ఎమ్మెలు సెప్పనేల? జగ మెన్నఁగఁ బన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని భక్తి లో
నమ్మినవాని భాగవత నైష్ఠికుఁ డై తగువానిఁ బేర్మితో
బమ్మెఱ పోతరాజు కవిపట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్.
ఎయ్యది కర్మబంధముల నెల్ల హరించు విభూతికారణం
బెయ్యది సన్మునీంద్రులకు నెల్లఁ గవిత్వసమాశ్రయంబు ము
న్నెయ్యది సర్వమంత్రముల నేలిన దెయ్యది మోక్షలక్ష్మి రూ
పెయ్యది దానిఁ బల్కెద సుహృద్యము భాగవతాఖ్య మంత్రమున్.
భాగవతము తేటపఱుప నెవ్వఁడు సాలు
శుకుఁడు దక్క నరుని సఖుఁడు దక్క
బుద్ధిఁ దోచినంత బుధులచే విన్నంత
భక్తి నిగిడినంత పలుకువాఁడ.
కొందఱు పుణ్యవర్తనులు గోపకుమార పదారవింద జా
నంద మరందపాన కలనారత షట్పదచిత్తు లౌచు గో
వింద పరాయణుల్ విమలవేషులు దోష మడంతు రాత్మలం
జెందిన భక్తిచేత రవి చేకొని మంచు నడంచు కైవడిన్.
హరిభక్తిచేతఁ గొందఱు
పరిమార్తురు మొదలు ముట్టఁ బాపంబుల ని
ష్ఠురతర కరముల సూర్యుం
డరదుగఁ బెనుమంచు పించ మణఁచిన భంగిన్.
సతతముఁ గృష్ణ పాదజలజంబుల యందు మనంబు నిల్పు సు
వ్రతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని యుగ్రపాశ సం
హతుల ధరించు తత్సుభటవర్గములం గలలోనఁ గాన రే
గతులను దుష్టకర్మములు గైకొని వారలఁ జెందనేర్చునే?
దూరమున నాడు బాలుఁడు
బోరనఁ దన చిత్తసీమఁ బొడగట్టిన నో!
నారాయణ! నారాయణ!
నారాయణ! యనుచు నాత్మనందను నొడివెన్.
నెమ్మిఁ దొడలమీఁద నిద్రించు చెలికాని
నమ్మఁదగినవాఁడు నయము విడిచి
ద్రోహబుద్ధిఁ జంపఁ దొడరునే? యెందైనఁ
బ్రీతి లేక ధర్మదూతలార!
బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని;కీలలు హరినామ కీర్తనములు;
గురుతల్ప కల్మష క్రూరసర్పములకుఁ; గేకులు హరినామ కీర్తనములు;
తపనీయ చౌర్య సంతమసంబునకు సూర్య; కిరణముల్ హరినామ కీర్తనములు;
మధుపాన కిల్బిష మదనాగ సమితికిఁ; గేసరుల్ హరినామ కీర్తనములు;
మహిత యోగోగ్ర నిత్యసమాధి విధుల
నలరు బ్రహ్మాది సురులకు నందరాని
భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య
ఖేలనంబులు హరినామ కీర్తనములు.
కామంబు పుణ్యమార్గ
స్థేమంబు మునీంద్ర సాంద్ర చేతస్సరసీ
ధామంబు జిష్ణు నిర్మల
నామంబుఁ దలంచువాఁడు నాథుఁడు గాడే?
బిడ్డపేరు పెట్టి పిలుచుట విశ్రామ
కేళి నైన మిగులఁ గేలి నైనఁ
బద్య గద్య గీత భావార్థముల నైనఁ
గమలనయనుఁ దలఁపఁ గలుషహరము.
అతిపాపములకుఁ బ్రయత్న పూర్వకముగఁ; దనుపాపములకు మితంబుగాఁగ
సన్ముని వరులచే సంప్రోక్త మై యుండు; నిర్మలం బగు పాప నిష్కృతములు
క్రమరూపమున నుపశమనంబు లగుఁ గాని; తత్క్షణంబున నవి దరువ లేవు;
సర్వకర్మంబుల సంహార మొనరించి; చిత్తంబునకుఁ దత్త్వసిద్ధి నొసఁగు
నొనర నీశు సేవ, యోగిమానస సరో
వాసు సేవ, హేమవాసు సేవ,
వేదవేద్యు సేవ, వేదాంత విభు సేవ,
పరమపురుష పాదపద్మ సేవ.
హరిభక్తులతో మాటలు
ధర నెన్నఁడుఁ జెడని పుణ్యధనముల మూటల్
వర ముక్తికాంత తేటలు
నరిషడ్వర్గంబు చొరని యరుదగు కోటల్.
కోరినవారల కెల్లను
జేరువ కైవల్యపదము సిరివరుని మదిం
గోరనివారల కెల్లను
దూరము మోక్షాప్తి యెన్ని త్రోవలనైనన్.
అభవు నమేయు నవ్యయు ననంతు ననారతుఁ బూని మేనిలో
నుభయము నై వెలుంగు పురుషోత్తముఁ గానరు చిత్త కర్మ వా
గ్విభవ గరిష్ఠు లై వెదకి వీఱిఁడి ప్రాణులు; సర్వవస్తువుల్
శుభగతిఁ జూడనేర్చి తనుఁ జూడఁగనేరని కంటిపోలికన్.
వర మహాద్భుత మైన వైష్ణవజ్ఞానంబు; తిరముగా నెవ్వరు తెలియఁగలరు?
దేవాదిదేవుండు త్రిపురసంహరుఁ డొండెఁ; గమలసంభవుఁ డొండెఁ గార్తికేయ
కపిల నారదు లొండె గంగాత్మజుం డొండె; మను వొండె బలి యొండె జనకుఁ డొండెఁ
బ్రహ్లాదుఁ డొండె నేర్పాటుగా శుకుఁ డొండె; భాసురతరమతి వ్యాసుఁ డొండెఁ
గాక యన్యుల తరమె? యీ లోకమందు
నీ సుబోధంబు సద్బోధ మీ పదార్థ
మీ సదానంద చిన్మయ మీ యగమ్య
మీ విశుద్ధంబు గుహ్యంబు నీ శుభంబు.
ఈ పన్నిద్దఱు దక్కఁగ
నోపరు తక్కొరులు దెలియ నుపనిష దుచిత
శ్రీపతినామ మహాద్భుత
దీపిత భాగవతధర్మ దివ్యక్రమమున్.
ఏది జపియింప నమృతమై యెసఁగుచుండు
నేది సద్ధర్మపథ మని యెఱుఁగ దగిన
దదియె సద్భక్తి యోగంబు నావహించు
మూర్తిమంతంబు దా హరికీర్తనంబు.
శ్రుత్యంత విశ్రాంత మత్యనుక్రమణీయ; భగవత్ప్రసంగతుల్ భాగవతులు;
సనకాది ముని యోగిజన సదానందైక; పరమ భాగ్యోదయుల్ భాగవతులు;
కృష్ణపదధ్యాన కేవ లామృతపాన; పరిణామ యుతులు శ్రీభాగవతులు;
బహుపాత కానీక పరిభవ ప్రక్రియా; పురుషోగ్ర మూర్తులు భాగవతులు;
భావ తత్త్వార్థ వేదులు భాగవతులు;
బ్రహ్మవా దానువాదులు భాగవతులు;
సిరులు దనరంగ నెన్నఁడుఁ జేటులేని
పదవి నొప్పారువారు వో భాగవతులు.
ఎకసక్కెమున కైన నిందిరారమణునిఁ; బలుకంగలేని దుర్భాషితులను
కలలోన నైన శ్రీకాంతుని సత్పాద; కమలముల్ సూడని కర్మరతుల
నవ్వుచు నైనఁ గృష్ణప్రశంసకుఁ జెవిఁ; దార్పనేరని దుష్కథా ప్రవణుల
యాత్రోత్సవంబుల నైన నీశుని గుడి; త్రోవఁ ద్రొక్కఁగలేని దుష్పదులను
బరమ భాగవతుల పాదధూళి సమస్త
తీర్థసార మనుచుఁ దెలియలేని
వారి వారివారి వారిఁ జేరినవారిఁ
దొలుతఁ గట్టి తెండు దూతలార!
అరయఁ దనదు జిహ్వ హరిపేరు నుడువదు
చిత్త మతని పాదచింతఁ జనదు;
తలఁపఁ దమకు ముక్తి తంగేటి జున్నొకో?
సకల విష్ణుభక్తులకును బోలె.
పద్మనయను మీఁది భక్తి యోగం బెల్ల
ముక్తి యోగ మనుచు మొద లెఱుంగు
వారి వారివారి వారిఁ జేరినవారిఁ
త్రోవఁ బోవవలదు దూతలార!
స్వాయంభువ మనువేళల
నోయయ్య! సురాసురాండజోరగ నర వ
ర్గాయత సర్గము దెలిపితి
పాయక యది విస్తరించి పలుకం గదవే.
తప్పక యర్భకావళికిఁ దల్లియుఁ దండ్రియు నేత్రపంక్తికిన్
ఱెప్పలు నాతికిం బతి నరేంద్రుఁడు లోకుల కెల్ల నర్ధికి
న్నొప్ప గృహస్థు మూఢులకు నుత్తము లెన్నగ వీరు బాంధవుల్
ముప్పునఁ గావలేని కడుమూర్ఖులు గారు నిజాల చుట్టముల్.
గరుడుని మూఁపుపై బదయుగంబు ఘటిల్లఁగ శంఖ చక్ర చ
ర్మ రుచిర శార్ఙ్గ ఖడ్గ శర రాజితపాశ గదాది సాధనో
త్కర నికరంబు లాత్మకరకంజములన్ ధరియించి భూతి సం
భరిత మహాష్టబాహుఁడు కృపామతితో ననుఁ గాచుఁ గావుతన్.
ప్రకట మకర వరుణ పాశంబు లందుల
జలములందు నెందుఁ బొలియకుండఁ
గాచుఁగాక నన్ను ఘనుఁడొక్కఁ డై నట్టి
మత్యమూర్తి విద్యమానకీర్తి.
వటుఁడు సమాశ్రిత మాయా
నటుఁడు బలిప్రబలశోభనప్రతిఘటనో
ద్భటుడు త్రివిక్రమదేవుఁడు
చటుల స్థలమందు నన్ను సంరక్షించున్.
అడవుల సంకటస్థలుల నాజిముఖంబుల నగ్ని కీలలం
దెడరుల నెల్ల నాకు నుతి కెక్కఁగ దిక్కగుఁగాక శ్రీనృసిం
హుఁడు కనకాక్ష రాక్షస వధోగ్రుడు విస్ఫురి తాట్టహాస వ
క్త్రుఁడు ఘన దంష్ట్ర పావక విధూత దిగంతరుఁ డప్రమేయుఁడై.
అరయఁగ నెల్ల లోకములు నంకిలి నొంద మహార్ణవంబులో
నొరిగి నిమగ్న మైన ధర నుద్ధతిఁ గొమ్మున నెత్తినట్టి యా
కిరిపతి యజ్ఞకల్పుఁ డురుఖేలుఁడు నూర్జిత మేదినీమనో
హరుఁడు కృపావిధేయుఁడు సదాధ్వములన్ననుఁ గాచుఁ గావుతన్.
రాముఁడు రాజకులైక వి
రాముఁడు భృగు సత్కులాభిరాముఁడు సుగుణ
స్తోముఁడు నను రక్షించును
శ్రీమహితోన్నతుఁడు నద్రి శిఖరములందున్.
తాటక మర్దించి తపసి జన్నముఁ గాచి; హరువిల్లు విఱిచి ధైర్యమున మెఱసి
ప్రబలు లైనట్టి విరాధ కబంధోగ్ర; ఖర దూషణాది రాక్షసులఁ దునిమి
వానరవిభు నేలి వాలిఁ గూలఁగ నేసి; జలరాశి గర్వంబుఁ జక్కజేసి
సేతువు బంధించి చేరి రావణ కుంభ;కర్ణాది వీరులఁ గడిమిఁ ద్రుంచి
యల విభీషణు లంకకు నధిపుఁ జేసి
భూమిసుతఁ గూడి సాకేతపురము నందు
రాజ్యసుఖములు గైకొన్న రామవిభుఁడు
వరుస ననుఁ బ్రోచుచుండుఁ బ్రవాసగతుల.
దండంబు యోగీంద్రమండల నుతునకు; దండంబు శార్ఙ్ఘ కోదండునకును;
దండంబు మండిత కుండలద్వయునకు; దండంబు నిష్ఠుర భండనునకు;
దండంబు మత్తవేదండ రక్షకునకు; దండంబు రాక్షసఖండనునకు;
దండంబు పూర్ణేందుమండల ముఖునకు; దండంబు తేజః ప్రచండునకును;
దండ మద్భుత పుణ్యప్రధానునకును;
దండ ముత్తమ వైకుంఠధామునకును;
దండ మాశ్రిత రక్షణ తత్పరునకు;
దండ మురు భోగినాయక తల్పునకును.
అకట! దిక్కుల కెల్ల దిక్కైన మాకు
నొక్క దిక్కును లేదు కా లూనఁ నైన;
దిక్కు గావయ్య! నేఁడు మా దిక్కుఁ జూచి
దిక్కు లేకున్నవారల దిక్కు నీవ.
నీ దిక్కు గానివారికి
నే దిక్కును వెదక నుండ దిహపరములకున్
మోదింపఁ దలఁచువారికి
నీ దిక్కే దిక్కు సుమ్ము; నీరజనాభా!