iBam భాగవతం ఆణిముత్యాలు

చతుర్ధ స్కంధం

4-91 నెలకొని ధర్మపాలన... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించు న
క్కలుషుని జిహ్వ గోయదగు గా కటుసేయగ నోపడేని తా
పొలియుట యొప్పు, రెంటికి ప్రభుత్వము సాలమికర్ణ రంధ్రముల్
బలువుగ మూసికొంచు చన పాడి యటందురు ధర్మవర్తనుల్.

iBAT సందర్భం

మైత్రేయమహర్షి విదురునకు అనేక పురాణ విషయాలను ఉపదేశించాడు. వరుసలో దక్షప్రజాపతి కథ వచ్చింది. దక్షుడు సరియైన జ్ఞానంలేక పరమశివునితో పగ పెట్టుకున్నాడు. తన బిడ్డను, ఆమె భర్తనూ ఘోరంగా అవమానించాడు. తన తనయ దాక్షాయణి దానిని సహింపలేక తన దేహాన్ని అగ్నిలోవేసి బూడిద చేసుకున్నది. ఆ పనికి ముందు దక్షునకు శివ మహిమను సుదీర్ఘంగా బోధించిన సందర్భంలోనిది ఈ పద్యం.

iBAT తాత్పర్యము

ఓయీ దక్షా! ఆ పరమేశ్వరుడు పట్టుదలతో ధర్మాన్ని కాపాడటంలో దిట్ట. అందులో రవంత మాలిన్యం కూడా అంటనివాడు. అధర్మాన్ని చీల్చిచెండాడే శీలం కలవాడు. అట్టి మహాత్ముణ్ణి కాదని కాఱుకూతలు కూసే పాపాత్ముని నాలుకను ముక్కలుముక్కలుగా కోసివేయాలి. ఆ పని చేయలేకపోతే తన్నుతాను రూపుమాపుకోవాలి. అదీ చేతకాకపోతే చెవులు రెండూ గట్టిగా మూసుకొని అక్కడనుండి దూరంగా వెళ్ళిపోవాలి. ధర్మాన్ని భద్రంగా పాటించేవాళ్ళు చేసే ఉపదేశం ఇది
4-108 అభ్రంలి హాదభ్ర... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అభ్రంలిహాదభ్ర విభ్ర మాభ్రభ్రమ; కృన్నీల దీర్ఘ శరీర మమరఁ
బ్రజ్వలజ్జ్వలన దీప్తజ్వాలికా జాల; జాజ్వల్యమాన కేశములు మెఱయఁ
జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ; సాహస్ర ధృత హేతిసంఘ మొప్ప
వీక్షణత్రయ లోకవీక్షణ ద్యుతి లోక; వీక్షణతతి దుర్నిరీక్ష్యముగను

(తేటగీతి)

గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ
ఘన కపాలాస్థి వనమాలికలును దనర
నఖిలలోక భయంకరుఁ డగుచు వీర
భద్రుఁ డుదయించె మాఱట రుద్రుఁ డగుచు.

iBAT సందర్భం

దక్షుడు పదవీగర్వంతో పరమేశ్వరునకు ఘోరమైన అవమానం చేశాడు. సతీదేవి సహించలేక దక్షునిముందే అగ్నిలోపడి బూడిద అయిపోయింది. రుద్రుడు దక్షునిపని చూడమని వీరభద్రుణ్ణి పంపాడు. ఆ వీరభద్రుని ఆవిర్భావాన్ని అద్భుతంగా అభివర్ణిస్తున్నది యీ పద్యం.

iBAT తాత్పర్యము

ఆకాశం అంచులుముట్టే ఊపుగల కాదు మేఘమా అనిపించే పొడవైన శరీరం ఒప్పారుతున్నది. భగభగా మండుతున్న అగ్నిజ్వాలలలాగా కేశములు వెలిగిపోతున్నాయి. భయం కలిగించే దిగ్గజాలు చాచిన పొడవైన తొండాలా అన్నట్లున్న వేయిచేతులలో వాడికత్తులు వేడిని క్రక్కుతూ కదలుతున్నాయి. మూడు కన్నులూ మూడు మార్తాండ బింబాలలాగా నిప్పులు క్రక్కుతూ లోకుల కన్నులకు చూడనలవికాకుండా మండిపోతున్నాయి. చాలా గట్టితనంగల రంపాలలాగా కోరలు పటపటలాడుతున్నాయి. పెద్దపెద్ద పుఱ్ఱెలతో, ఎముకలతో ఏర్పడిన మాలలు మెడనుండి కాళ్ళవరకూ వ్రేలాడుతున్నాయి. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయటానికై వీరభద్రుడు ఇలా మహాభయంకరంగా ఉదయించాడు
4-134 భాసురలీలగాంచిరి…
iBAA పద్య గానం
iBAP పద్యము
భాసురలీల గాంచిరి సు పర్వులు భక్తజనైకమానసో
ల్లాసము కిన్నరీజన విలాసము నిత్యవిభూతి మంగళా
వాసము సిద్ధగుహ్యక నివాసము రాజితభూవికాసికై
లాసము కాంతినిర్జిత కులక్షితిభృత్సుమహద్విలాసమున్

iBAT సందర్భం

దక్షయజ్ఞం సర్వనాశనం అయిపోయింది. ఆ యజ్ఞంలో పాల్గొన్న దేవతలు కూడా వీరభద్రుని ధాటికి నిలువలేకపోయారు. పరమేశ్వరుని కరుణను పొందాలనుకున్నారు. బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారందరినీ కైలాసానికి తీసుకొనివెళ్ళాడు. ఆ కైలాసం ఎలా ఉన్నదో ఈ పద్యం కమనీయంగా వివరిస్తున్నది.

iBAT తాత్పర్యము

పరమేశ్వరుని భక్తుల మనస్సులకు ఉల్లాసం కలిగించే ఒకేఒక చోటు కైలాసం. అక్కడ కిన్నరకాంతల ఇంపుసొంపులు చూడముచ్చటగా ఉంటాయి. సర్వకాలాలలో వెలుగొందే వైభవాలూ, మంగళా లూ అక్కడ కానవస్తాయి. సిద్ధులూ, యక్షులూ మొదలైన దేవజాతుల వారికి అది నివాసం. వెండి వెలుగులు నిండిన భూమితో అలరారుతూ ఉంటుంది. ఆ కైలాసపర్వతం కాంతులలో ఏడు కులపర్వతాల గొప్పవిలాసాలన్నీ వెలతెలబోతూ ఉంటాయి. అటువంటి కైలాస పర్వతాన్ని దేవతలు చూచారు.
4-137 ఉజ్జ్వలం బై... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఉజ్జ్వలంబయి శతయోజనంబుల పొడ;వొగి పంచసప్తతి యోజనముల
పఱపును గల్గి యే పట్టున తఱుగని; నీడ శోభిల్ల నిర్ణీతమగుచు
పర్ణశాఖా సమాకీర్ణమై మాణిక్య;ముల పోలగలఫలముల తనర్చి
కమనీయ సిద్ధయోగ క్రియామయమయి; కమనీయ సిద్ధయోగ క్రియామయమయి

(తేటగీతి)

భూరి సంసారతాప నివార కంబు
నగుచు తరురాజమనగ పెంపగ్గలించి
భక్తజనులకు నిచ్చలు ప్రమద మెసగ
వలయు సంపదలందు నావటము వటము

iBAT సందర్భం

బ్రహ్మ దేవతలనందరినీ వెంటబెట్టుకొని కైలాసానికి వెళ్ళాడు. వీరభద్రుని విజృంభణకు దెబ్బతిన్న దేవతలను కాపాడమని కైలాసవాసిని ప్రార్థించాలి. అక్కడ కైలాసంలో స్వామి ఒక మఱ్ఱిచెట్టు మొదట కూర్చున్నాడు. ఏ కొలతలకూ అందని స్వామికి ఆధార భూమి అయిన ఆ మఱ్ఱిచెట్టు ఎంతమహిమ కలదియో ఈ పద్యం వివరిస్తున్నది.

iBAT తాత్పర్యము

స్వామి కూర్చున్న ఆ మఱ్ఱిచెట్టు కాంతులను విరజిమ్ముతున్నది. నూరు ఆమడల పొడవు, డెబ్బది అయిదు యోజనాల వైశాల్యంతో ఒప్పారుతున్నది. ఏవేళనయినా దాని నీడ తఱుగదు. ఆకులు, కొమ్మలు దట్టంగా ఏర్పడి ఉన్నాయి. దాని పండ్లు మాణిక్యాలను తలపింపజేస్తున్నాయి. సొంపైన సిద్ధులు అక్కడ యోగక్రియలను హాయిగా చేసుకుంటారు. ఆవిధంగా ముక్తిని కోరేవారికి అది విడిదిపట్టు. ఘోరమైన సంసారతాపాన్ని అది రూపుమాపుతుంది. ఇన్ని కారణాలుగా అది వృక్షాలకు రాజుగా పేరు పొందింది. భక్తులకు పరమానందాన్ని కలిగిస్తుంది. కోరిన సంపదలను కూర్పగల మహావృక్షం ఆ మఱ్ఱిచెట్టు.
4-139 ఇద్ధ సనందాది... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఇద్ధసనందాది సిద్ధసంసేవిత; శాంతవిగ్రహుని వాత్సల్యగుణుని
కమనీయలోక మంగళదాయకుని, శివు; విశ్వబంధుని జగద్వినుత యశుని
గుహ్యక సాధ్యరక్షోయక్షనాథ కు;బేరసేవితుని దుర్వారబలుని
ఉదితవిద్యా తపోయోగయుక్తుని బాల; చంద్ర భూషణుని మునీంద్ర నుతుని

(తేటగీతి)

తాపసాభీష్టకరు భస్మదండలింగ
ఘనజటాజినధరుని, భక్తప్రసన్ను
వితతసంధ్యాభ్రరుచి విడంబిత వినూత్న
రక్తవర్ణు, సనాతను బ్రహ్మమయుని!

iBAT సందర్భం

అటువంటి మఱ్ఱిచెట్టు క్రింద ధ్యానంలో కూర్చున్న మహాదేవుణ్ణి దర్శించు కోవటానికి మహాకవి మనకు ఒక పరమసుందరమైన అక్షరచిత్రాన్ని అందిస్తున్నారు.

iBAT తాత్పర్యము

శ్రీ దక్షిణామూర్తి మహాస్వామిని తేజస్సుతో వెలుగొందే సనందుడు మొదలైన సిద్ధులు చక్కగా సేవించుకుంటున్నారు. ఆయన నిలువెల్లా నిండుగా ఉన్న శాంతాకారం కలవాడు. అందరియందూ, అన్నింటియందూ, తల్లికి బిడ్డలయందు ఉండే వాత్సల్యం ఆయనలో కానవస్తున్నది. లోకంలో అందరికీ శుభాలను కలిగించేస్వామి శివుడు. విశ్వానికి బంధువు. లోకాలన్నీ ఆయన కీర్తిని ఎల్లవేళలా కొనియాడుతూ ఉంటాయి. గుహ్యకులు, సాధ్యులు, రక్షస్సులు, యక్షులు అనే దేవజాతుల వారికందరికీ ఏలిక అయిన కుబేరుడు ఆయనను భక్తితో సేవిస్తున్నాడు. ఆ ప్రభువు బలాన్ని ఎవ్వరూ నిలువరించలేరు. పైకి పొంగుకొని వస్తున్న విద్యలూ, తపస్సూ, యోగమూ అతని సొమ్ములు. నెలవంక ఆయన తలపై అలంకారంగా విరాజిల్లుతున్నది. మునీంద్రులు నోరారా ఆయనను కొనియాడుతున్నారు. తపస్వు ల కోరికలన్నీ ఆయన వలన తీరుతున్నాయి. భక్తులయెడల ప్రసన్నంగా ఉంటాడు. సంజకెంజాయలను మరపింపజేసే ఎర్రని కాంతులతో చూడముచ్చటగా ఉన్నాడు. సనా తనుడు. సాక్షాత్తూ పరబ్రహ్మమే.
4-140 అంచిత వామపాదాంభోరుహము... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అంచితవామ పాదాంభోరుహము దక్షి;ణోరుతలంబున నొయ్య నునిచి
సవ్యజానువుమీద భవ్యబాహువు సాచి; వలపలి ముంజేత సలలితాక్ష
మాలిక ధరియించి మహనీయ తర్క ము;ద్రా యుక్తుడగుచు చిత్తంబులోన
అవ్యయంబయిన బ్రహ్మానందకలిత స;అవ్యయంబయిన బ్రహ్మానందకలిత స

(తేటగీతి)

యోగపట్టాభిరాముడై ఉచితవృత్తి
రోషసంగతి బాసి కూర్చున్న జముని
యనువునను దర్భరచిత బ్రుస్యాసనమున
నున్న మునిముఖ్యు నంచితయోగ నిరతు.

iBAT సందర్భం

బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు మొదలైన మహాత్ములు శ్రీ దక్షిణామూర్తి అయిన మహాదేవుని ఇలా సందర్శించుకుంటున్నారు.

iBAT తాత్పర్యము

ఆ దక్షిణామూర్తి మహాదేవుడు. తన ఎడమకాలిని కుడి తొడపై చక్కగా పెట్టుకొని ఉన్నాడు. ఎడమ మోకాలిమీదికి చేతిని చాపి ఉంచాడు. కుడి ముంజేతితో మిక్కిలి సుకుమారమైన స్ఫటికమాలను పట్టుకొని ఉన్నాడు. కుడిచేతితో చాలా గొప్పభావాన్ని తలపించే జ్ఞానముద్రను ప్రదర్శిస్తున్నాడు. ఆ జ్ఞానమూర్తిని పరిశీలిస్తుంటే ఆయన హృదయంలో బ్రహ్మానందం తాండవిస్తున్న స్ఫూర్తి కలుగుతుంది. మాత్సర్యం ఏమాత్రమూ లేనివాడు. యమధర్మరాజు రోషాన్నంతటినీ వదలించుకొని యోగపీఠం మీద పట్టాభిషిక్తుడై ఉన్నాడా అనిపిస్తున్నాడు. దర్భలతో అల్లిన ఆసనంమీద కూర్చుండి యోగసంపదను నిరంతరంగా సంపాదించుకుంటున్నాడు. అట్టి దక్షిణామూర్తిని బ్రహ్మాదులు సందర్శించుకున్నారు.
4-163 మానిత శ్యామాయమాన... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మానితశ్యామాయమాన శరీర దీ;ధితులు నల్దిక్కుల దీటుకొనగ,
కాంచనమేఖలా కాంతులతోడ, కౌ;శేయ చేలద్యుతుల్ చెలిమిసేయ
లక్ష్మీసమాయుక్త లలితవక్షంబున ; వైజయంతీ ప్రభల్ వన్నె సూప
హాటకరత్న కిరీటకోటిప్రభల్; బాలార్క రుచులతో మేలమాడ

(తేటగీతి)

లలితనీలాభ్రరుచి కుంతలములు తనర
ప్రవిమలాత్మీయ దేహజప్రభ సరోజ
భవభవామరముఖ్యు ల ప్రభలు మాప
అఖిలలోకైక గురుడు నారాయణుండు.

iBAT సందర్భం

ప్రజాపతి అయిన దక్షుడు ఒక గొప్పయజ్ఞం చేస్తున్నాడు. దానిని చూచి ఆనందం పొందటానికి దేవతలు, దేవతా సార్వభౌములూ చాలామంది విచ్చేశారు. సర్వలోకాలకూ గురువైన శ్రీమన్నారాయణుడు కూడా విచ్చేశాడు. ఆ రాకను వివరిస్తున్న సందర్భంలోనిది ఈ పద్యం.

iBAT తాత్పర్యము

మన్నన పొందటానికి వీలైన నీలదేహం కాంతులు నాలుగు దిక్కులకూ వ్యాపిస్తున్నాయి. బంగారు మొలత్రాటి ప్రభలతో పట్టుపీతాంబరం వెలుగులు చెలిమి చేస్తున్నాయి. లక్ష్మీదేవికి ఆటపట్టయిన వక్షఃస్థలంమీద వైజయంతి కాంతులు వెలిగిపోతున్నాయి. రత్నాలు పొదిగిన బంగారు కిరీటపుశోభలు ఉదయిస్తున్న సూర్యుని ప్రభలతో ఆడుకుంటున్నాయి. సుకుమారమైన నల్లనిమేఘం వన్నెలతో స్వామి కేశాలు విరాజిల్లు తున్నాయి. మిక్కిలి నిర్మలమైన ఆ ప్రభువు దేహం నుండి వెలువడే దీప్తి బ్రహ్మ, శివుడు, దేవేంద్రుడు మొదలైనవారి ప్రభలను తక్కువ చేస్తున్నది. ఈ కాంతిపుంజములతో ప్రకాశిస్తున్న సర్వాలోకాలకూ గురువైన శ్రీమన్నారాయణుడు దక్షయజ్ఞానికి విచ్చేశాడు.
4-181 దితిసంతాన వినాశసాధన... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
దితిసంతాన వినాశసాధన సముద్దీప్తాష్ట బాహాసమ
న్వితమై యోగిమనోనురాగపదమై వెల్గొందునీ దేహమా
యతమైనట్టి ప్రపంచముం బలెను మిథ్యాభూత ముంగామి శా
శ్వతముంగా మదిలో తలంతు హరి! దేవా! దైవచూడామణీ.

iBAT సందర్భం

దక్షయజ్ఞం దర్శించటానికి విచ్చేసిన శ్రీమన్నారాయణ స్వామిని బ్రహ్మాదులు చాలా గొప్పగా స్తుతించారు. అందులో దేవేంద్రుడు చేసిన స్తుతి ఈ విధంగా ఉన్నది.

iBAT తాత్పర్యము

స్వామీ! దేవతాసార్వభౌమా! శ్రీమన్నారాయణా! నీ ఈ దేహం ఎనిమిది పెద్ద చేతులతో అలరారుతూ ఉన్నది. ఆచేతులు రక్కసిమూకల నాశనానికి సాధనాలై గొప్ప కాంతులతో వెలిగిపోతున్నాయి. యోగుల హృదయాల అనురాగానికి తావు అయినది నీ దేహం. అతివిశాలమైన ఈ ప్రపంచంలాగా అది అబద్ధమైనది కాదు. అందువలన ఈ నీ దేహం ఎన్నటికీ నిలిచి ఉండేదీ, ఎన్నటికీ నాశనం పొందనిదీ అని నేను భావిస్తున్నాను.
4-193 విశ్వాత్మ నీయందు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
విశ్వాత్మ! నీయందు వేఱుగా జీవుల;గన డెవ్వడట వానికంటె ప్రియుడు
నీకు లేడు, అయినను నిఖిలవిశ్వోద్భవ ; స్థితి విలయంబులకతన నైన
సంగతి నిర్భిన్నసత్త్వాదిగుణవిశి ; ష్టాత్మీయ మాయచే నజభవాది
వివిధభేదము లొందుదువు, స్వస్వరూంపంబు; నందుండుదువు, వినిహతవిమోహి

(తేటగీతి)

వగుచునందువు గద, నిన్ననన్యభక్తి
భృత్యభావంబు తాల్చి సంప్రీతి గొల్చు
మమ్ము రక్షింపవే కృపామయ! రమేశ!
పుండరీకాక్ష! సంతత! భువనరక్ష.

iBAT సందర్భం

దక్షయజ్ఞాన్ని చక్కదిద్దటానికి వచ్చిన శ్రీమహావిష్ణువును కనుగొని యోగీశ్వరులీ విధంగా స్తుతించారు..

iBAT తాత్పర్యము

స్వామీ! నారాయణా! విశ్వమంతా నీవే! నీకంటె వేరుగా జీవులు ఉన్నారు అనుకోవటం అజ్ఞానం. ఆ అజ్ఞానం లేనివారికంటె నీకు ప్రియమైనవాడు లేడు. అంటే నీకు జ్ఞానులంటే చాలా ఇష్టం. అయినా ఈ విశ్వమంతా ఏర్పడటానికీ, నిలిచి ఉండటానికీ, మళ్ళీ నీలో కలసిపోవటానికీ నీవే వేరువేరుగా రజస్సు, సత్త్వము తమస్సు అనే గుణాలతో కూడిన నీదే అయిన మాయతో బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా ఇంకా పెక్కుదేవతలుగా రూపా లను పొందుతూ ఉంటావు. అయినా నీకు నీదయినజ్ఞానం ఏమాత్రమూ జారిపోదు. కనుక నిలువెల్లా కృపయే అయిన దేవా! లక్ష్మీపతీ! పద్మములవంటి కన్నులున్న ప్రభూ! అంతటా వ్యాపించి ఉండు సర్వాత్మకా! లోకాలనన్నింటినీ కాపాడే ఆదిదేవా! నిన్ను మాత్రమే భక్తితో,మిక్కిలి ప్రీతితో సేవకులమై కొలిచే మమ్ములను కాపాడు తండ్రీ!
4-251 హార కిరీట కేయూర... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
హారకిరీట కేయూర కంకణ ఘన ; భూషణుం డాశ్రితపోషణుండు
లాలిత కాంచీకలాపశోభిత కటి ; మండలుం డంచిత కుండలుండు
మహనీయ కౌస్తుభమణియుక్తమైన గ్రై ; వేయకుండానందదాయకుండు
సలలిత ఘనశంఖచక్రగదా పద్మ ; హస్తుండు భువన ప్రశస్తు డజుడు

(తేటగీతి)

కమ్రసౌరభవనమాలిజా ధరుండు
హతవిమోహుండు నవ్యపీతాంబరుండు
లలితకాంచన నూపురాలంకృతుండు
నిరతిశయసద్గుణుడు దర్శనీయతముడు.

iBAT సందర్భం

ప్రేమతో తండ్రి ఒడిలో కూర్చోవటానికి ఉబలాటపడిన ధ్రువుణ్ణి సవతితల్లి త్రోసివేసి అవమానించింది. బాలుని గుండె కుతకుతలాడిపోయింది. తల్లి అనుమతితో తపస్సు చేసుకోవటానికి బయలుదేరాడు ధ్రువుడు. భాగ్యవశంచేత అతనికి దారిలో నారదమునీంద్రుడు కనపడి శ్రీమన్నారాయణ’ తత్త్వాన్ని, తపస్సు పద్ధతినీ ఉపదేశిస్తూ ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

నాయనా! ధ్రువా! నారాయణుడు హారాలు, కిరీటమూ, బాహుపురులూ, వలయాలూ మొదలైన గొప్ప నగలతో అలంకరింపబడినవాడు. తనను ఆశ్రయించినవారిని పోషిస్తూ ఉంటాడు. చక్కని మొలత్రాడు పేటలతో శోభలను వెలువరిస్తున్న నుడుము కలవాడు. కాంతులతో అలరారుతున్న కుండలాలు కలవాడు. వెలకట్టరాని కౌస్తుభమణితో కూడియున్న కంఠంలో వ్రేలాడుతున్న సువర్ణహారం కలవాడు. అందరికీ ఆనందం అందిస్తున్నవాడు. అందచందాలతో ప్రకాశిస్తున్న శంఖము, చక్రము, గద, పద్మము చేతులందు ఉంచుకొన్నవాడు. అందువలననే ఆతనిని లోకులందరూ కొనియాడుతూ ఉంటారు. కమ్మని సువాసనలతో గుబాళిస్తున్న వనమాలను ధరించి ఉంటాడు. ఇన్ని మహావస్తువులు ఉన్నా దేనియందూ వ్యామోహంలేని మహాత్ముడు. ఎప్పటికప్పుడు క్రొత్త పట్టువస్త్రాలు ధరిస్తూ ఉంటాడు. చీలమండ దగ్గర మనోహరమైన అందియలు సొంపును పెంపు చేస్తున్నాయి. అతని సద్గుణాలను మించేవి సృష్టిలో మరెక్కడా ఉండవు. ప్రాణులందరికీ చూడముచ్చట అయినవాడు.
4-253 దూర్వాంకురంబుల... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము ; జలజంబులను చారుజలజనయను
తులసీదళంబుల తులసికా దాముని ; మాల్యంబులను సునైర్మల్యచరితు
పత్రంబులను పక్షిపత్రుని, కడువన్య ; మూలంబులను ఆదిమూలఘనుని
అంచిత భూర్జత్వగాది నిర్మిత వివి ; ధాంబరంబులను పీతాంబరధరు

(తేటగీతి)

తనరుభక్తిని మృచ్ఛిలాదారు రచిత
రూపములయందు గాని నిరూఢమైన
సలిల ములయందు గాని సుస్థలములందు
గాని పూజింపవలయు నక్కమలనాభు.

iBAT సందర్భం

నారద మునీంద్రుడు కుమారుడైన ధ్రువునకు పరమాత్మ అయిన నారాయణుని ఏవిధంగా పూజించాలో చక్కగా ఉపదేశిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

కుమారా! ధ్రువా! పరమాత్మ మన సౌకర్యంకోసం ఆకారం ధరించి మన ముందు మెలగుతూ ఉంటాడు. ఆ స్వరూపానికి మనం పూజలు చేస్తూ పుణ్యం సంపాదించుకోవాలి. ఆ స్వామి లేత గరికవంటి దేహకాంతి కలవాడు. కాబట్టి లేతగరికలు ఆయనకు సమర్పించుకోవాలి. అందమైన పద్మాలవంటి నేత్రాలు ఆయనవి. వానిని భావిస్తూ పద్మాలతో పూజించాలి. ఆయనకు తులసీదళాలమాలను ధరించటం ఇష్టం. కాబట్టి తులసీ దళాలను సమర్పించుకోవాలి. ఆయన అతి నిర్మలమైన నడవడి కలవాడు. మాలలతో అర్చించాలి. స్వామికి వాహనం పక్షి. పూజకు పనికివచ్చే పత్రాలు ఆయనకు ఇచ్చుకోవాలి. సృష్టికీ, దేవతలకూ, సర్వమునకూ ఆయన మూలకారణం. కాబట్టి వనాలలోని మొక్కల వ్రేళ్ళను తెచ్చి పూజలు చేయాలి. ఆయన పచ్చని పట్టుబట్ట ధరిస్తాడు. మేలైన బూరుగుచెట్టు మొదలైనవాని పట్టలతో నేసిన వస్త్రాలు అందించాలి. మట్టితోగానీ, రాతితో గానీ, కొయ్యతో గానీ రూపొందించుకొన్న విగ్రహాన్ని ముందు పెట్టుకొని అర్చనలు చెదరని భక్తితో చేయాలి. లేదా పవిత్రమైన నదీజలములయందు కూడా చేయవచ్చు. అలాగే మహిమగల క్షేత్రాలలో కూడా ఆచరించవచ్చు. ఆయన కమలనాభుడు. ఈ సృష్టినంతా చేస్తున్న బ్రహ్మకు జన్మనిచ్చిన పద్మం బొడ్డునందు ఉన్నవాడు.
4-287 సర్వేశ కల్పాంత... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సర్వేశ! కల్పాంత సమయంబునందు నీ ; యఖిల ప్రపంచంబు నాహరించి
అనయంబు శేషసహాయుండవై శేష ; పర్యంకతలమున పవ్వళించి
యోగనిద్రారతినుండి నాభీసింధు ; జస్వర్ణలోకకంజాతగర్భ
మందు చతుర్ముఖు నమర పుట్టించుచు ; రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన

(తేటగీతి)

నీకు మ్రొక్కెద అత్యంత నియమ మొప్ప
భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర!
చిరశూభాకార! నిత్యలక్ష్మీవిహార
అవ్యయానంద! గోవింద! హరి! ముకుంద.

iBAT సందర్భం

ధ్రువుని తపస్సు పంట పండింది. స్వామి సాక్షాత్కరించాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన అతని చెక్కిలిపై నారాయణుడు వేదమయమైనది, నాదమయమైనదీ అయిన శంఖాన్ని తాకించినంతనే ధ్రువుని వదనం నుండి కమనీయ స్తుతి వాక్యాలు వెలువడ్డాయి. అందులోనిది యీ పద్యం.

iBAT తాత్పర్యము

సర్వమునకూ పాలకుడవైన ప్రభూ! గొప్ప చరిత్రగల స్వామీ! పద్మపత్రాలవంటి నేత్రాలుగల సుందరమూర్తీ! నీయందు నిరంతరం శ్రీదేవి విహరిస్తూ ఉంటుంది. సర్వకాలాలలో తరుగువోని ఆనందం నీది. గోవిందా! హరీ! ముక్తిప్రదాతా! నీవు కల్పం ముగిసే సమయంలో ఈ సర్వప్రపంచాన్నీ నీలో కలుపుకుంటావు. ఆదిశేషుడు నీకు సహాయకుడు. ఆ శేషశయ్యమీద పవ్వళించి యోగనిద్రలో ఆనందం పొందుతూ ఉంటావు. నీబొడ్డు అనేది ఒకనది. అందులోని బంగారు భవనంనుండి నాలుగుమోముల దేవుడు బ్రహ్మను పుట్టిస్తూ ఉంటావు. నీవు పరబ్రహ్మవు. అట్టి నీకు గట్టి పట్టుదలతో మ్రొక్కుతూ ఉంటాను.
4-553 అది గాన పద్మలోచన... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అదిగాన, పద్మలోచన
సదమలభవదీయఘనయశము వినుటకునై
పదివేల చెవులు కృప ని
మ్మదియే నాయభిమతంబు నగును ముకుందా!

iBAT సందర్భం

ఇది పృథుచక్రవర్తి కథలోని పద్యం. పృథువు చాలా గొప్పమనీషి. ఆయన పేరుతోనే భూమికి పృథివి అనే పేరు ఏర్పడింది. ఆయన మహాత్మకు సంతోషించి శ్రీమన్నారాయణుడు అతనికి దర్శనం అనుగ్రహించాడు. పృథువు విష్ణువును స్తుతిస్తూ ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

దేవా! పుండరీకాక్షా! నాకు నీ పాదపద్మాల భక్తియే కావాలి. నీ కీర్తిని సర్వకాలాలలో అన్ని అవస్థలలో పాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఆవంతయినా మచ్చలేనిదయిన నీ గొప్పకీర్తిని వినటానికై దయతో నాకు పదివేల చెవులివ్వు. నీవు ముకుందుడవు. భక్తులకు ముక్తినిచ్చే ప్రాభవం కలవాడవు. నాకు అదే యిష్టమైన వరం. వేరువరం నేను కోరను.
4-581 నారాయణుండు జగదాధారుం... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నారాయణుండు జగదా
ధారుం డగు నీశ్వరుండు; దలఁప నతనికిన్
లే రెందు సములు నధికులు
ధీరోత్తముఁ డతఁడు నద్వితీయుం డగుటన్.

iBAT సందర్భం

పృథు చక్రవర్తి యజ్ఞాలూ, తపస్సూ చేసి శ్రీమన్నారాయణుని వలన ప్రశంసలందుకున్నాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మేరకు రాజ్యపరిపాలన చేయడానికి తన పట్టణానికి తిరిగివచ్చాడు. ఆ రాజుకు విప్రవరులతో వాసుదేవుడు ఉన్నాడా లేడా అనే విషయంలో చర్చ కలిగింది. అందులో అతడు వారితో ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

విప్రవర్యులారా! వాసుదేవుడు ఉన్నాడు.ఊరకే ఉండడం కాదు. లోకాలన్నింటికీ ఆధారమై ఉన్నాడు. ఇంకా ఈశ్వరుడై పాలిస్తూ ఉన్నాడు. మరొక్క విషయం. అతనితో సమానులు లేరు. అతనిని మించినవారు కూడా లేరు. అతనితో పోల్చి చెప్పతగినవాడు ఒక్కడు కూడా లేని కారణంగా అతడు ధీరుడు ఉత్తముడూ అయ్యి వెలుగొందుతూ ఉన్నాడు. ధీరుడంటే అందరికీ మించిన బుద్ధిశక్తితో ఎక్కడా ఎప్పుడూ ఎదురులేనివాడు. అతనికంటే గొప్పవాడని చెప్పడానికి ఎవరూ లేరు కనుక ఉత్తముడు. అందువలననే ఆయనకు నారాయణుడు అనే ప్రతిష్ఠతో కూడిన పేరు కలిగింది.
4-583 కర్మవశంబునన్ జగము... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
కర్మవశంబునం జగము గల్గును హెచ్చు నడంగు నన్నచో
గర్మముఁ బుద్ధిఁ జూడ జడకార్యము; గాని ప్రపంచ కల్పనా
కర్మమునందుఁ గర్త యనఁగా విలసిల్లఁగఁ జాల; దీ జగ
త్కర్మక కార్యకారణము గావున నీశుఁడు విష్ణుఁ డారయన్.

iBAT సందర్భం

పృథు చక్రవర్తి బ్రాహ్మణోత్తములకు నారాయణుడు ఉన్నాడని తర్కపటిమతో చెప్పి ఆ మహావిష్ణువు ఈశ్వరుడు ఎలా అయ్యాడో నిరూపిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

'అదేమయ్యా! జగత్తులన్నీ కర్మవశం చేత కదా కలుగుతున్నాయి, పెంపొందుతున్నాయి, మళ్ళీ అణిగిపోతున్నాయి. మధ్యలో వీనిని చేసేవాడు నారాయణుడెందుకవుతాడూ?' అంటారేమో. అది సరియైన మాట కాదు. బుద్ధిశక్తినుపయోగించి చూస్తే, తనంత తాను స్వయంగా ప్రవర్తించే స్వతంత్ర పదార్థం కాదు కర్మము. అందువలన అది జడము. రాయీ రప్పా వంటిది. దానిని సృష్టించినవాడు కూడా ఒకడు ఉన్నాడు. కాబట్టి అట్టిదానిని ప్రపంచాన్ని కల్పించే పనిలో ' కర్త ' అని చెప్పే అవకాశం లేదు. అందువలన ఈ జగత్తు అనే పనికి, కారణమైన వాడు, తనకు ఒక కారణం లేనివాడు అయిన స్వతంత్రుడు విష్ణువే.
4-608 భువి నెవ్వనియెడ... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
భువి నెవ్వని యెడ విప్రులు
భవుఁడును విష్ణుఁడుఁ దదీయ భక్తులును బ్రస
న్నవదను లగుదురు వానికి
భువిని దివి నసాధ్యకర్మములు లే వనఘా.

iBAT సందర్భం

ఒకనాడు పృథు చక్రవర్తి దగ్గరకు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనే జ్ఞాన సంపన్నులు విచ్చేశారు. మహాభక్తితో రాజు వారికి పూజలు చేసి తన అదృష్టాన్ని కొనియాడుకుంటూ ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

ఒకనాడు పృథు చక్రవర్తి దగ్గరకు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనే జ్ఞాన సంపన్నులు విచ్చేశారు. మహాభక్తితో రాజు వారికి పూజలు చేసి తన అదృష్టాన్ని కొనియాడుకుంటూ ఇలా అంటున్నాడు.
4-702 పంకజనాభాయ సంకర్షణాయ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పంకజనాభాయ, సంకర్షణాయ, శాం;తాయ, విశ్వప్రబోధాయ, భూత
సూక్ష్మేంద్రియాత్మనే, సూక్ష్మాయ, వాసుదే;వాయ, పూర్ణాయ, పుణ్యాయ, నిర్వి
కారాయ, కర్మవిస్తారకాయ,త్రయీ;పాలాయ, త్రైలోక్యపాలకాయ,
సోమరూపాయ, తేజోబలాఢ్యాయ, స్వ;యం జ్యోతిషే, దురంతాయ, కర్మ

(తేటగీతి)

సాధనాయ, పురాపురుషాయ, యజ్ఞ
రేతసే, జీవతృప్తాయ, పృథ్విరూప
కాయ, లోకాయ, నభసేం, తకాయ, విశ్వ
యోనయే, విష్ణవే, జిష్ణవే, నమోస్తు.

iBAT సందర్భం

ప్రాచీనబర్హి అనే మహారాజునకు సముద్రుని కూతురూ మహా సౌందర్యవతీ అయిన శతధృతి వలన పదిమంది కొడుకులు కలిగారు. వారందరూ, ఒకే పేరూ, ఒకే తీరూ కలవారు. వారిని ప్రచేతసులు అంటారు. వారు గొప్పతపస్సు చేసి రుద్రుని అనుగ్రహం సంపాదించి అతని వలన ' రుద్రగీత ' అనే ఒక మహామంత్రాన్ని ఉపదేశంగా పొందారు. అది శ్రీమన్నారాయణుని మంగళ స్తోత్రం. శ్రీరుద్రదేవుడు వారికి ఉపదేశరూపంగా ఆ స్తుతిని ఇలా ప్రారంభించాడు.

iBAT తాత్పర్యము

శ్రీమన్నారాయణదేవా! దేవదేవా! నీవు బ్రహ్మకు జన్మనిచ్చిన పద్మం నాభిలో ఉన్నవాడవు. నిన్ను సంకర్షణుడని అంటారు. ఎందుకంటే ప్రళయకాలంలో ప్రాణకోటినంతటినీ నీలోనికి లాగివేసుకుంటావు. నీవు శాంతుడవు. విశ్వాలనన్నిటినీ మేల్కొలుపుతావు. పంచభూతాల సూక్ష్మతత్త్వాలు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేవి నీ స్వరూపాలే! నీవు ఇంద్రియాలకు గోచరింపవు గనుక సూక్ష్ముడవు. అన్నింటిలో నీవు ఉంటావు, అన్నీ నీలో ఉండి వెలుగొందుతూ ఉంటాయి కనుక వాసుదేవుడవు. నీవు పూర్ణుడవు, పుణ్యుడవు, ఏ వికారాలూ నీకు లేవు. ప్రాణులను కర్మబంధాల నుండి విడుదల చేయించే స్వామివి. వేదాలను పరిరక్షిస్తూ ఉంటావు. అలాగే మూడులోకాలను కాపాడుతూ ఉంటావు. చంద్రుడవు నీవు. గొప్ప తేజోబలం గల సూర్యుడవు కూడా నీవే! అన్నింటినీ నీవు ప్రకాశింపచేస్తావు. కానీ, నిన్ను ప్రకాశింప చేయగల తేజస్సు మరొకటి లేదు. నీకు అంతం లేదు. ప్రాణులందరూ ఆయా కార్యాలనన్నింటినీ నీ వలననే సాధిస్తారు. నీవు సనాతనుడవు. యజ్ఞాలకు బీజం నీవే! భూమి అంతా నీ రూపమే! అన్ని లోకాలూ నీవే. ఆకాశం నీవే. యముడు నీ రూపమే. ఈ విశ్వమంతా నీ నుండియే వెలువడింది. నీవు అంతటా వ్యాపించి ఉంటావు. నీవు జయించటమే శీలం అయిన వాడవు. స్వామీ! నీకు నమస్సు, నమస్సు, నమస్సు!
4-703 స్వర్గాపవర్గ సుద్వారాయ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
స్వర్గాపవర్గ సుద్వారాయ, సర్వర;సాత్మనే, పరమహంసాయ, ధర్మ
పాలాయ, సద్ధిత ఫలరూపకాయ, కృ;ష్ణాయ, ధర్మాత్మనే, సర్వశక్తి
యుక్తాయ, ఘన సాంఖ్య యోగీశ్వరాయ, హి;రణ్య వీర్యాయ, రుద్రాయ, శిష్ట
నాథాయ, దుష్ట వినాశాయ, శూన్య ప్ర;వృత్తాయకర్మణే, మృత్యవే

(తేటగీతి)

విరాట్ఛరీరాయ, నిఖిల ధర్మాయ, వాగ్వి
భూతయే, నివృత్తాయ, సత్పుణ్య భూరి
వర్చసే,ఖిల ధర్మదేహాయ, చాత్మ
నే, నిరుద్ధాయ, నిభృతాత్మనే, నమోస్తు.

iBAT సందర్భం

ప్రచేతసుల కోసం శ్రీరుద్రుడు శ్రీమన్నారాయణస్వామిని ఇంకా ఇలా స్తుతిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

స్వామీ! స్వర్గానికీ, అపవర్గం అనే మోక్షానికీ నీవే ద్వారం. సర్వరసాలూ నీ స్వరూపమే! నీవు యోగసిద్ధి పొందిన పరమహంసవు. ధర్మపాలుడవు. సత్పురుషులకు హితమైన ఫలాన్ని అనుగ్రహించే స్వామివి. కృష్ణుడవు. ధర్మాత్ముడవు. సర్వశక్తులూ నీయందే నిండుగా ఉన్నాయి. గొప్పదైన సాంఖ్యయోగానికి ప్రభువైన కపిలుడవు నీవే. నీది స్వర్ణమయమైన తేజస్సు. నిన్ను రుద్రుడు అని కూడా అంటారు. అందరి రోదనాలను తొలగించివేస్తావు కదా. మంచి శీలం గలవారికి నాథుడవు నీవే. దుష్టులను రూపుమాపేవాడవు నీవే. కానీ నీకంటూ ఒక ప్రవృత్తి లేదు. కర్మస్వరూపుడవు, మృత్యుస్వరూపుడవు, నీ దేహంలో విశ్వమంతా నెలకొని ఉన్నది. అన్ని ధర్మాలూ నీకు సంబంధించినవే, అన్ని వాక్కులూ నీ విభూతులే. నీకు ఏ తగులములూ లేవు. ఉదాత్తపుణ్యకార్యాల దివ్యకాంతులను నీయందే చూడాలి. నీవు సర్వధర్మ స్వరూపుడవు. పరమాత్మవు. నిన్ను నిలువరింపగలిగేవాడు లేడు. పరిపూర్ణమైన స్వరూపం నీది. దేవా! స్వామీ! ప్రభూ! ఇట్టి నీకు మా మ్రొక్కులు.
4-704 సర్వసత్త్వాయ దేవాయ... (తేటగీతి).
iBAA పద్య గానం
iBAP పద్యము
సర్వసత్త్వాయ, దేవాయ, సన్నియామ
కాయ, బహిరంతరాత్మనే, కారణాత్మ
నే, సమస్తార్థ లింగాయ, నిర్గుణాయ,
వేధసే, జితాత్మక సాధవే, నమోస్తు.

iBAT సందర్భం

ప్రచేతసుల కొఱకై రుద్రుడు నారాయణ తత్త్వాన్ని స్తుతి రూపంలో ఇలా సంభవిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

స్వామీ! ఆదిదేవా! ఏ మాత్రమూ దేనితోనూ కలయిక లేని సత్త్వస్వరూపం నీది. అంతేకాదు సృష్టిలోని సర్వ ప్రాణులూ నీ స్వరూపాలే. అందువలననే నీవు దేవుడవు. అన్నింటినీ, అందరినీ, హద్దులలో నిలుపగల ప్రభుడవు నీవు. ప్రాణులందరికీ వెలుపలా, లోపలా ఉండి ఆడిస్తున్న మహాస్వామివి నీవు. సర్వులకూ, సర్వమునకూ కారణమైనవాడవు నీవు. సర్వ జీవకోటినీ, చైతన్యం లేని పదార్థాలను ఇది ఇది అని గుర్తించడానికి వీలైన ఏర్పాటు చేసిన మహాశిల్పివి నీవు. గుణముల అంటుసొంటులు లేనివాడవు. సృష్టి అంతటికీ కర్తవు నీవు. ఇంద్రియాలమీద పట్టు చిక్కించుకున్న యోగులకు మేలుచేసే స్వామివి నీవు. అట్టి నీకు ఎల్లవేళలా నమస్కరిస్తూ ఉంటాము.
4-713 ఎనసిన భక్తియోగమున... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఎనసిన భక్తియోగమున నే భవదీయపదాబ్జ మూలము
న్ననయముఁ బొందువాఁడు చటులాగ్రహ భీషణ వీర్య శౌర్య త
ర్జనములచే ననూనగతి సర్వజగంబులు సంహరించు న
య్యనుపముఁ డైన కాలుని భయంబును బొందఁడు సుమ్ము కావునన్.

iBAT సందర్భం

శ్రీ పరమేశ్వరుడు ప్రచేతసులకు రుద్రగీతను ఉపదేశిస్తూ వారికోసం తానే శ్రీమన్నారాయణుని మహిమను కొనియాడుతున్నాడు

iBAT తాత్పర్యము

దేవాదిదేవా! ఏ మానవుడు నీదైన పాదపద్మాల మూలాన్ని ఉప్పొంగిన భక్తియోగంతో అందుకుంటాడో, అట్టి మహాభక్తుడు, అతి తీవ్రమైన కోపంతో, భయంకరమైన శక్తిసామర్ధ్యాలను చూపుతూ బెదిరింపులతో అత్యంత వేగంతో అన్ని లోకాలనూ నాశనం చేసే పనిలో అతనికతడే సాటియనదగిన యముని వలన ఎన్నటికీ భయం పొందడు సుమా!
4-718 సరసిజనాభ సత్పురుషసంగ... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
సరసిజనాభ! సత్పురుషసంగ సమంచిత భక్తి యోగ వి
స్ఫురణ ననుగ్రహింపబడి శుద్ధము నొందినవాని చిత్త మ
స్థిర బహిరంగముం గనదు; చెందదు భూరి తమస్స్వరూప సం
సరణ గుహన్ జిరంబు గనఁజాలు భవన్మహనీయ తత్త్వమున్.

iBAT సందర్భం

రుద్రదేవుడు మునుపు బ్రహ్మదేవుడు సనకాదులను ఉపదేశించిన రుద్రగీతను ప్రచేతసులకు బోధిస్తూ ఆ స్వామి వాసుదేవుని గూర్చి యిలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

బ్రహ్మగారి సృష్టికి కారణమైన పద్మం నాభియందు విరాజిల్లే నారాయణా! సత్పురుషుల సాంగత్యం వలన మరింత ఉజ్జ్వలంగా ప్రకాశించే భక్తియోగంతో మానవుని చిత్తం నిర్మలం అవుతుంది. అప్పుడు అది చంచలమైన వెలుపలి ప్రపంచాన్ని చూడదు. లెక్కకు అందని అజ్ఞానస్వరూపమైన సంసారమనే గుహలోనికి చేరుకోదు. అంతేకాదు, నీదైన మహనీయతత్త్వాన్ని నిత్యమూ పొందగలుగుతుంది.
4-916 కేశవ సంతత... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కేశవ! సంతత క్లేశ నాశనుఁడవు; కోరి మనో వా గగోచరుఁడవు
నిద్ధ మనోరథ హేతుభూ తోదార; గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల
విశ్వోద్భవస్థితి విలయార్థ ధారిత; విపుల మాయాగుణ విగ్రహుఁడవు
మహి తాఖి లేంద్రియ మార్గ నిరధిగత; మార్గుఁడ వతిశాంత మానసుఁడవు

(తేటగీతి)

తవిలి సంసారహారి మేధస్కుఁడవును
దేవదేవుఁడవును వాసుదేవుఁడవును
సర్వభూతనివాసివి సర్వసాక్షి
వైన నీకు నమస్కారమయ్య! కృష్ణ!

iBAT సందర్భం

ప్రచేతసులు చేసిన తపస్సు పంటకు వచ్చింది. శ్రీమన్నారాయణమూర్తి వారికి తన దర్శనభాగ్యాన్ని అనుగ్రహించాడు. అప్పుడు ఆనంద సముద్రంలో హాయిగా మునకలు వేస్తున్నవారు స్వామితో ఇలా అంటున్నారు

iBAT తాత్పర్యము

కేశవా! నీవు ఎడతెగకుండా వచ్చిపడే ఘోరమైన కష్టాలనన్నింటినీ రూపు మాపుతావు. నీవు మనస్సులకూ, మాటలకూ అందనివాడవు. నీ గుణాలూ, నీ పేరులూ, భక్తుల హృదయాలలో చెలరేగే మోక్షకాంక్షను చక్కగా ఫలవంతం చేస్తాయి. సత్త్వగుణం నీ సొమ్ము సమస్త లోకాల పుట్టుక, స్థితి, వినాశమూ అనే పనులను నిర్వహించడానికి నీవు మాయాగుణాలతో కూడిన రూపాలను స్వీకరిస్తావు. ఇంద్రియమార్గాలన్నీ నీ మార్గం దగ్గర నిలిచి పోతాయి. ఆ మార్గాలు నీ మార్గంలో అడుగు కూడా పెట్టలేవు. ప్రశాంతమైన మనస్సుతో విరాజిల్లుతూ ఉంటావు. భక్తుల సంసారమనే ఘోరమైన బంధాన్ని ఎలా నాశనం చేయాలో తెలిసిన జ్ఞానస్వరూపుడవు నీవు. దేవదేవుడవు. వాసుదేవుడవు. సర్వభూతాల హృదయాలే నీ ఆలయాలు. నీవు సర్వసాక్షివి. కృష్ణా! వాసుదేవా! నీకు నమస్కారాలు చేస్తూనే ఉంటాము.
4-918 తోయరుహోదరాయ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
తోయరుహోదరాయ, భవదుఃఖహరాయ, నమోనమః పరే
శాయ, సరోజ కేసర పిశంగ వినిర్మల దివ్య నవ్య వ
స్త్రాయ, పయోజ సన్నిభ పదాయ, సరోరుహ మాలికాయ, కృ
ష్ణాయ, పరాపరాయ, సుగుణాయ, సురారి హరాయ, వేధసే.

iBAT సందర్భం

ప్రచేతసులు శ్రీకృష్ణపరమాత్మను ఇంకా ఇలా సంస్కృతపదజాలంతో ప్రస్తుతిస్తూ నమస్కరిస్తున్నారు.

iBAT తాత్పర్యము

జనార్ధనా! నీవు బ్రహ్మ పుట్టుకకు కారణమైన పద్మాన్ని నాభియందు ధరించినవాడవు. సంసార దు:ఖాన్ని హరించివేస్తావు. పరమాత్మవు. నీవు ధరించిన పట్టువస్త్రం పద్మాలలోని కింజల్కాల పసిమివన్నెతో అత్యంతము, నిర్మలమై, దివ్యమై నవ్యమై ఒప్పారుతూ ఉంటుంది. నీ పాదాలు పద్మాలవలె కాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. నీవు మెడనుండి పాదాలవరకూ ధరించే వనమాల మనోజ్ఞమైన తమ్మిపూలతో నిండి చూచేవారికి చూడముచ్చటగా ఉంటుంది. నీవు ఇంద్రుడు, బ్రహ్మ, పరమేశ్వరుడు మొదలగు వారికంటె మహాత్ముడవు. సృష్టిలో ఉండే సుగుణాలన్నీ నిన్నే ఆశ్రయించుకుని ఒప్పారుతున్నాయి. మ్రుక్కడి రక్కసులను చంపివైచి సాధువులను సంరక్షిస్తూ ఉంటావు.నీవు బ్రహ్మదేవునకు కూడా తండ్రివి. అట్టి నీకు వేలకొలది నమస్కారాలు.
4-950 చర్చింప నరుల... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
చర్చింప నరులకే జన్మకర్మాయుర్మ;నో వచనంబుల దేవదేవుఁ
డఖిల విశ్వాత్మకుం డైన గోవిందుండు; విలసిల్లు భక్తి సేవింపఁబడును
నవియ పో, జన్మ కర్మాయు ర్మనో వచ;నములని ధరణి నెన్నంగఁ దగును
వనరుహనాభ సేవా రహితము లైన; జననోపనయన దీక్షాకృతంబు

(తేటగీతి)

లైన జన్మంబు లేల? దీర్ఘాయు వేల?
వేద చోదిత యగు కర్మ వితతి యేల?
జప తపశ్శ్రుత వాగ్విలాసంబు లేల?
మహిత నానావధాన సామర్థ్య మేల?

iBAT సందర్భం

ప్రచేతసులు శ్రీమన్నారాయణుని ఆజ్ఞను శిరసావహించి తమ కుమారుని కడ తమ ధర్మపత్నిని ఉంచి వనవాసానికి వెళ్ళారు. అక్కడ ఆత్మవిజ్ఞానం పొందాలని సంకల్పం చేసికొని ఉండగా వారి కడకు సర్వలోకప్రియుడైన నారదుడు విచ్చేశాడు. వారు అతనికి తగిన విధంగా గౌరవ మర్యాదలు చేసి అతనితో ప్రసంగ చేస్తూ మాకు ఆత్మతత్త్వాన్ని బోధించమని అడిగారు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

దేవమహర్షీ! దేవదేవుడు శ్రీమన్నారాయణుడు మానవులకు పుట్టునూ, ప్రత్యేక కర్మములనూ, ఆయువు, మనస్సు, మాట అనేవానినీ అనుగ్రహించాడు. మానవుడు వానితో అతిశయించిన భక్తితో అఖిల విశ్వమూ తనదే అయిన గోవిందుణ్ణి నిరంతరమూ సేవించాలి. అప్పుడే ఆ పుట్టుకా మొదలైనవానికి సార్థకత చేకూరుతుంది. అలా కాక పద్మనాభుని సేవ లేని జన్మమూ, ఉపనయనము మొదలైన సంస్కారములూ పనికిమాలినవైపోతాయి. ఆ జన్మ సార్థకం కానిదవుతుంది. వానికి పెద్దకాలం బ్రతకడం ప్రయోజనకరం కాదు. వాడు చేసే జపము, తపము, వేదాలు వల్లించడం, చిలక పలుకుల వంటి మాటలాడడం మొదలైనవన్నీ వ్యర్థం. పెక్కు విషయాల మీద ధ్యానం ఉంచడం వంటి పనులు కూడా పనికిమాలినవే అయిపోతాయి.
4-956 అరయ న్నభ్రతమః ప్రభల్... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
అరయన్నభ్రతమః ప్రభల్ మును నభంబం దొప్పఁగాఁ దోచి క్ర
మ్మఱ వీక్షింపఁగ నందె లేనిగతి బ్రహ్మంబందు నీ శక్తులున్
బరికింపన్ ద్రిగుణప్రవాహమున నుత్పన్నంబు లై క్రమ్మఱన్
విరతిం బొందుచు నుండుఁ గావున హరిన్ విష్ణున్ భజింపం దగున్.

iBAT సందర్భం

తమకు ఆత్మతత్త్వం ఉపదేశించవలసినదిగా ప్రార్థించిన ప్రచేతసులతో దివ్యజ్ఞానసంపన్నుడైన నారద మహాముని యిలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

నాయనలారా! చూడండి. గగనంలో కారు మేఘాలు కదలాడుతూ ఉంటాయి. వాని వలన క్రిందనున్న వారికి చీకట్లు క్రమ్ముకున్నట్లు ఉంటుంది. కానీ, కొద్ది క్షణాలలోనే ఆ మబ్బులు విచ్చుకునిపోతాయి. స్వచ్చమైన ఆకాశం వెలుగులను నింపుతూ కానవస్తుంది. అలాగే బ్రహ్మమునందు ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేవి సత్త్వము, రజస్సు, తమస్సు అనేవాని ప్రవాహంలో పడి ఉన్నట్లుగా కనబడుతూ ఉంటాయి. మళ్ళీ నామరూపాలు లేకుండా పోతాయి. అలా తోచడానికీ, పోవడానికీ, కారణమైనవాడు శ్రీమహావిష్ణువు. ఆ చీకట్లను హరించేవాడు కనుక హరి అని కూడా ఆయనను అంటారు. అట్టి హరిని సేవిస్తే అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం వెలిగిపోతుంది.