iBam భాగవతం ఆణిముత్యాలు

సప్తమ స్కంధం

7-6 చిత్రంబులు త్రైలోక్య... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
చిత్రంబులు త్రైలోక్యప
విత్రంబులు భవలతా లవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజనవన
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్

iBAT సందర్భం

పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రునితో ఇలా అన్నాడు. “మహానుభావా! సర్వభూతాలకూ సముడైన నారాయణుడు ఇంద్రునికోసం రక్కసులను వెదకి వెదకి ఎందుకు చంపాడు? అలా చంపితే దేవతల వలన తనకేమైనా ప్రయోజనం ఉందా? నిర్గుణుడైన అతనికి రక్కసుల వలన కలిగే భయమేమైనా ఉన్నదా? చూడగా ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. దీనిని గురించి నీ ప్రజ్ఞంతా ఉపయోగించి నాకు సమాధానం చెప్పు”. అప్పుడు శుకమహర్షి ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

రాజా! నీప్రశ్న చాలా కొనియాడదగినది. శ్రీమన్నారాయణుని సచ్చరిత్రం మహా చిత్రమైనది. ఆ విష్ణుదేవుని చరిత్రలు చాలా విచిత్రమైనవి. మూడులోకాలనూ పవిత్రం చేస్తాయి. సంసారమనే తీగలకు అవి కొడవండ్లు. సజ్జనులకు నెచ్చెలులు. మహర్షుల సముదాయాలనే పూదోటలను విరియబూయించే చైత్రమాసాలు. వసంతంలో చెట్లన్నీ క్రొత్త చిగురాకులతో, పూలతో కళాకాంతులతో ఒప్పారుతాయి కదా!
7-14 అలుక నైనఁ జెలిమి నైనఁ... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
అలుకనైన చెలిమినైన కామంబున
నైన బాంధవముననైన భీతి
నైన తగిలి తలప నఖిలాత్ముడగు హరి
జేరవచ్చు వేఱుసేయ డతడు

iBAT సందర్భం

శ్రీశుకులు శ్రీమన్నారాయణుని దివ్యలీలలను వినిపిస్తున్నాడు. రాజా! విష్ణునికి రాగద్వేషాలు లేవు. ఆయన కొట్టినా తిట్టినా అది అనుగ్రహమే. ఈ విషయాన్ని మునుపు నారదమహర్షి రాజసూయయాగ సందర్భంలో ధర్మరాజునకు చక్కగా తెలియజెప్పాడు. ఆ మాటలను నీవు ఆలకించు.

iBAT తాత్పర్యము

నాయనా! ధర్మరాజా! శ్రీమహావిష్ణువుతో వ్యవహారం లోకంలో లోకులతో అయ్యే వ్యవహారంవంటిదికాదు. కోపంతోనైనా, చెలిమితోనైనా, చుట్టరికంతోనైనా, భయంతోనైనా ఆ మహాత్ముణ్ణి అంటిపెట్టుకొని తలపోస్తూ ఉండాలి. దీనినే ఎడతెగని ధ్యానం అంటారు. దానిలో, కోపతాపాలు ఏ స్థాయిలో ఎంతగా ఉన్నా మనస్సూ, మాటా, చేష్టా మాధవుని మీదనే ఉంటాయి. అప్పుడు హరి అటువంటి వానిని తనలో చేర్చుకుంటాడు. ఆయన సర్వమూ తానే అయినవాడు కదా! కాబట్టి కోపతాపాలను తనపై చూపినవానిని కూడా వేరు చేయడు.
7-18 కామోత్కంఠత గోపికల్... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
కామోత్కంఠత గోపికల్ భయమునం గంసుండు వైరక్రియా
సామగ్రిన్ శిశుపాలముఖ్యనృపతుల్ సంబంధులై వృష్ణులున్
ప్రేమన్ మీరలు భక్తి నేము నిదె చక్రిం గంటి మెట్లైనను
ద్దామధ్యాన గరిష్ఠుడైన హరి చెందన్ వచ్చు ధాత్రీశ్వరా!

iBAT సందర్భం

నారదుడు ధర్మరాజునకు వేరువేరు భావాలతో శ్రీమహావిష్ణువును ఎలా ఆరాధించాలో దృష్టాంతాలతో వివరిస్తున్నాడు. లోకవ్యవహారంలో మంచిచెడు అనేవి ఉంటాయి. భగవంతుని పరంగా ఏదీ దోషాలతో కూడుకొన్నది కాదు, చూడు అంటున్నాడు.

iBAT తాత్పర్యము

మహారాజా! యుధిష్ఠిరా! పొంగి పొరలిన కామంతో గోపికలూ, భయంతో కంసుడూ, పగతో శిశుపాలుడు మొదలైన రాజులు, చుట్టరికంతో వృష్ణివంశం వారూ, నెయ్యంతో మీరూ, భక్తితో మేమూ ఇదిగో అద్భుతమైన చక్రం చేత పట్టుకొన్న నారాయణుని కనుగొనగలిగాము. ఉపాయం ఎట్టిదైనా కావలసినది చాలా ఉన్నతస్థాయికి చెందిన ధ్యానం. అది మహోజ్జ్వలంగా ఉంటే శ్రీహరి అటువంటి తన బిడ్డలను అక్కున చేర్చుకుంటాడు.
7-90 గాలిం గుంభిని... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
గాలిం గుంభిని నగ్ని నంబువుల నాకాశస్థలిన్ దిక్కులన్
రేలన్ ఘస్రములన్ తమఃప్రభల భూరిగ్రాహ రక్షోమృగ
వ్యాళాదిత్య నరాదిజంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్రశ
స్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ! యిప్పింపవే

iBAT సందర్భం

రక్కసులరేడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గుఱించి చాలా ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మకు అతని ఘోరతపస్సు చాలా తృప్తిని కలిగించింది. అతనికి సాక్షాత్కరించాడు. ‘నాయనా! దేహాన్ని పురుగులు తొలచివేస్తున్నా లెక్కచేయక తపస్సు చేశావు. నీకోరికలన్నీ తీరుస్తాను, అడుగు’ అన్నాడు. హిరణ్యకశిపుడు పొంగులెత్తిన ఆనందంతో బ్రహ్మను కొనియాడి చివరకు తన కోరికను ఇలా అడిగాడు.

iBAT తాత్పర్యము

స్వామీ! సర్వలోకాలకు ప్రభూ! గాలిలో, నేలలో, నిప్పులో, నీటిలో, నింగిలో, దిక్కులలో, రాత్రులలో, పగళ్ళలో, చీకట్లలో, వెలుగులలో, గొప్పగొప్ప దేహాలుగల మొసళ్ళు, రక్షస్సులు, క్రూరమృగాలు, పెనుబాములు, దేవతలు, నరులు మొదలైన ప్రాణులతో సంభవించే పెనుయుద్ధాలలో అన్నివిధాలైన అస్త్రాలతో శస్త్రాలతో, ఇంకా పెక్కు విధాలైన ఆయుధాలతో చావులేని బ్రతుకు నాకు అనుగ్రహించు, పరమాత్మా! !
7-92 అన్నా కశ్యపపుత్రా... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
అన్నా! కశ్యపపుత్ర! దుర్లభము వీ యర్థంబు వెవ్వారికిన్
మున్నెవ్వారలు కోరరీ వరములన్ మోదించితి న్నీయోడన్
నన్నుం గోరినవెల్ల నిచ్చితి ప్రవీణత్వంబుతో బుద్ధిసం
పన్నత్వంబున నుండుమీ! సుమతి వై భద్రైక శీలుండవై.

iBAT సందర్భం

హిరణ్యకశిపుని కోరికను తీరికగా ఆలకించాడు సృష్టికర్త బ్రహ్మ. అతడు చావు ద్వారాలన్నీ మూసివేశాననుకున్నాడు. ఏదో ఒకసందు ఉండకపోదనుకున్నాడు బ్రహ్మ. నెమ్మదితో నీ కోరికను తీర్చానన్నాడు. కరుణతో అతనితో ఇలా పలికాడు.

iBAT తాత్పర్యము

అన్నా! కశ్యపమహర్షికుమారా! ఎటువంటి వారికైనా ఈ ప్రయోజనాలు పొందనలవి కానివి. మునుపు ఎవరూ ఇటువంటి వరాలు కోరలేదు. నేను నీవిషయంలో నిండు సంతోషం పొందాను. నీవు నన్నడిగినవన్నీ ఇచ్చాను. కానీ నీవు బుద్ధిసంపదను నిండుగా పెంచుకొని గొప్ప నేర్పుకలవాడవై, మంచి భావనాబలమూ, శుభాలను మాత్రమే సాధించాలి అనే శీలమూ కలవాడవై ఉండు. ఈ విషయంలో ఏమరుపాటు పొందకు.
7-115 తనయందు నఖిలభూతములందు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తనయందు నఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున జరుగువాడు
పెద్దల బొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు
కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావనసేసి మరలు వాడు
తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులఁ గావ చింతించువాడు

(తేటగీతి)

సముల యెడ సోదరస్థితి జరుపువాడు
దైవతములందు గురువుల దలచువాడు
లీలలందును బొంకులు లేనివాడు
లలితమర్యాదుడైన ప్రహ్లాదు డధిప!

iBAT సందర్భం

బ్రహ్మ అనుగ్రహించిన వరాలతో హిరణ్యకశిపుడు కన్నూమిన్నూ కానని వాడయ్యాడు. బ్రహ్మచేసిన హెచ్చరికను అతడు పట్టించుకోలేదు. సర్వలోకాలను అతి క్రూరంగా హింసింపదొడగినాడు. దేవతలందరూ శ్రీమన్నారాయణుని శరణు కోరారు. ఆతడు వారిని ఓదార్చి నేను చూచుకుంటాను అని మాటయిచ్చి పంపించాడు. అటుపిమ్మట హిరణ్యకశిపునకు విచిత్రమైన చరిత్రలుగల నలుగురు కొడుకులు కలిగారు. అందులో ఒకడు ప్రహ్లాదుడు. అతడు-

iBAT తాత్పర్యము

రాజా! ఆ ప్రహ్లాదుడు లలితమైన మర్యాదలను పాటించే శీలం కలవాడు. మర్యాదలంటే ప్రవర్తనకు సంబంధించిన పద్ధతులు. వానిలో కొన్నింటిని మనం మెలకువతో పట్టుకోవాలి. అతడు తనయందూ అఖిల ప్రాణులయందూ, వస్తువులయందూ సమము ఉన్న తీరుతో ప్రవర్తిస్తాడు. సమమంటే బ్రహ్మము కదా! విద్యలో, జ్ఞానంలో, వయస్సులో తనకంటే పెద్దవారు కంటపడితే సేవకునిలాగా దగ్గరకు చేరుకొని నమస్కారాలు చేస్తూ ఉంటాడు. అంటే తానొక మహాచక్రవర్తి కుమారుడను అనే అహంకారం అతనిలో ఇసుమంతైనా కనబడదు. లోకంలో ఏస్త్రీ అయినా ఆమెలో అతడు అమ్మనే చూస్తాడు. తినటానికి తిండీ, కట్టటానికి గుడ్డాలేని అనాథులైన వ్యక్తులు తారసిల్లినప్పుడు తల్లిదండ్రులు వారిని కాపాడే విధంతో ఆదుకోవాలని ఆరాటపడతాడు. తన యీడు బాలకులు తన అన్నదమ్ములే అన్నట్లుగా వ్యవహరిస్తాడు. గురువులను దైవములనుగానే భావిస్తాడు. ఆటపాటలలో పరిహాసానికి కూడా బొంకులులేని వాక్కుల శుద్ధి ఉన్నవాడు.
7-123 పానీయంబులు... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లానిద్రాదులు చేయుచున్ దిరుగుచున్ లక్షింపుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుడేత ద్విశ్వమున్ భూవరా!

iBAT సందర్భం

ప్రహ్లాదునకు ప్రపంచమంతా విష్ణుమయమే. విష్ణువును అన్ని యింద్రియాలతో, మనస్సుతో గమనిస్తూ విశ్వాన్ని స్మృతిపరిథిలోనికి రాకుండా చేసుకోగల మహాజ్ఞాని ఆ రాక్షస బాలకుడు అటువంటి జ్ఞానం మనం అందుకొని ఆచరణలోపెట్టి తరించాలని ఉపదేశించటం కోసం ప్రహ్లాదుని ప్రవృత్తిని. భాగవతం పరమోదాత్తంగా ప్రకటిస్తున్నది.

iBAT తాత్పర్యము

జనమేజయ మహారాజా! దేవతల పగవాడైన హిరణ్యకశిపుని పుత్రుడు అయిన ప్రహ్లాదుడు నీరూ, పాలూ మొదలైన పానీయాలు త్రాగుతూ, అన్నం తింటూ, ఆయా లోకవ్యవహారానికి సంబంధించిన మాటలు పలుకుతూ, తన వశంలో ఉండని నవ్వులలో, ఆటలలో, నిద్ర మొదలైన దశలలో మెలగుతూ, తిరుగుతూ ప్రపంచాన్ని చూస్తూ కూడా ఎల్లవేళలా శ్రీమన్నారాయణుని పాదపద్మాల జంటను భావించటం అనే అమృతాన్ని జుఱ్ఱు కోవటమే పనిగా పెట్టుకొని ఈ విశ్వాన్ని మరచిపోతూ ఉండేవాడు.
7-142 ఎల్ల శరీరధారులకు... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఎల్ల శరీర ధారులకు నిల్లను చీకటి నూతిలోపలం
ద్రెళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున ఖిన్నులై ప్రవ
ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళా మయమంచు విష్ణునం
దుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ!

iBAT సందర్భం

కొడుకు తీరుతెన్నులు తండ్రి హిరణ్యకశిపునకు నచ్చలేదు. అతడు అచ్చమైన రక్కసుడై విష్ణువును కక్కసించుకొనే దిక్కుమాలిన శీలం కలవాడయ్యాడు. అందువలన కొడుకు కూడా అటువంటివాడే కావాలని కోరుకుంటున్నాడు. ఒకనాడు కుమారుని పిలిచి ‘పుత్రా! నీకేది భద్రమైయున్నది?’ అని బుజ్జగిస్తూ అడిగాడు. ప్రహ్లాదుడు జంకుగొంకులు లేకుండా ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

రాత్రి సమయాలలో దొంగచాటుగా తిరుగుతూ ప్రాణులకు ద్రోహంచేసే వారికి నాయకుడవైన మహానుభావా! ఈ ఇల్లు అనే సంసారం ఉన్నదే అది పెద్ద పాడుబడ్డ చీకటి బావి. శరీరం ధరించిన ప్రతి జీవునకూ మొట్టమొదట కలుగవలసిన జ్ఞానం అందులో కూలి పోరాదు- అని. వీరువేరు, మేమువేరు అనే భావన భయంకరమైన ఒక వెఱ్ఱితనం. దాని వలన కలిగేది పరమ దుఃఖం. దానిలో మెలగరాదు. మూడవమెట్టు చాలా గొప్పది. దాని కంటే మించిన జ్ఞానం లేదు. అదేమంటే కనిపించేది, తోచేది, ఉన్నది అంతా ఆ శ్రీమహావిష్ణువునకు సంబంధించిన దివ్యమైన కళతో నిండినది అనే నిశ్చయబుద్ధి. కాబట్టి ఆజ్ఞానం చక్కగా కుదురుకోవాలి, దాని ప్రయోజనం పొందాలి అంటే కృత్రిమ వాతావరణంతో లోకాన్ని మోసగిస్తున్న గ్రామాలూ, నగరాలూ పనికి రావు. సహజసుందరమైన అడవిలో ఉండాలి. అదే మేలైన దారి.
7-150 మందార మకరంద... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మందారమకరంద మాధుర్యమున దేలు ; మధుపంబు వోవునే మదనములకు
నిర్మలమందాకినీ వీచికల దూగు ; రాయంచ చనునె తరంగిణులకు
లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు ; కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందుచంద్రికా స్ఫురిత చకోరకం ; బరుగునే సాంద్రనీహారములకు

(తేటగీతి)

అంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృత పానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు
వినుతగుణశీల మాటలు వేయునేల?

iBAT సందర్భం

కొడుకు పలికిన జ్ఞానపూర్ణమైన వాక్కునకు హిరణ్యకశిపుని తల తిరిగిపోయింది. అయినా కొంత ఓర్పును తెచ్చిపెట్టుకొని రాక్షసప్రవృత్తిని ఉపదేశించటానికి పూనుకున్నాడు. ప్రహ్లాదునకు అదేమీ తలకెక్కలేదు. తన వైఖరిని మొగమాటం లేకుండా కమనీయమైన మాటలతో ఇలా ప్రకటించాడు.

iBAT తాత్పర్యము

తండ్రీ! పదిమంది పరవశించి కొనియాడే గుణాలతోకూడిన శీలం ఉండవలసిన వాడవు నీవు. నీకు వెయ్యిమాటలు చెప్పటం ఎందుకు? ప్రపంచాన్ని పరీక్షించు. మనకంటె నీచస్థాయివి అనుకొనే పశువులు, పక్షులూ కూడా మహావస్తువుల రుచిమరగి నీచపదార్థాల వైపు కంటిని కూడా త్రిప్పవే. గమనించు. అదిగో తుమ్మెద. మందారపుష్పంలోని తేనె తియ్యదనంలో తేలియాడుతున్నది. ఎవరెంత ప్రయత్నించినా అది ఉమ్మెత్తలను చేరుకుంటుందా?

ఆ రాజహంసను చూడు. నిర్మలమైన గంగానది అలలలో తేలి మైమరచి ఆడుకుంటున్నది. అది సారంలేని ఏరులవైపు పయనిస్తుందా? చాలా మృదువైన తీయమామిడి చిగుళ్ళు తింటూ పరవశించిపోతున్న కోకిల కొండమల్లెలకోసం పోతుందా? పున్నమి చందురుని వెన్నెలతో పొంగిపోయే చకోరపక్షి దట్టమైన మంచుదిబ్బల వైపు వెళ్తుందా?

అలాగే అన్నిలోకాలను పుట్టించిన బ్రహ్మను పుట్టించిన బొడ్డు తామరగల శ్రీమహావిష్ణుని దివ్యమైన పాదాలనే పద్మాలను భావించటమే అమృతం. అది పుచ్చుకోవటం చేత చాలా ఎక్కువగా మదించిన నా చిత్తం మరొకదానిని ఎలా చేరగలదు?
7-166 చదివించిరి నను గురువులు... (కందము)
iBAA పద్య గానం
iBAP పద్యము
చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు నే
చదివినవి కలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!

iBAT సందర్భం

తనయుని జ్ఞానవాక్కులకు తండ్రికీ, తప్పుడు చదువులు చెప్పే గురువులకూ తల దిమ్మెక్కిపోయింది. గురువులు రాజుమెప్పుకోసం ఆర్భాటంగా ఇటుపై మెలకువతో మూడు పురుషార్థాలను బోధించి తీసుకొని వస్తామని రాజునకు మాటఇచ్చి ప్రహ్లాదుణ్ణి వెంటబెట్టుకొనిపోయారు. కొన్ని రోజుల తరువాత అతనిని రాజుదగ్గరకు తీసుకొనివచ్చారు. తండ్రి ముచ్చటపడి నీ వెరిగిన శాస్త్రంలో ఒక పద్యాన్ని తాత్పర్యంతోపాటుగా పలకమన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు- అంటూ ప్రారంభించి పరమసుందరమైన జ్ఞానవాహినికి ఒక చక్కని రేవును రూపొందించాడు.

iBAT తాత్పర్యము

నాయనా! నన్ను గురువులు చదివించారు. ధర్మము, అర్థము మొదలైన శాస్త్రాలు గట్టిగానే చదువుకున్నాను. అంతేకాదు. ఇంకానేను చదివినవి చాలా ఉన్నాయి. కానీ నిజమైన చదువు అంటే పరమాత్మ జ్ఞానమేనయ్యా! అటువంటి అనంతంగా ఉన్న చదువులలోని మర్మమంతా నేను చదువుకున్నాను.
7-167 తను హృద్భాషల... (మత్తేభం)
iBAA పద్య గానం
iBAP పద్యము
తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరి న్నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా

iBAT సందర్భం

చదువులలో మర్మం ఏమిటో ప్రహ్లాదుడు గురువులకు గురువై బోధిస్తున్నాడు. ముందుగా భక్తికి సంబంధించిన తొమ్మిది పద్ధతులను కమ్మగా వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

మహారాజా! నీవు దైత్యులలో ఉత్తముడవు. కాబట్టి ఎవడో జ్ఞానసంపన్నుడు ఉపదేశింపకపోతే నీకు తెలియదు కనుక చెప్తున్నాను. భక్తికి సంబంధించి తొమ్మిది మార్గాలు ఉన్నాయి. పట్టుదలతో తొమ్మిదింటినీ సాధించాలి. లేదా శక్తిననుసరించి కొన్నింటినైనా పట్టుకోవాలి. మానవులకు భగవంతుడు దేహాన్నీ, మనస్సునూ, మాటనూ అనుగ్రహించాడు. ఆ మూడింటినీ ఒక్కత్రాటిపైకి తెచ్చుకొని భగవంతునితో చెలిమి చేయటం మొదటిపద్ధతి. సంస్కృతంలో సఖ్యం అంటే ఒకే ప్రాణమన్నంతటి చెలిమి. భగవంతుని గూర్చి వింటూ ఉండటం రెండవ త్రోవ. భగవంతునికి దాసుడై పోవటం మూడవ దారి. నమస్కారం చేస్తూ ఉండటం నాలుగవదారి. పూజలు చేయటం అయిదవ మార్గం. స్వామికి ఏదో ఒక రూపంలో సేవచేయటం ఆరవది. ఆత్మలో భగవంతుని జ్ఞానాన్ని నిండుగా తెలిసికొని నిలుపుకొనటం ఏడవమార్గం. భగవంతునితత్త్వం తెలిపే పాటలు పాడుకుంటూ కాలం గడపటం ఎనిమిదవది. నిరంతరంగా భావిస్తూ ఉండటం తొమ్మిదవది. ఈ తొమ్మిది మార్గాలతో శ్రీహరి సర్వాత్ముడు అని నమ్మి మానవుడు సజ్జనుడై ఉండటమే భద్రమైనది అని నేను భావిస్తూ ఉంటాను. ఇది సత్యం.
7-168 అంధేందూదయముల్... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
అంధేందూదయముల్ మహాబధిరశంఖా రావముల్ మూకస
ద్గ్రంధాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ స
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్

iBAT సందర్భం

ప్రహ్లాదుడు అత్యద్భుతమైన మనోవికాసం పొంది, అదిలేని తండ్రికీ, తండ్రివంటి వారికీ విష్ణుభక్తిలేని వారి దౌర్భాగ్యాన్ని వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

శ్రీహరియందు భక్తిలేనివారి బ్రతుకులు వట్టివపనికిమాలినవి. అవి ఎటువంటివంటే గ్రుడ్డివాని ఎదుట చంద్రుడు ఉదయించటం, అరచి గీపెట్టినా వినపడని చెవిటివానికి శంఖనాదం చేయటం, మూగవానిని గొప్ప వేదాంతగ్రంథాలను బోధించమనటం, పేడివానికి ఆడువారిపై కోరిక పుట్టటం, చేసినమేలు సుఖంగా మరచిపోయి ద్రోహం చేయటానికి వెనుకాడని వారితో చుట్టరికాలు చేయటం, బూడిదలో హోమద్రవ్యాలను క్రుమ్మరించటం, పిసినిగొట్టులకు సంపదలు దొరకడం, పందులకు మంచి గంధాలను అందించటం వంటివి.
7-169 కమలాక్షు నర్చించు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కమలాక్షు నర్చించు కరములు కరములు ; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు ; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు ; మధువైరి తవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు ; పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

(తేటగీతి)

దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి

iBAT సందర్భం

భగవంతుడు మానవులకు కాళ్ళూచేతులూ మొదలైన అంగాలు ఇచ్చినది వానిని శ్రీహరిని సేవించుకోవటానికి మాత్రమే. ఆ పని చేయకపోతే అవి వట్టి పనికిమాలినవి అని ప్రహ్లాదుడు తండ్రికి విస్పష్టంగా వక్కాణిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

తండ్రీ! కమలాలవంటి కన్నులున్న ఆ స్వామిని పూజించే చేతులే నిజమైన చేతులు. లక్ష్మీపతి అయిన నారాయణుని గుణగణాలను కొనియాడే నాలుకయే నాలుక. దేవతలను కాపాడే ప్రభువును చూచే చూపులే చూపులు. ఆదిశేషుని పాన్పుగా చేసికొన్న వైకుంఠనాథునికి మ్రొక్కే తలయే తల. విష్ణువును గూర్చి వినే శీలం కల చెవులే చెవులు. మధువును మట్టుపెట్టిన మాధవుని అంటిపెట్టుకొని ఉండే మనస్సే మనస్సు. భగవంతునకు ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు. పురుషోత్తమునిపై నిశ్చలంగా నెలకొని ఉన్న బుద్ధియే బుద్ధి. ఆయన దేవులందరకు దేవుడు. అట్టివానిని భావించే దినమే దినము. చక్రం చేతబట్టి దుష్టసంహారం చేసే స్వామిని తెలియజెప్పే చదువే నిజమైన చదువు. ఈ సర్వభూమికీ అధినాయకుడైన మహాప్రభువును బోధించే గురువే గురువు. శ్రద్ధగా వినవయ్యా! హరిని చేరుకో నాయనా అని ఉపదేశంచేసే తండ్రియే తండ్రి.
7-170 కంజాక్షునకుఁ గాని... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మభస్త్రిగాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక
హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక
కమలేశు జూడని కన్నులు కన్నులే తను కుడ్య జాల రంధ్రములుగాక

(ఆటవెలది)

చక్రిచింతలేని జన్మంబు జన్మమే
తరళ సలిల బుద్బుదంబుగాక
విష్ణుభక్తిలేని విబుధుండు విబుధుడే
పాదయుగముతోడి పశువుగాక!

iBAT సందర్భం

భగవంతునికోసం వినియోగింపనిదేదీ పనికిమాలినదే అవుతుంది. కనుక రాక్షసరాజా! బుద్ధిశక్తులను వినియోగించి దీనిని గట్టిగా తెలుసుకో అంటున్నాడు ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపునితో

iBAT తాత్పర్యము

రాక్షసచక్రవర్తీ! మన దేహం మాధవుని సేవకు మాత్రమే వినియోగింపబడాలి. లేకపోతే అది కాయమే కాదు. గాలితో నింపిన తోలుతిత్తి అయిపోయింది. మన నోరు వైకుంఠస్వామిని స్తుతిస్తూ ఉండాలి. లేకపోతే అది నోరేకాదు. ఢమఢమా అంటూ చప్పుడు చేసే ఢక్క అయిపోతుంది. మన చేయి శ్రీహరి పాదసేవనం చేయాలి. అప్పుడే అది హస్తం అవుతుంది. కాకపోతే చెట్టుకొమ్మతో చేసిన తెడ్డుకూ దానికీ తేడా ఉండదు. లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణుని చూచే శీలంగల కన్నులే నిజమైన కన్నులు. ఆ పని చేయకపోతే శరీరమనే గోడలో పెట్టిన గవాక్షాలయిపోతాయి. చక్రపాణిని ధ్యానించే జన్మమే జన్మం. అది లేకపోతే క్షణంలో పగిలిపోయే నీటిబుడగ. విష్ణుభక్తిలేని పండితుడు పండితుడే కాడు. రెండు కాళ్ళున్న పశువు.
7-171 సంసారజీమూత సంఘంబు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
స‍ంసార జీమూత సంఘంబు విచ్చునే ; చక్రిదాస్యప్రభంజనము లేక
తాపత్ర యాభీల దావాగ్ను లాఱునే ; విష్ణుసేవామృత వృష్టిలేక
సర్వంకషాఘౌఘ జలరాశులింకునే ; హరిమనీషా బడబాగ్ని లేక
ఘనవిపద్గాఢాంధకారంబు లణగునే ; పద్మాక్షు నుతిరవిప్రభలు లేక

(తేటగీతి)

నిరుపమాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధి గానవచ్చునే ముఖ్యమైన
శార్ఙ్గకోదండ చింతనాంజనములేక
తామరస గర్భునకునైన దానవేంద్ర!

iBAT సందర్భం

మానవుడు మాధవుడు కావాలి. మానవాధముడై దానవుడు కారాదు. దానికి కొన్ని మంచి పనులు చేయాలి. ప్రహ్లాదకుమారుడు తండ్రికి ఆ మంచి పనులను ప్రయోజనా త్మకంగా వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

రాక్షసరాజా! సంసారం ఒక కారుమబ్బుల సముదాయం. అది విచ్చిపోవాలంటే శ్రీమహావిష్ణువునకు దాస్యం చేయాలి. అది ఆ మబ్బుల పాలిట పెనుగాలి. ప్రతివ్యక్తీ మూడు విధాలైన తాపాలతో- మంటలతో ఉడికిపోతూ ఉంటాడు - ఆధ్యాత్మికం, ఆదిభౌతికం, ఆధిదైవికం అని ఆ తాపాలపేర్లు. అవి దట్టంగా పెరిగిన కారడవులలో పుట్టిన దావాగ్ని వంటివి. అవి ఆరిపోవాలంటే విష్ణుసేవ అనే అమృతవర్షం కురవాలి. పాపాల ప్రోవులున్నాయే అవి అన్నింటికీ రాపిడిపెట్టే జలరాశులవంటివి. అవి ఇంకి పోవాలంటే విష్ణువునందు నెలకొన్న బుద్ధి అనే బడబాగ్ని కావాలి. చెప్పనలవికాని ఆపదలనే కాఱుచీకట్లు అణగి పోవాలంటే పద్మాలవంటి కన్నులున్న మాధవుడనే భాస్కరుని ప్రభలు ఉండాలి. మానవుడు అతిముఖ్యంగా తప్పనిసరిగా సాధించి తీరవలసిన గొప్పనిధి ఒక్కటే ఒక్కటి ఉన్నది. దానిని ముక్తి అంటారు. దానికి సాటి అయినది మరొకటిలేదు. అది సిద్ధిస్తే కలిగే గొప్ప లాభం మరల పుట్టటం గిట్టటం అనే తిరుగుళ్ళు ఉండకపోవటం. ఆ నిధిని కనుగొనాలంటే ఒక గొప్పశక్తి గల కాటుకను పెట్టుకోవాలి. ఆ కాటుక ఏమిటో తెలుసా! శార్ఙ్గం అనే వింటిని ధరించి సర్వలోకాలను రక్షిస్తున్న శ్రీహరిని నిరంతరం భావన చేయటమే. ఇది నీకూ నాకూ మాత్రమే కాదు. లోకాలన్నింటినీ సృష్టి చేస్తున్న బ్రహ్మదేవునకు కూడా అదే దిక్కు.
7-182 కాననివాని నూఁతగొని... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువున్
గానని భంగి కర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై
కానరు విష్ణుఁ గొంద ఱటఁ గందురకించన వైష్ణవాంఘ్రిసం
స్థానరజోభిషిక్తులగు సంహృతకర్ములు దానవేశ్వరా!

iBAT సందర్భం

ప్రహ్లాదుని ఉపన్యాసం వింటున్న హిరణ్యకశిపునకు ఒళ్ళుమండి పోతున్నది. గురువులు చెప్పని యీతెలివి నీకెలా వచ్చిందిరా? అని గొంతు చించుకుంటూ కోపంతో ఊగిపోతూ అడిగాడు. దానికి ప్రహ్లాదుడు ఇలా బదులు పలుకుతున్నాడు

iBAT తాత్పర్యము

దానవులకు ప్రభువవైన ఓతండ్రీ! కళ్ళు లేని వాడొకడు ఏదో మేలైన వస్తువును చూడాలని మరొక గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొన్నాడు. వానికి ఆ వస్తువు కానవస్తుందా? అలాగే కొందరు యజ్ఞం మొదలైన కర్మములను పట్టుకొంటారు. అవి వారికి తెగద్రెంచు కోవటానికి వీలులేని సంకెళ్ళయిపోతాయి. దానివలన విష్ణువును చూడలేని దౌర్భాగ్యం వారిని పట్టుకొంటుంది. కానీ వివేకం పండించుకొన్న జ్ఞానులు ఉందోలేదో అన్నంత స్వల్పంగా ఉన్న శ్రీమహావిష్ణువుపాదాల మీది దుమ్ముకణంతో తలమున్కలుగా స్నానమాడి కర్మబంధాలను త్రెంపివేసుకొని విష్ణుదర్శన మహాభాగ్యం పొందుతారు.
7-264 బలయుతులకు దుర్భలులకు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
బలయుతులకు దుర్బలులకు
బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడు, ప్రాణులకును
బలమెవ్వం డట్టి విభుడు బలమసురేంద్రా!

iBAT సందర్భం

ప్రహ్లాదుని విష్ణువిజ్ఞానం హిరణ్యకశిపునకు గుండెలో గ్రుచ్చుకొన్న శల్యం అయిపోయింది. దాని వేదనతో ఓరీ కొడుకా! ఈ సృష్టిలో నేనే బలవంతుణ్ణి. ఒంటరిగా పోరి మహాబలులైన దేవతలనందరినీ గెలిచాను. అటువంటి నాతో ప్రతివీరుడవై నాకు మారుమాటలు పలుకుతున్నావు. ఇది నీకు ఎవని బలం వలన కలిగిందిరా? అన్నాడు. దానికి బదులు చెబుతున్నాడు, ప్రహ్లాదుడు.

iBAT తాత్పర్యము

రాక్షసరాజా! నేను చాలా బలంగల వాడనని నీవు గొప్పలు చెప్పుకుంటున్నావు. కానీ వివేకంతో పరీక్షించితే సర్వలోకాలను వ్యాపించి ఉన్న ప్రభువు శ్రీమహావిష్ణువే అందరికీ, అన్నింటికీ బలం. బలం ఉన్నవాళ్ళకూ, లేనివాళ్ళకూ, నీకూ, నాకూ, బ్రహ్మ మొదలైన దేవుళ్ళకూ, ప్రాణంకల వారందరికీ బలం ఆయనే. గుర్తించినవాడు నావంటి భక్తుడు. గుర్తింపనివాడు నీవంటి రాక్షసేంద్రుడు.
7-274 కలఁ డంభోధిఁ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
కలడంభోధి గలండుగాలి గలడాకాశంబునన్ గుంభినిన్
కలడగ్నిన్ దిశలన్ బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
కలడోంకారమునం ద్రిమూర్తుల త్రిలింగవ్యక్తులం దంతటన్
కలడీశుండు కలండు తండ్రి వెదకంగానేల యీ యాయెడన్.

iBAT సందర్భం

నీవు చెప్పే ఆ విష్ణువు ఎక్కడ ఉంటాడురా? ఏవిధంగా తిరుగుతూ ఉంటాడు? ఏ దారినుండి వస్తాడు? నేను చాలా మారులు వెదికాను. వాడీ విశ్వంలో ఎక్కడా లేడు- అన్నాడు హిరణ్యకశిపుడు. అతడలా అంటున్నకొద్దీ ప్రహ్లాదునికి పట్టశక్యం కాని ఆనందం పొంగులెత్తి వస్తున్నది. ఎందుకంటే తనకా విష్ణువు సర్వమయుడై కనిపిస్తున్నాడు. ఆ ఆనందపారవశ్యంతో గంతులు వేస్తూ చెబుతున్నాడు.

iBAT తాత్పర్యము

తండ్రీ! ఆ శ్రీమహావిష్ణువు సముద్రంలో ఉన్నాడు. గాలిలో ఉన్నాడు. గగనంలో ఉన్నాడు. నేలమీద ఉన్నాడు. అగ్నిలో ఉన్నాడు. అన్ని దిక్కులలో ఉన్నాడు. పగళ్ళలో, రాత్రులలో, సూర్యునిలో, చంద్రునిలో, జీవాత్మలలో, ఓంకారంలో, సృష్టి, స్థితి, లయములను చేసే బ్రహ్మవిష్ణుమహేశ్వరులలో, స్త్రీలలో, పురుషులలో, ఆరెంటికీ చెందని వ్యక్తులలో ఉన్నాడయ్యా! ఇక్కడా అక్కడా వెదకటం ఎందుకు?
7-275 ఇందు గలఁ డందు లేఁడని... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఇందుగల డందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
అందందే కలడు దానవాగ్రణి వింటే.

iBAT సందర్భం

మాకు విష్ణువును వెదకనవసరం లేదు. . రాక్షసప్రవృత్తి కలవానికి విష్ణువు వెదకి చూడవలసినవాడే! రాక్షసరాజా! దీనిని మెలకువతో గమనించు అంటున్నాడు ప్రహ్లాద కుమారుడు.

iBAT తాత్పర్యము

నీవు రాక్షసస్వభావం చిటారు కొమ్మమీద ఉన్నవాడవు కాబట్టి చక్రి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నావు. తండ్రీ! ఆ చక్రం చేతబట్టి నీవంటి వారి శిరస్సు ఖండించటం కోసమే ఆ శ్రీమహావిష్ణువు అవకాశంకోసం చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సందేహమే వలదు. ఆయన సర్వంలో, సర్వులకూ చాలా దగ్గరగా అందుబాటులోనే ఉన్నాడు. కాకపోతే నీవంటి వాడు వెదకి చూడాలి. ఎక్కడ ఎక్కడ వెదికి చూస్తే అక్కడ అక్కడనే ఉన్నాడు. ఈ మాటను చాలా జాగరూకతతో వింటున్నావా?
7-277 హరి సర్వాకృతులం... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
హరి సర్వాకృతులం గలండనుచు ప్రహ్లాదుండు భాషింప స
త్వరుడై యెందును లేడులేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానాజంగమ స్థావరో
త్కరగర్భంబుల నన్నిదేశముల నుద్దండప్రభావంబునన్

iBAT సందర్భం

తండ్రీకొడుకుల తగవులాట చాలా రసవత్తరంగా జరుగుతున్నది. వారిద్దరి మధ్యా శ్రీహరి చిద్విలాసంతో ఊగిపోతున్నాడు. దుష్టుణ్ణి శిక్షించటానికీ, భక్తుణ్ణి పరిరక్షించటానికీ ఆ సర్వజగన్నాయకుడు ఏమి చేస్తున్నాడో మహాభక్తశిఖామణి పోతన్నగారు రమణీయ పద్యంద్వారా మనకందిస్తున్నారు.

iBAT తాత్పర్యము

ప్రహ్లాదుడు తండ్రితో శ్రీహరి అన్ని విధాలైన ఆకారాలతో అన్ని ఆకారాలలో ఉన్నాడు అని నొక్కి వక్కాణిస్తున్నాడు. హిరణ్యకశిపుడు ఆ మాటలు వినీవినకుండానే గట్టిగా ఎక్కడా లేడు ఎక్కడా లేడుఅని గొంతు చించుకొని అరుస్తున్నాడు. అక్కడతో ఆగలేదు. కొడుకును మాటలతో చేష్టలతో బెదిరిస్తున్నాడు. ఆ సంఘర్షణ అలా సాగుతూ ఉండగా ఎక్కడా ఏవిధమైన జారుపాటులేని నిత్యసత్యశివసుందరాత్మకుడైన అచ్యుతుడు నరాకృతినీ, సింహాకృతినీ కలగలుపుకొని అన్ని విధాలైన కదలనివీ, కదిలేవీ అయిన భూతాలన్నింటిలో, అన్నిదేశాలలో రక్కసుని ఉక్కడగించటానికి అవసరమైన సన్నాహంతో ఉన్నాడు.
7-286 నరమూర్తి గాదు... (కందము)
iBAA పద్య గానం
iBAP పద్యము
నరమూర్తిగాదు కేవల
హరిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే
సరియాకారము నున్నది
హరి మాయారచిత మగు యథార్థము సూడన్

iBAT సందర్భం

భక్తసంరక్షణకై శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని శిక్షించటం కోసం సభాస్తంభంనుండి మహాభయంకరంగా నరసింహస్వామియై ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడు వచ్చినది వింతమృగం కాదని నిశ్చయించుకున్నాడు. మనస్సులో ఇలా అనుకుంటున్నాడు.

iBAT తాత్పర్యము

ఇదేమిటి?! మానవాకారం అందామా? కాదే! సింహరూపం అందామా?! అదీకాదే! మానవాకారమూ, జూలు విదలిస్తున్న సింహం ఆకారమూ - రెండూ కలగాపులగంగా ఉన్నది. ఇది హరి కల్పించిన మాయ అయి ఉంటుంది. అదే సత్యం!
7-349 అమరుల్ సిద్ధులు... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చి
త్తముల న్నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పా
రము ముట్ట న్నుతిసేయ నోపరఁట; నే రక్షస్తనూజుండ గ
ర్వ మదోద్రిక్తుఁడ బాలుఁడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే?

iBAT సందర్భం

హిరణ్యకశిపుని డొక్కచించి, ప్రేగులు చిందరవందరగా లాగివేసి నరసింహస్వామి సంహరించాడు. ఆ భయంకర క్రోధమూర్తిని చూచి బ్రహ్మాది దేవతలూ, బ్రహ్మర్షులూ అనేక విధాలుగా స్వామిని స్తుతించారు. అయినా స్వామి చల్లబడలేదు. శ్రీమహాలక్ష్మి ని కూడా ప్రార్ధించారు. అయినా ప్రయోజనం కనబడలేదు. చివరకు బ్రహ్మదేముడు పరమ భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు మాత్రమే స్వామిని శాంతింపగలడని తలచి, అతనిని వేడుకున్నాడు. స్వామి శాంతించాడు. అప్పుడు ప్రహ్లాదుడు భగవంతునితో ఇలా అంటున్నాడు -

iBAT తాత్పర్యము

శ్రీమన్నారాయణా! నరసింహస్వామీ! దేవతలూ, సిద్ధులూ, యోగీశ్వరులూ, బ్రహ్మ మొదలైనవారు నీయందే నిలుపుకొన్న చిత్తం కలవారై ఎన్నెన్నో విధాలుగా నిరంతరమూ విచారించి ఆవలితీరం వరకూ నిన్ను నుతిచేయలేకపోతున్నారట. ఇక నేనా నీగుణాలను కొనియాడేది! అసలే రక్కసిరేని కడుపున పుట్టినవాడను, పొగరుతెగ బలిసినవాడను, జడమైన మతిగలవాడను. ఇటువంటి వానికి నిన్ను స్తోత్రం చేయడం ఎలా తెలుస్తుంది మహానుభావా!
7-386 జలజాతప్రభవాదులున్... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
జలజాతప్రభవాదులున్ మనములోఁ జర్చించి భాషావళిన్
బలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ యింటిలోఁ
జెలి యై మేనమఱంది యై సచివుఁ డై చిత్తప్రియుం డై మహా
ఫలసంధాయకుఁ డై చరించుట మహాభాగ్యంబు రాజోత్తమా!

iBAT సందర్భం

ప్రహ్లాదుడు భక్త శిఖామణి. శ్రీహరి అతనిని ఏవిధంగా కాపాడినాడో నారదుడు పరమ రమణీయంగా రాజసూయయాగం సందర్భంలో ధర్మరాజునకు వివరించి చెప్పాడు. నారద మహర్షి చిట్టచివరకు ధర్మరాజుతో ఇలా అన్నాడు -

iBAT తాత్పర్యము

మహారాజా! ధర్మరాజా! నీది మహా భాగ్యమయ్యా! నాలుగుమోముల దేవర అయిన బ్రహ్మదేవుడు మొదలైన దేవతా సార్వభౌములు కూడా ఎన్నో విధాలుగా మనస్సులలో ఎంతగానో చర్చించి కూడా, భాషల ద్వారా ఆ శ్రీమహావిష్ణువు గురించి నాలుగు మాటలు చెప్పలేరు. ఎందుకంటే ఆయన జనార్దనుడనే పేరుగల పరబ్రహ్మము. ఆ తత్త్వం మనస్సుకూ, మాటలకూ అందేది కాదని వేదాలంటున్నాయి. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడు ఇప్పుడు కన్నయ్య అయి నీకు చెలికాడు, మేనమఱది , మంత్రి, మనోహరుడూ, ఎన్నెన్నో ఎవరూ అందించలేని మహాఫలాలను నీకు అందిస్తూ నీ ఇంటిలో ఆనంద పరిపూర్ణుడై తిరుగుతున్నాడయ్యా! ఈ భాగ్యం ఎవరికైనా దక్కుతుందా!?