గోవిందనామ కీర్తనఁ
గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరి
త్రీవిభుఁడు సూఱగొనియెను
గైవల్యముఁ దొల్లి రెండు గడియల లోనన్.
హరిమయము విశ్వమంతయు,
హరి విశ్వమయుండు, సంశయము పనిలే దా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన! వింటే.
కమనీయ భూమి భాగములు లేకున్నవే; పడియుండుటకు దూది పఱుపు లేల?
సహజంబులగు కరాంజలులు లేకున్నవే; భోజన భాజన పుంజ మేల?
వల్కలాజినకుశావళులు లేకున్నవే; కట్ట దుకూల సంఘాత మేల?
గొనకొని వసియింప గుహలు లేకున్నవే; ప్రాసాద సౌధాది పటల మేల?
ఫల రసాదులు గురియవే? పాదపములు;
స్వాదుజలముల నుండవే? సకలనదులుఁ;
పొసఁగ బిక్షయుఁ వెట్టరే? పుణ్యసతులు;
ధనమదాంధుల కొలువేల? తాపసులకు.
రక్షకులు లేనివారల
రక్షించెద ననుచుఁ జక్రి రాజై యుండన్
రక్షింపు మనుచు నొక నరు
నక్షముఁ బ్రార్థింపనేల? యాత్మజ్ఞునకున్.
నారాయణుని దివ్య నామాక్షరములపైఁ; గరఁగని మనములు గఠిన శిలలు
మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ; మిళితమై యుండని మేను మొద్దు
చక్రికి మ్రొక్కని జడుని యౌదల నున్న; కనక కిరీటంబు గట్టె మోపు
మాధవార్పితముగా మనని మానవు సిరి; వన దుర్గ చంద్రికా వైభవంబు
కైటభారి భజన గలిగి యుండని వాఁడు
గాలిలోననుండి కదలు శవము
కమలనాభు పదముఁ గనని వాని బ్రతుకు
పసిఁడికాయలోని ప్రాణి బ్రతుకు.
ఏ విభు వందనార్చనము లే విభు చింతయు నామకీర్తనం
బే విభులీల లద్భుతము లెవ్వని సంశ్రవణంబు సేయ దో
షావలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగు నండ్రు నే
నా విభు నాశ్రయించెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్.
ఏ పరమేశు పాదయుగ మెప్పుడు గోరి భజించి నేర్పరుల్
లోపలి బుద్ధిలో నుభయలోకము లందుల సక్తిఁ బాసి, యే
తాపము లేక బ్రహ్మగతిఁ దారు గతశ్రములై చరింతు; రే
నా పరమేశు మ్రొక్కెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్.
తపముల్ సేసిననో, మనోనియతినో, దానవ్రతప్రీతినో,
జపమంత్రంబులనో, శ్రుతిస్మృతులనో, సద్భక్తినో యెట్లు ల
బ్దపదుండౌ నని బ్రహ్మ రుద్ర ముఖరుల్, భావింతు రెవ్వాని న
య్యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుం డౌఁ గాక నా కెప్పుడున్.
పూర్ణుఁ డయ్యును మహాభూత పంచక యోగ;మున మేనులను బురములు సృజించి
పురములలోనుండి పురుష భావంబున; దీపించు నెవ్వడు ధీరవృత్తిఁ
బంచ భూతములను బదునొకం డింద్రయ;ములఁ బ్రకాశింపించి భూరి మహిమ
షోడశాత్మకుఁ డన శోభిల్లి జీవత్వ; నృత్య వినోదంబు నెఱపుచుండు
నట్టి భగవంతుఁ డవ్యయుఁ డచ్యుతుండు
మానసోదిత వాక్పుష్ప మాలికలను
మంజు నవరస మకరంద మహిమ లుట్ట
శిష్ట హృద్భావ లీలలఁ జేయుఁగాత.
ఆ యీశుఁ డనంతుఁడు హరి
నాయకుఁ డీ భువనములకు, నాకున్, నీకున్,
మాయకుఁ బ్రాణివ్రాతము
కే యెడలన్ లేదు నీశ్వ రేతరము సుతా!
పరమాత్ముం డజుఁ డీ జగంబుఁ బ్రతికల్పంబందుఁ గల్పించు దాఁ
బరిరక్షించును ద్రుంచు నట్టి యనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగ
ద్భరితుం గేవలు నద్వితీయుని విశుద్ధజ్ఞాను సర్వాత్ము నీ
శ్వరు నాద్యంతవిహీను నిర్గుణుని శశ్వన్మూర్తిఁ జింతించెదన్.
హరిఁ బరమాత్ము నచ్యుతు ననంతునిఁ జిత్తములోఁ దలంచి సు
స్థిరత విశోక సౌఖ్యములఁ జెందిన ధీనిధు లన్య కృత్యముల్
మఱచియుఁ జేయ నొల్లరు ;తలంచిన నట్టిదయౌ; సురేంద్రుఁడుం
బరువడి నుయ్యి; ద్రవ్వుచు నిపాన ఖనిత్రము మాను కైవడిన్.
కారణకార్య హేతువగు కంజదళాక్షుని కంటె నన్యు లె
వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో
దారుని సద్గుణావళు లుదాత్తమతిన్ గొనియాడకుండినన్
జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్.
ఉపవాసవ్రత శౌచ శీల మఖ సంధ్యోపాస నాగ్నిక్రియా
జప దానాధ్యయ నాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర; ద
చ్చపు భక్తిన్ హరిఁ బుండరీకనయనున్ సర్వాతిశాయిన్ రమా
ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతుని నర్థిం గొల్వలేకుండినన్.
హరి యందు నాకాశ; మాకాశమున వాయు; వనిలంబువలన హుతాశనుండు;
హవ్యవాహను నందు నంబువు; లుదకంబు; వలన వసుంధర గలిగె; ధాత్రి
వలన బహుప్రజావళి యుద్భవం బయ్యె; నింతకు మూలమై యెసఁగునట్టి
నారాయణుఁడు చిదానంద స్వరూపకుం; డవ్యయుం, డజరుఁ, డనంతుఁ, డాఢ్యుఁ,
డాది మధ్యాంత శూన్యుం, డనాదినిధనుఁ,
డతనివలనను సంభూత మైన యట్టి
సృష్టి హేతు ప్రకార మీక్షించి తెలియఁ
జాల రెంతటి మునులైన జనవరేణ్య!
ధరణీశోత్తమ! భూతసృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా
హరి కర్తృత్వము నొల్లఁ డాత్మగత మాయారోపితంజేసి తా
నిరవద్యుండు నిరంజనుండు పరుఁడున్ నిష్కించనుం డాఢ్యుఁడున్
నిరపేక్షుండును నిష్కళంకుఁ డగుచున్ నిత్యత్వమున్ బొందెడిన్.
రామ! గుణాభిరామ! దినరాజ కులోంబుధి సోమ! తోయద
శ్యామ! దశాననప్రబలసైన్య విరామ! సురారి గోత్ర సు
త్రామ! సుబాహు బాహుబల దర్ప తమః పటు తీవ్ర ధామ! ని
ష్కామ! కుభృల్ల లామ! గరకంఠ సతీ నుత నామ! రాఘవా!