చిత్రంబులు త్రైలోక్య ప
విత్రంబులు భవలతా లవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజన వన
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్.
అలుక నైనఁ జెలిమి నైనఁ గామంబున
నైన బాంధవమున నైన భీతి
నైనఁ దగిలి తలఁప నఖిలాత్ముఁ డగు హరిఁ
జేర వచ్చు వేఱు సేయఁ డతఁడు.
కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధు లై వృష్ణులున్,
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రిం గంటి; మెట్లైన ను
ద్ధామధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!
గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్, దిక్కులన్,
రేలన్, ఘస్రములన్, దమఃప్రభల, భూరిగ్రాహ రక్షో మృగ
వ్యా ళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్, సమస్తాస్త్ర శ
స్త్రాళిన్, మృత్యువులేని జీవనము లోకాధీశ! యిప్పింపవే.
అన్నా! కశ్యపపుత్ర! దుర్లభము లీ యర్థంబు లెవ్వారికిన్;
మున్నెవ్వారలుఁ గోర రీ వరములన్; మోదించితిన్నీయెడన్
నన్నుం గోరిన వెల్ల నిచ్చితిఁ బ్రవీణత్వంబుతో బుద్ధి సం
పన్నత్వంబున నుండుమీ! సుమతి వై భద్రైకశీలుండ వై.
తన యందు నఖిల భూతము లందు నొకభంగి; సమహితత్వంబున జరుగువాఁడు;
పెద్దలఁ బొడగన్న భృత్యునికైవడిఁ; జేరి నమస్కృతుల్ చేయువాఁడు;
కన్నుదోయికి నన్యకాంత లడ్డం బైన; మాతృభావము సేసి మరలువాఁడు;
తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను; దీనులఁ గావఁ జింతించువాఁడు;
సఖుల యెడ సోదరస్థితి జరుపువాఁడు;
దైవతము లంచు గురువులఁ దలఁచువాఁడు
లీల లందును బొంకులు లేనివాఁడు;
లలిత మర్యాదుఁ డైన ప్రహ్లాదుఁ డధిప!
పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షింపుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం
ధానుం డై మఱచెన్ సురారిసుతుఁ డే తద్విశ్వమున్ భూవరా!
ఎల్ల శరీరధారులకు నిల్లను చీఁకటినూతి లోపలం
ద్రెళ్ళక "వీరు నే" మను మతిభ్రమణంబున భిన్ను లై ప్రవ
ర్తిల్లక "సర్వమున్నతని దివ్యకళామయ" మంచు విష్ణునం
దుల్లముఁ జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ!
మందార మకరంద మాధుర్యమునఁ దేలు; మధుపంబు బోవునే? మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు; రాయంచ జనునె? తరంగిణులకు
లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు; కోయిల చేరునే? కుటజములకుఁ
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక; మరుగునే? సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయునేల?
చదివించిరి నను గురువులు
సదివితి ధర్మార్థ ముఖర శాస్త్రంబులు నేఁ
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మ మెల్లఁ జదివితిఁ దండ్రీ!
తను హృ ద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరి న్నమ్మి స
జ్జనుఁ డై యుండుట భద్ర మంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా!
అంధేం దూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక స
ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ
బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ స
ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్.
కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
దేవదేవుని చింతించు దినము దినము;
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
దండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి.
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే?; పవన గుంభిత చర్మభస్త్రి గాక;
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే?; ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక;
హరిపూజనము లేని హస్తంబు హస్తమే?; తరుశాఖ నిర్మిత దర్వి గాక?
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే?; తను కుడ్య జాల రంధ్రములు గాక;
చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాదయుగముతోడి పశువు గాక.
సంసారజీమూత సంఘంబు విచ్చునే?; చక్రి దాస్యప్రభంజనము లేక;
తాపత్ర యాభీల దావాగ్ను లాఱునే?; విష్ణుసేవామృత వృష్టి లేక;
సర్వంకషాఘౌఘ జలరాసు లింకునే?; హరి మనీషా బడబాగ్ని లేక;
ఘన విప ద్గాఢాంధకారంబు లణగునే?; పద్మాక్షు నుతి రవిప్రభలు లేక;
నిరుప మాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధిఁ గానవచ్చునే? ముఖ్య మైన
శార్ఙ్గ కోదండ చింతనాంజనము లేక
తామరసగర్భునకు నైన దానవేంద్ర!
కాననివాని నూఁతగొని కాననివాఁడు విశిష్ట వస్తువుల్
గాననిభంగిఁ గర్మములు గైకొని కొందఱు కర్మబద్ధు లై
కానరు విష్ణుఁ, గొంద ఱటఁ గందుఁ రకించన వైష్ణవాంఘ్రి సం
స్థాన రజోభిషిక్తు లగు సంహృతకర్ములు దానవేశ్వరా!
బలయుతులకు దుర్భలులకు
బల మెవ్వఁడు నీకు నాకు బ్రహ్మాదులకున్
బల మెవ్వఁడు ప్రాణులకును
బల మెవ్వం డట్టి విభుఁడు బల మసురేంద్రా!
కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిన్
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటన్
గలఁ, డీశుండు గలండు, దండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.
ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే గలఁడు దానవాగ్రణి! వింటే.
హరి సర్వాకృతులం గలం డనుచుఁ బ్రహ్లాదుండు భాషింప స
త్వరుఁడై యెందును లేఁడు లేఁ డని సుతుం దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుఁడు నానా జంగమస్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండప్రభావంబునన్.
నరమూర్తిగాదు కేవల
హరిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే
సరియాకారము నున్నది
హరి మాయారచిత మగు యథార్థము సూడన్.
అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చి
త్తములన్నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పా
రము ముట్టన్నుతిసేయ నోప రఁట; నే రక్షస్తనూజుండ గ
ర్వ మదోద్రిక్తుఁడ బాలుఁడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే?
జలజాతప్రభవాదులున్ మనములోఁ జర్చించి భాషావళిన్
బలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ యింటిలోఁ
జెలి యై మేనమఱంది యై సచివుఁ డై చిత్తప్రియుం డై మహా
ఫలసంధాయకుఁ డై చరించుట మహాభాగ్యంబు రాజోత్తమా!