యము

రాక్షస చక్రవర్తీ! ఈ వచ్చినవాడు బ్రాహ్మణ బాలకుడు కాడు. దేవతలపని చక్కబెట్టటానికి వచ్చిన విష్ణువు. అవ్యయుడు. ఎట్టి మార్పులూ ఎగుడు దిగుళ్ళూ లేనివాడైనా తన పూనికతో అదితి కడుపులో కశ్యప ప్రజాపతి కుమారుడై అవతరించిన మహాత్ముడు. అతని మహిమ తెలియక కోరిక తీరుస్తానంటున్నావు. నీ నిర్ణయంవలన మన రాక్షస కులమంతా నాశనం అయిపోతుంది. నీ సంపదను, నీ తేజస్సును, నీ స్థానాన్నీ, నీ ప్రభుత్వ మహిమను కపటమార్గంలో కొల్లగొట్టి యింద్రునికి ధారపోస్తాడు. మూడు అడుగులతో లోకాలనన్నింటిని హద్దూపద్దూలేని దేహంతో ఆక్రమిస్తాడు. నీకున్న ధనం మొత్తంగా విష్ణువునకు సంతర్పణ చేసి పరమ దరిద్రుడవై ఎలా బ్రతుకుతావయ్యా?
8-584 వారిజాక్షులందు... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
వారిజాక్షులందు, వై వాహికములందు,
ప్రాణ విత్త మాన భంగమందు,
చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు
బొంకవచ్చు; నఘము పొంద దధిప!

iBAT సందర్భం

శుక్రాచార్యుల వారు ఇంకా ఇలా అంటున్నారు - ఇస్తాను అనిమాట ఇచ్చాను. ఇప్పుడు ఇవ్వను అనటం బొంకు అవదూ! పలికి బొంకేవాడు పాపాత్ముడంటున్నాయి ధర్మశాస్త్రాలు. ఆ పాపం మూట ఎలాకట్టుకోను అంటావేమో, విను -

iBAT తాత్పర్యము

రాజేంద్రా! స్త్రీల విషయంలోనూ, వివాహ వ్యవహారాలలోను, ప్రాణభంగం, విత్తభంగం, మానభంగం సంభవించినప్పుడూ, భయపడిన ఆలమందలను, బ్రాహ్మణులను రక్షించవలసిన సందర్భాలలోను బొంకవచ్చు. దానివలన పాపం కలుగదు అని రాక్షస గురువైన శుక్రాచార్యులవారు, రాక్షసరాజైన బలిచక్రవర్తికి బోధించారు.
8-589 కారే రాజులు... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
కారే రాజులు, రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం బొందరే
వా రేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై
పే రై నం గలదే శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాము లై
యీరే కోర్కులు; వారలన్ మఱచిరే యి క్కాలమున్ భార్గవా!

iBAT సందర్భం

శుక్రాచార్యులవారు శిష్యవాత్సల్యంతో బలిచక్రవర్తిని కాపాడాలని హితం చెప్పినా బలికి మాత్రం లౌకికమైన హితంమీద చూపులేదు. అతడు కోరుకొనేది పారమార్థిక హితం. గురువుమీది గౌరవానికి భంగంలేకుండా తన అభిప్రాయాన్ని గట్టిగా తెలియజేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

పరమపవిత్రమైన భృగువంశంలో పుట్టిన పూజ్యగురుదేవా! మనకు ముందు ఎందరు రాజులు కాలేదు. ఎన్ని రాజ్యాలు లేవు? మేము సార్వభౌములము అని పొగరు సోపానాల చివరిదాకా వారు పోలేదా? వారేరీ? కీర్తిసంపద తప్ప వారు సంపాదించిన ధనాన్ని మూటగట్టుకొని పోగలిగారా? భూమిమీద పేరైనా నిలుపుకోగలిగారా?. ఆర్తిని అందలం ఎక్కించే ఐశ్వర్యాన్ని అణుమాత్రమైనా అభిలషించని శిబి మొదలైన మహాత్ములు, ఏమికోరినా, ఎంతకోరినా ఎంతో ఇష్టంతో ఇచ్చారు. చిరంజీవులై వెలుగొందుతున్నారు. ఎన్నియుగాలు గడచినా వారిని మానవులు మఱచిపోయారా?
8-591 ఆదిన్ శ్రీసతి... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంసోత్తరీయంబుపై
పాదాబ్జంబులపై, గపోలతటిపై, పాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు క్రిం దగుట, మీ దై నా కరం బుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే.

iBAT సందర్భం

ఇంకా బలిచక్రవర్తి ఇలా అంటున్నాడు - మహానుభావా! అడుగుతున్నవాడు అచ్యుతుడు. అన్ని లోకాలకూ ఆవలిభాగంలో అనంతంగా అలరారే ఆస్వామి పొట్టివాడై కోరి నా దగ్గరికి వచ్చి మరీ అడుగుతున్నాడు. నావంటివాడు ఇవ్వకపోవటం ధర్మం కాదే! అయినా నా భాగ్యం ఎంత గొప్పదో గమనించండి.

iBAT తాత్పర్యము

ఆ శ్రీమహావిష్ణువు చేయి మొట్టమొదట మహాలక్ష్మీదేవి కొప్పుమీద వివాహ సమయంలో జీలకర్రా బెల్లం పెట్టినప్పుడు నిలిచి ఉన్నది. తరువాత ఆమె సువర్ణమయ దేహాన్నంతటినీ సుకుమారంగా స్పృశించింది. కొన్ని సందర్భాలలో భుజంమీది ఉత్తరీయం అంచులను సవరించింది. మఱికొన్ని వేళలలో పద్మాలవంటి పాదాలను పరామర్శించింది. చెక్కిళ్ళపై చిందులాడింది. పాలిండ్ల మీద పారవశ్యంతో ప్రేమ వెల్లువతో కదలాడింది. ఆ మర్యాదలన్నీ ఎప్పటికప్పుడు క్రొత్తక్రొత్త అనుభూతులను స్వామికి కలిగించినట్టివి. అటువంటి భాగ్యసంపదగల ఆస్వామిచేయి క్రిందుగా ఉండటమూ, నాచేయి పైన ఉండటమూనా ఆహా! ఎంత మహాభాగ్యమయ్యా! ఈ రాజ్యమూ గీజ్యమూ ఏ క్షణంలో ఉంటుందో, ఏ క్షణంలో ఊడుతుందో తెలియదు. దేనిని నమ్ముకొని మనం ఏదో బాముకుందామనుకుంటున్నామో ఆ ఈ దేహం కూడ అనుక్షణం అపాయంతో అలమటించేదే కదయ్యా! ఈ దౌర్భాగ్యంకోసం అంతటి మహాభాగ్యాన్ని చేజార్చుకొనే అవివేకి ఎవడైనా ఉంటాడా?
8-595 ఎన్నడుం బరు... (మత్తేభం)
iBAA పద్య గానం
iBAP పద్యము
ఎన్నడుం పరు వేడబోడట; యేకలం బట; కన్నవా
రన్నదమ్ములు నై న లేరట; యన్నివిద్యల మూలగో
ష్ఠి న్నెఱింగిన ప్రోడగు జ్జట చేతు లొగ్గి వసింప నీ
చిన్ని పాపని ద్రోసిపుచ్చగ చిత్త మొల్లదు సత్తమా!

iBAT సందర్భం

ఇంకా బలిచక్రవర్తి శుక్రాచార్యులవారితో ఇలా అంటున్నాడు- గురుదేవా! మరొక్కమనవి చేసుకుంటాను. బిచ్చమెత్తటానికిఎందరో వచ్చిపోతూ ఉంటారు. కానీ ఈ గుజ్జు వడుగును చూడు అతడడిగినది యివ్వక పంపివేయటం నాకు సాధ్యమయ్యే పనికాదు – ఎందుకంటే -

iBAT తాత్పర్యము

ఏ సమయంలోనూ ఇతరులను వేడుకోవటానికి పోయినవాడు కాడట! తోడూనీడా ఎవరూ లేనివాడట! కన్నతల్లిదండ్రులు గానీ తోడబుట్టువులు గానీ ఎవ్వరూ లేరట! పరమాత్మను తెలిపే సర్వవిద్యల మూలరహస్యాలను నిండుగా తెలిసిన ప్రౌఢబాలుడట! భిక్షాందేహి అని చేతులు జోడించి ఎదురుగా నిలిచిఉన్నాడు. ఇట్టి చిన్నిపాపని త్రోసివేయటానికి మనస్సు అంగీకరించటం లేదు, గురుదేవా!
8-620 ఇంతితం తై... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఇంతిం తై వటు డింత యై మఱియు దా నింతై నభోవీథిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లం తై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంత యై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై.

iBAT సందర్భం

బలిచక్రవర్తి గురుదేవుని ఒప్పించి మూడడుగుల నేలను ధారాపూర్వకంగా దానం ఇచ్చివేశాడు. వచ్చిన పనిని చక్కబెట్టటానికి వామనదేవుడు పెరిగిపోతున్నాడు. ఆ పెంపును పోతనగారి అక్షరచిత్రంలో దర్శించి ఆనందిద్దాం

iBAT తాత్పర్యము

మొదట ఇంతగా ఉన్న ఆ బ్రహ్మచారి మరింతగా పెరిగాడు. ఇంకా పెంపొందాడు. నేలబారు జీవులు తలలు బాగాపైకి ఎత్తుకొని చూడవలసినంతగా ఆకాశమార్గంలోనికి చొచ్చుకొనిపోతున్నాడు. మేఘమండలం దాటిపోయాడు. కాంతిగోళాలైన నక్షత్రాలపైకి పెరిగిపోయాడు. చంద్రమండలాన్ని కూడా దాటుకొని పైకిపోతున్నాడు. ధ్రువనక్షత్రం పైభాగం తాకుతున్నాడు, భూమినుండి నాలుగవది అయిన మహర్లోకాన్ని కూడా క్రిందుగా ఉంచుకొని పెరుగుతున్నాడు. అన్నింటికంటె చిట్టచివరిదైన సత్యలోకాన్ని కూడా క్రిందుచేస్తూ పైకిపోతున్నాడు. బ్రహ్మాండం ఆవలి అంచులను దాటుకొని విక్రమిస్తున్నాడు.
8-621 రవిబింబం బుపమింపఁ... (మత్తేభం)
iBAA పద్య గానం
iBAP పద్యము
రవిబింబం బుపమింప పాత్ర మగు ఛత్రం బై, శిరోరత్న మై,
శ్రవణాలంకృత మై, గళాభరణ మై, సౌవర్ణ కేయూర మై,
ఛవిమత్కంకణ మై, కటిస్థలి నుదంచ ద్వస్త్ర మై, నూపుర
ప్రవరం బై, పదపీఠ మై, వటుడు దా బ్రహ్మాండము న్నిండుచోన్.

iBAT సందర్భం

బలిచక్రవర్తి దానధారను మంత్రపూర్వకంగా వదలిన వెంటనే వామనస్వామి త్రివిక్రముడయ్యాడు. ఆ పెరుగుదల క్రమంలో సూర్యబింబం గతి ఏవిధంగా ఉన్నదో తెలియజేస్తున్నాడు తెలుగుల పుణ్యపేటి పోతన మహాకవి.

iBAT తాత్పర్యము

క్రింద వామనుడు. పైన ఎక్కడో ఆకాశం అంచులలో సూర్యబింబం. అది మొదట ఆ మహాస్వామికి పట్టిన గొడుగులాగా ఉన్నది. పెరుగటంలోని రెండవదశలో ఆ భానుబింబమే స్వామికి తలమానికంలాగా కనుపట్టింది. మూడవదశలో చెవికి పెట్టుకొన్న వజ్రాల ఆభరణం అయింది. తరువాత మెడలో ధరించిన హారంలోని నాయకమణియై అలరారినది. అటుపై భుజానికి అలంకరించుకొన్న బంగారుకేయూరమై ప్రకాశించింది. ఆవెనుక కాంతులతో వెలిగిపోతున్న ముంజేతికంకణమై ప్రకాశించింది. అటుపిమ్మట నడుము దగ్గర వింతవింత కాంతులతో విరాజిల్లుతున్న పీతాంబరమై అలరారింది. మరికొంతసేపటికి మడమభాగంలో అలంకరించుకొన్న అందెఅయి అందాలు చిందించింది. చివరకు ఆయన విలాసంగా పాదాలుపెట్టుకొనే పీఠం అయిపోయింది. ఈవిధంగా శ్రీమహావిష్ణువు ఏ కొలతలకూ అందనితనాన్ని మన అనుభవంలోనికి తెస్తున్నది ఈ పద్యం.